వ్యక్తిగత సమాచారం ప్రమాదంలోకి..

0
177

గోప్యతకు తగిన రక్షణ విషయంలో అస్పష్టత
పీఎం డీఎంహెచ్‌పై ఆరోగ్య నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ : ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం)ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ప్రారంభించారు. ఆధార్‌ కార్డు తరహాలో ప్రతి వ్యక్తి లేదా సంస్థ కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించే ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు (యునీక్‌ హెల్త్‌ ఐడెంటిఫైయర్‌- యూహెచ్‌ఐడీ) వ్యవస్థను ఏర్పాటు చేయడం మిషన్‌ ముఖ్య ఉద్దేశం. వ్యక్తి (లేదా సంస్థ) ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్‌ (ఈహెచ్‌ఆర్‌)కు ఇది అను సంధానమై ఉంటుంది. ఈహెచ్‌ఆర్‌లు రోగుల పూర్తి వైద్య చరిత్ర (పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్స, ప్రిస్క్రిప్షన్‌లు మొదలైనవి)కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ వెర్షన్‌. వీటిని వైద్యులతో సజావుగా, సమర్థవంతంగా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, సమాచార గోప్యత విషయంలో ఎడీహెచ్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ ప్రభావం గురించి ఆరోగ్యవేత్తలు, నిపుణులు ఆందోళనలు లేవనెత్తారు.

హెల్త్‌ డేటా మేనేజ్‌మెంట్‌ పాలసీ విశ్లేషణ ప్రకారం.. ఇది వ్యక్తిగత స్వయంప్రతిపత్తి, సమాచార సమ్మతి, గోప్యత, గోప్యతకు తగిన రక్షణతో వైద్య రికార్డుల డిజిటలైజేషన్‌ చేపట్టబడుతుందని నిర్ధారించలేదు. సెంటర్‌ ఫర్‌ హెల్త్‌, ఈక్విటీ, లా అండ్‌ పాలసీ (సీ-హెల్ప్‌), ఐఎల్‌ఎస్‌ లా కాలేజ్‌, ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) ద్వారా విశ్లేషణ జరిగింది. ఈ పాలసీ ప్రభుత్వ, ప్రయివేటురంగ సంస్థల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌, ఆరోగ్య సమాచారాన్ని పంచుకోవటాన్ని పర్యవేక్షించే స్వతంత్ర నియంత్రణ అధికారాన్ని ఏర్పాటుచేయదు. ఇంకా, హెచ్‌డీ ఎంపీ కేవలం అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం బాధ్యతలు, జరిమానాలు ఉంటాయని పేర్కొన్నది. పైన పేర్కొన్న దాని ప్రకారం.. సమాచార భద్రత చట్టం లేనప్పుడు, ” ప్రస్తుత చట్టాలకు డేటా ఉల్లం ఘించబడే వివిధ మార్గాలను కవర్‌ చేయడానికి తగిన జరిమానాలు ఉండవు”. అయితే, ప్రమాదం ఉన్నప్పటికీ, కో-విన్‌ పోర్టల్‌ ద్వారా టెలిమెడిసిన్‌, కోవిడ్‌-19 టీకా డ్రైవ్‌తో సహా ఎన్‌డీహెచ్‌ఎం- హెచ్‌డీఎంపీ ఫ్రేమ్‌వర్క్‌తో ముడిపడి ఉన్న మరిన్ని డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమాలను జోడించడంలో భారత ప్రభుత్వం ముందుకు సాగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవైపు, యూహెచ్‌ఐడీ, ఈహెచ్‌ఆర్‌ లు ఆరోగ్య సంరక్షణను మరింత ఖర్చుతో కూడుకున్నవిగా అందుబాటులోకి తీసుకు రాగలవు. మరోవైపు, వ్యక్తిగత ఆరోగ్య డేటా గోప్యత, గోప్యత, రక్షణ మరియు డిజిటల్‌ నిరక్షరాస్యత కారణంగా గణనీయమైన ప్రమాదాలను అవి ఎదుర్కొంటాయి. ”కాగితం నుంచి డిజిటల్‌ వ్యవస్థకు విజయవంతంగా మార్పు చెందడానికి, దానితో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి, డిజిటలైజేషన్‌కు మద్దతు ఇవ్వడానికి ఆరోగ్య వ్యవస్థ మరియు భద్రతా పర్యావరణ, సంసిద్ధతను నిర్ధారించడం అవసరం. తగిన అమలు, పారదర్శకత, జవాబుదారీతనం యంత్రాంగాల ద్వారా వ్యక్తిగత హక్కులను రక్షించే బలమైన చట్టపరమైన మరియు నియంత్రణ చట్రం కూడా అత్యవరసరం” అని నిపుణులు పేర్కొన్నారు. ప్రతి పాదిత ఫ్రేమ్‌వర్క్‌ ఆచరణలో వినియోగదారు సమ్మతిని కల్పించగలదా? అనేది అస్పష్టంగా ఉన్నది. హెల్త్‌ ఐడీ కోసం నమోదు చేయడం ఆధార్‌ ఆధారిత రిజిస్ట్రేషన్‌తో సమానమని నిపుణులు పేర్కొంటున్నారు. ”దీనిలో ఇది కాగితంపై ‘స్వచ్ఛం దంగా’ అని ఉంటుంది. కానీ, ప్రభుత్వ యాజమాన్యంలోని, ప్రయివేటులో కొన్ని సంస్థలు తప్పనిసరి చేస్తాయి” అని నిపుణులు తెలిపారు. ఎన్‌డీహెచ్‌ఎం ఆరోగ్య సంరక్షణను ప్రయివేటీకరిం చడానికి మరో ముందడుగు వేస్తుందా? అనే ఆందోళనలు కూడా నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు హెల్త్‌కేర్‌ సెక్టార్‌ కోసం ‘సర్వీసు ప్రొవైడర్‌ నుంచి బ్రోకర్‌గా’ ప్రభుత్వ పాత్రను మార్చడానికి ఎన్‌డీహెచ్‌ఎం సహాయపడుతుందని భయపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎన్‌డీహెచ్‌ఎం అనే ఒక పథకం ప్రభుత్వ ఆరోగ్య సేవలను భర్తీ చేసే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రయివేటీకరించడానికి ప్రయివేటు రంగ ప్రయోజనాల కోసం డిజిటల్‌ ప్రిస్క్రిప్షన్‌కు ఆన్‌లైన్‌ రోగ నిర్ధారణకు ఒక మార్గంగా ఆన్‌లైన్‌ మందులు, టెలిమెడిసిన్‌ సరఫరా కోసం ‘ఈ-ఫార్మసీ’ని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక వ్యక్తి వైద్య చరిత్ర, ఇతర వివరాలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచుతుంది. ఇది బహుళజాతి ఔషద కంపెనీల ద్వారా పరీక్షల సమయంలో సహా ప్రయివేటు రంగం వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.

Courtesy Nava Telangana

Leave a Reply