అన్యాయంపై మౌనం అతి పెద్ద అన్యాయం

0
182

ఆమె సమాజానికి అక్కర్లేని మనుషులను వెతుక్కుంటూ వెళతారు. వాళ్ల జీవితాల్లోని చెమటచుక్కలను, కన్నీటి ధారలను కాన్వాసుపై గీస్తారు. కథలుగా రాస్తారు. శ్రమజీవుల బతుకుల్లో పోగుపడిన కష్టాలను తన అధ్యయనాల ద్వారా  పాలకులు, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళతారు. పరిష్కారాలు సూచిస్తారు.ఆమే సామాజిక శాస్త్రవేత్త కోట నీలిమ. అసంఘటిత కార్మికుల వెతలను, ఒంటరి మహిళల బతుకు పోరాటాన్ని వెలుగులోకి తెస్తున్న నీలిమ తన సామాజిక పరిశోధనల గురించి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘సమాజం విస్మరించిన జీవితాలను స్పృశించడమంటే నాకు ఇష్టం. ‘అన్యాయాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోవడం అతి పెద్ద అన్యాయం’ అని నమ్ముతాను. ఈ విలువను నేను ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చదవడం ద్వారా నేర్చుకున్నాను. ‘సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలా లేదా పోరాటం కోసమే పోరాడాలా?’ అనే విషయాలను కూడా అక్కడే తెలుసుకున్నాను. అందులో మొదటి మార్గాన్ని ఎంచుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీలో ‘పొలిటికల్‌ సైన్స్‌ – మెథడాలజీ’ మీద పీహెచ్‌డీ పూర్తిచేశాను. మన దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు… ఇలా ఎన్నో సవాళ్ళు. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఒక శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలి.

అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ పద్ధతుల మీద అధ్యయనం చేయడమే మెథడాలజీ.! ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సెప్షన్‌ స్టడీస్‌’ ద్వారా ఇప్పుడు నేను ఆ పద్ధతులను శోధించి, సూచించే పనిలో కొనసాగుతున్నాను. బీటీ పత్తి విత్తనాల వల్ల వర్షాధార ప్రాంతాల్లో చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కార్పొరేట్‌ కంపెనీలు పీఆర్‌ ఏజెన్సీల ద్వారా విదేశీ పత్తి విత్తనాలను ప్రమోట్‌ చేసే క్రమంలో… వాటిని సాగు చేసిన రైతుల ఆత్మహత్యల వార్తలను తొక్కిపెట్టాయి. అలాంటి సమయంలో నేను విదర్భలోని వితంతువుల జీవితం మీద క్షేత్ర స్థాయి అధ్యయనం చేశాను. అక్కడ ఒక్కొక్క ఇంటిదీ ఒక్కొక్క కన్నీటి గాథ. అప్పుల బాధతో భర్త ఆత్మహత్య చేసుకుంటే… పిల్లల బాధ్యతను, ఇంటి భారాన్ని మోస్తూ ఒంటరి మహిళలు అనుభవిస్తున్న కష్టాలను కళ్లారా చూశాను. అంతటితో వదిలేయకుండా ఆ పరిస్థితుల మీద ‘విడోస్‌ ఆఫ్‌ విదర్భ… మేకింగ్‌ ఆఫ్‌ షాడోస్‌’ పేరుతో పుస్తకం రాశాను. ఒంటరి మహిళల జీవితాలు మెరుగుపడేందుకు కొత్త విధానాలు రూపొందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో కొన్ని సూచనలు ఇచ్చాను.

వారి సమస్యలను చర్చకు పెట్టాలని…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని రైతు కూలీలు, కౌలు రైతుల సమస్య మీద అధ్యయనం కొనసాగిస్తున్నాం. మరికొన్ని ప్రజా సమస్యల విషయంలోనూ పని చేస్తున్నాం. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే పదివేలమంది ఆసరా పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. వారిలో 6,500మంది వితంతువులేనని మా అధ్యయనంలో గుర్తించాం. ఇలా చెబుతూ పోతే, ప్రతిచోటా అదే సమస్య. ఆ మధ్య సిద్ధిపేట పరిసర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. నేను ఆ బాధిత కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడే, అటు వైపుగా ఒక రాజకీయ పార్టీ నాయకులు పెద్ద పెద్ద కార్లతో ర్యాలీగా వెళుతున్నారు. అందులోని ఒక కారు ఖరీదులో సగభాగం ఆ రైతుకు అంది ఉంటే, ఆ ఇల్లు ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయి ఉండేది కాదనిపించింది.

‘కొవిడ్‌ తర్వాత నగరాల్లోని చిరుద్యోగులు ఆహారం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? సరిపడా పోషకాహారం తీసుకుంటున్నారా?’ అనే అంశం మీద అధ్యయనం చేస్తే… విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. చాలామంది ఆహారం కొనుగోలుకు ఎక్కువ సొమ్ము వెచ్చిస్తున్నారు కానీ వారెవరూ సరైన పోషకాహారం తీసుకోవడం లేదు. అందుకు ప్రధాన కారణాలు ఆదాయం తగ్గడం ఒకటైతే, ధరలు పెరగడం మరొకటి. అంబులెన్స్‌ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయులు… ఇలా అసంఘటిత రంగంలోని చాలామంది జీవితాల మీద మా సంస్థ అధ్యయనం చేసింది. ఒక ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్‌ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న విషయం మా ద్వారానే వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆ అమ్మాయికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం శుభ పరిణామం. మరొక పారిశుద్ధ్య కార్మికురాలి కూతురు ఫీజు కట్టలేక ఎంబీబీఎస్‌ చదువు మఽధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తితే, మేము, మరికొందరు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం అదించాం. సరైన సమయంలో రోగులను ఆస్పత్రికి చేర్చి, కొన్ని వేల ప్రాణాలు కాపాడుతున్న అంబులెన్స్‌ డ్రైవర్లు నెలనెలా జీతానికి నోచుకోని దుర్భర పరిస్థితి. అయినా, వాళ్లు వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ల అంకితభావాన్ని సమాజం గుర్తించాలనేది నా తాపత్రయం. అందుకోసమే వాళ్ల శ్రమను, వృత్తి నిబద్ధతను వీలైనంత వరకూ వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. తద్వారా వాళ్ల సమస్యలను చర్చకు పెట్టాలనేది నా ఉద్దేశం.

అమెరికాలోనూ అధ్యయనం…
పౌరుల ప్రాతినిధ్యం ఉన్న ప్రజాస్వామ్య విధానాన్ని నేను బలంగా నమ్ముతాను. ఒక అన్యాయంమీద పోరాడే క్రమంలో, ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతికే ప్రయాణంలో మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదే అంశానికి సంబంధించి.. అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో ‘రీ-కాల్‌’ సిస్టం మీద అధ్యయనం చేశాను. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల తీరు బాగులేకపోతే… వారి పదవీకాలం మధ్యలో రీ-కాల్‌ చేసే వెసులుబాటు అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఉంది. అయితే, మన వద్ద కేవలం పంచాయితీ, మున్సిపాలిటీ పరిపాలన వరకే అది పరిమితమైంది. ‘హక్కు’ పేరుతో పౌరులకు ఇబ్బంది లేని స్థలాల్లో మాత్రమే మద్యం దుకాణాలు ఉండాలని ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో మరొక పోరాటాన్ని ప్రారంభించాం. తద్వారా స్థానికంగా ప్రజాభిప్రాయాలను సేకరించి, సంబంధిత అధికారులు, నేతల దృష్టికి సమస్యను తీసుకెళుతున్నాం. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వకూడదని ఉద్యమిస్తున్నాం. మా అధ్యయనాల్లో వెలుగుచూస్తున్న వాస్తవాలను ‘హక్కు యూట్యూబ్‌’ చానల్‌ ద్వారా పౌర సమాజానికి తెలియజేస్తున్నాం.

విరాళాల కోసం చిత్ర ప్రదర్శనలు…
కార్పొరేట్లకు వ్యతిరేకంగా పనిచేస్తూ, అదే సంస్థల నుంచి విరాళాలు సేకరించడం సరికాదన్నది నా భావన.. నా కార్యక్రమాలకు అవసరమయ్యే నిధుల కోసం చిత్ర ప్రదర్శనలు నిర్వహిస్తుంటాను. అయోధ్యమీద 30 పెయింటింగ్స్‌తో ఒక సిరీస్‌ గీశాను. అవన్నీ ఢిల్లీలో ప్రదర్శనకు పెట్టినప్పుడు, నా మీద ఒక వర్గం వాళ్లు విరుచుకుపడ్డారు కూడా! ప్రశ్నించడమే హిందూమత తత్వం. అదే నా చిత్రాల్లో ఉంటుంది. ‘రాముడు అయోధ్యలోనే ఉంటాడు, అక్కడే మనం పూజించాలి’ అనే ఆలోచనకు నేను విరుద్ధం. కనుక అదే అంశం మీద బొమ్మలు గీశాను. ఇప్పటి వరకు తొమ్మిది అతి పెద్ద సోలో ఎగ్జిబిషన్లు నిర్వహించాను.. నిరుడు విదర్భలోని వితంతువుల జీవితాలను కాన్వాసు మీద చిత్రించే ప్రయత్నం చేశాను. ఆ పెయింటింగ్స్‌కూ అమితాదరణ లభించింది. ‘డెత్‌ ఆఫ్‌ ఎ మనీ లెండర్‌’, ‘రివర్‌ స్టోన్‌’ తదితర రచనలు చేశాను. నేను రాసిన ‘షూస్‌ ఆఫ్‌ ది డెడ్‌’ నవలను ఒక పెద్ద దర్శకుడు సినిమాగా తీస్తున్నారు. పార్లమెంటులో సామాన్యులకు కనిపించని తొంభై శాతం వాస్తవాలను నవలీకరిస్తూ ‘ది హానెస్ట్‌ సీజన్‌’ రాశాను. నా కాల్పనిక రచనలన్నీ వాస్తవ కథనాల ఆధారంగా రాసినవే.! సామాజిక పరిశోధనా రంగంలో నా పనితీరు చూసిన ఉమెన్‌ ఎకనామిక్‌ ఫోరం కిందటి ఏడాది నాకు ‘ఎక్సెప్షనల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ అవార్డు ఇచ్చింది.’’

‘హక్కు’ పేరుతో పౌరులకు ఇబ్బంది లేని స్థలాల్లో మాత్రమే మద్యం దుకాణాలు ఉండాలని ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో మరొక పోరాటాన్ని ప్రారంభించాం. తద్వారా స్థానికంగా ప్రజాభిప్రాయాలను సేకరించి, సంబంధిత అధికారులు, నేతల దృష్టికి సమస్యను తీసుకెళుతున్నాం.
కె. వెంకటేష్‌

Courtesy Andhrajyothi

Leave a Reply