ఏం పిల్లడో.. మళ్లీ వస్తవా!

0
250
  • గజ్జె ఘొల్లుమంది
  • వంగపండు అస్తమయం
  • మూడు నెలలుగా అనారోగ్యం
  • గుండెపోటుతో కన్నుమూత
  • ఉత్తరాంధ్ర ఉద్యమ కవి
  • తెలుగునాట ఊరేగిన పాట
  • ఐదుదశాబ్దాల కళా ప్రస్థానం
  • జననాట్యమండలి ఆద్యుడు
  • అధికార లాంఛనాలతో
  • పార్వతీపురంలో అంత్యక్రియలు

‘ఏం పిలడో ఎల్దమొస్తవా’ అని  పట్టిపట్టి అడిగి, వ్యవస్థలను నిలదీసిన స్వరం మూగబోయింది. ‘చెవుల పిల్లుల చేత శంఖారావం’ చేయించిన ఆ గళం ఆగిపోయింది. పులుల్ని మింగిన గొర్రెలను, కత్తులు దులపరించే చిలకలనూ సృష్టించి.. వాటితో వ్యవస్థలపై రణం ప్రకటించిన ఆ కలం ప్రవాహం నిలిచిపోయింది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను పాటతో ఉర్రూతలూగించిన ఉత్తరాంధ్ర ప్రజాకవి వంగపండు ప్రసాదరావు తుది శ్వాస వదిలారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎమ్‌ నగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.

మూడు నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.  అదే సమయంలో తనకు గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులతో చెప్పారు. ఆ తరువాత కొద్దిసేపట్లోనే తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల సాంస్కృతిక ఉద్యమజీవితం గడిపిన వంగపండు మరణవార్త ఆయన అభిమానులను, కళాకారులను దుఃఖంలో ముంచెత్తింది. వారంతా పార్వతీపురానికి తరలివచ్చారు. శ్మశాన వాటిక వద్ద ‘ఏం పిలడో ఎల్దమొస్తవా’, ‘యంత్రమెట్ట నడుస్తున్నదంటే’ వంటి పాటలు పాడుతూ ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారిక లాంచనాలతో పార్వతీపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. వంగపండుకు భార్య విజయలక్ష్మి, కుమార్తె ఉషా, కుమారులు పురుషోత్తం, దుష్యంత్‌ ఉన్నారు. వీరు కాకుండా వరుసకు మనవ డైన సారంగిపాణిని దత్తత తీసుకున్నారు. ఉషా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

రాజిల్లిన సినీ గీతం..
విప్లవ కథాంశంతో 1986లో విడుదలయిన ‘ఆర్ధరాత్రి స్వతంత్రం’ సినిమాతో వంగపండు సినీప్రస్థానం ప్రారంభమయింది. ఈ చిత్రంలోని ’ఏం పిలడో ఎల్దమొస్తవా.. శికాకులంలోని సీమ కొండకు’ అనే వంగపండు పాట ఆ కాలంలో సంచలనం రేపింది. మాదాల రంగారావు, టీ కృష్ణ నిర్మించిన పలు చిత్రాలకు పాటలను అందించారు. ఇప్పటిదాకా 30 వరకు సినిమా పాటలు రాశారు. కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఆయన స్వరంతో రికార్డు అయిన అనేక పాటలు సీడీల రూపం లో విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీ సాంస్కృతిక విభాగంలో ప్రస్తుతం ఆయన గెస్ట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ, కొన్నాళ్లుగా వర్సిటీ క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఈ మధ్యనే పార్వతీపురంలోని స్వగృహానికి వచ్చేశారు. అక్కడే కన్నుమూశారు. 2017లో ఉగాది సందర్భంగా రా ష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారంతో వంగపండును గౌరవించింది. 2008లో తెనాలిలో సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.

రాష్ట్ర విభజనను వంగపండు తీవ్రంగా వ్యతరేకించారు. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే ఆంధ్రా ప్రజలు నష్టపోతారని ఆయ న భావించారు. దీనిపై తన భావాలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం
హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆగస్టు): ప్రముఖ జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల  సీఎం కేసీఆర్‌  సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తన జీవితాంతం ప్రసాదరావు పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.  వంగపండు మృతికి సంతాపం తెలిపినవారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి,  రేవంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

‘‘ఉత్తరాంధ్ర యాసను, జీవ భాషను కవితా గేయాలుగా అల్లిన మహాకవి వంగపండు. ఆయన నిరాడంబరుడు, సాధు స్వభావుడు, విప్లవకవి. వంగపండుకు ఇవే నా జోహార్లు.’’                          – గోరటి వెంకన్న, కవి గాయకుడు

విప్లవ కలం… ఉద్యమ గళం!
ఇదీ వంగపండు జీవన ప్రస్థానం
కళ్లజోడు, మెడలో తువ్వాలు, ముఖంపై చెరగని నవ్వు… ఇదీ వంగపండు ఆహార్యం! బక్కపలచని శరీరమే… కానీ, గొంతు విప్పితే ప్రకంపనలే! కాళ్లకు గజ్జె కట్టి, చేతితో మువ్వలుపట్టి… పాడుతూ, ఆడుతూ చేసే కళా విన్యాసం వంగపండుకు ప్రత్యేకం. ఈ వాగ్గేయ సంప్రదాయాన్ని అన్నమయ్య తరువాత తెలుగు సమాజంలో తిరిగి అందిపుచ్చుకున్న కళాకారులు గద్దర్‌, వంగపండు. గద్దర్‌ తెలంగాణ ప్రాంతంలో పాటను ఉర్రూతలూగిస్తే…. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గానాలకుగజ్జె కట్టి వంగపండు చిందేయించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో చినతల్లి, జగన్నాఽథం దంపతులకు 1943లో వంగపండు జన్మించారు. ఆయన ఐటీఐ పూర్తి చేశారు. గ్రామాల్లో పాడుకునే పాటలను ఆలపిస్తూ ఆయన బాల్యం గడిచింది. ఆ కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఉద్యమాల ప్రభావం బలంగా ఉండేది. చదువుకొనే రోజుల్లో ఈ ప్రభావానికి వంగపండు గురయ్యారు. ఈ క్రమంలో విప్లవాలవైపు తన సాహిత్యదృష్టిని మళ్లించారు. ఉత్తరాంధ్ర విప్లవ నాయకుల్లో ఒకరైన ఆదిభట్ల కైలాసంతో పరిచయం, నక్సలైట్‌ నాయకుడు కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. శ్రీశ్రీ, కాళీపట్నం రామారావు, ఐవీ సాంబశివరావు, రా.వి.శాస్ర్తి, చలసాని ప్రసాద్‌, భూషణం మాస్టారు వంటి ప్రసిద్ధ రచయితలతో ఉన్న స్నేహం ఆయనను కళారంగంలో ఎన్నో ప్రయోగాలు చేసేలా పురిగొల్పింది. ఈ క్రమంలోనే గద్దర్‌తో కలిసి 1972లో జననాట్యమండలిని ఏర్పాటు చేశారు. తర్వాత జననాట్యమండలి ప్రభుత్వ నిషేధానికి గురయింది. ఒకవైపు సాంస్కృతికోద్యమంలో తలమునకలవుతూనే, మరోవైపు విశాఖపట్నం షిప్‌యార్డులో పనిచేశారు. ఉద్యమానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాననే భావనతో 1993లో ఆ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. పూర్తికాలం జానపదవాగ్గేయకారునిగా తక్కినజీవితమంతా గడిపారు.

జానపదాలకు కొత్త సొబగులు
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలంలో పనులు చేసే మహిళలు శ్రమను మరవడానికి పాడుకొనే పాటల్లోని కవితా విలువలను ఆయన స్వీకరించారు. దానికి ఉత్తరాంధ్ర మాండలికాన్ని జోడించి పాటను పరుగులు పెట్టించారు. జనపదాల జాడల్లో జానపదాలకు కొత్త రంగు, రుచి, వాసనలను అద్దారు. సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా ఉండే పాటలతో వ్యవస్థలోని అన్యాయాలను, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపేవారు. నాయుడు, కరణం, మునసబు ఏకమై సాధారణ జనాన్ని ఎలా పట్టి పీడిస్తున్నది ’భూమి బాగోతం’లో అక్షరరూపమిచ్చారు. ఈ నాటిక వేల ప్రదర్శనలను పొందింది. అంతేకాదు, టీడీపీ ఆవిర్భవించి, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకొన్న ముఖ్యమైన నిర్ణయాల్లో నాయుడు, మునసబు, కరణం విధానం రద్దు ఒకటి కావడం గమనార్హం. వంగపండు 300కు పైగా జానపద పాటలు రచించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply