ప్రజలు ప్రమాదాన్ని గుర్తిస్తేనే మార్పు

0
119

మహమ్మద్‌ ప్రవక్త గురించి బిజెపి అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో … ప్రసిద్ధ రచయిత్రి , ఉద్యమకారిణి అరుంధతీ రారు సి.ఎన్‌.ఎన్‌ ఒపీనియన్‌ కు ఇటీవల ఇచ్చిన ఇమెయిల్‌ ఇంటర్వ్యూ ఇది. రారు పలు అంశాలపై స్పందించారు. వివరాలు క్లుప్తంగా….

  • మహమ్మద్‌ ప్రవక్త గురించి బిజెపి అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు ఇవాళ్టి భారత రాజకీయాల గురించి తెలిపేదేమిటి?

దేశంలో తమ ఉనికి ప్రమాదంలో పడిందని చెప్పుకునే హిందూ జాతీయవాదం బైటి ప్రపంచానికి చూపడానికి వేసుకున్న ముసుగును ఈ ఘటన స్పష్టంగా ప్రదర్శించింది. అమెరికా అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన వింత దుస్తుల, ఫర్‌ కోటు వేసుకుని, కొమ్ములు పెట్టుకున్న మనుషుల గురించి మీకు తెలుసు. సరిగ్గా వాళ్లకు సరిపోలే మనుషులే మమ్మల్ని ఇక్కడ పాలిస్తున్నారు. తేడా ఏమంటే, వీళ్లు వాళ్లలాగ కేవలం పిచ్చివాళ్ల గుంపు కాదు. వీళ్లు భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన సంస్థ సభ్యులు. ఆ సంస్థ పేరు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు. దాని స్థాపక సిద్ధాంతకర్తలు బహిరంగంగా హిట్లర్‌ ను ఆరాధించారు. భారతీయ ముస్లింలను జర్మనీలోని యూదులతో పోల్చారు. ఇవాళ దేశంలో నిజంగా అధికారం నెరపుతున్న శక్తి ఆర్‌ ఎస్‌ ఎస్‌.

  • బిజెపి కీ ఆర్‌.ఎస్‌.ఎస్‌ కీ సంబంధం ఏమిటి?

ప్రపంచంలోకెల్లా సంపన్నమైన రాజకీయపార్టీల్లో ఒకటైన భారతీయ జనతా పార్టీ వాస్తవంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ కు ముంగిలి కార్యాలయం. 1925లో స్థాపించబడిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ ను సాంప్రదాయకంగా పిడికెడు మంది బ్రాహ్మణులు అదుపు చేస్తుంటారు. దానిలో ప్రస్తుతం లక్షలాది మంది సభ్యులున్నారు. నూనూగు మీసాల వయసు నుంచి ఆర్‌ ఎస్‌ ఎస్‌ సభ్యుడైన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా, ఆయన మంత్రివర్గంలోని చాలమంది అందులో సభ్యులే.

దానికి దాని సొంత సైన్యం ఉంది. సొంత పాఠశాలలున్నాయి, కార్మిక సంఘాలున్నాయి, మహిళా సంఘాలున్నాయి. అది ఒక రాజకీయ పార్టీ కాదు. అది ఒక రకమైన ఊసరవెల్లి. రెండు నాల్కల మాటల మొనగాడు. దానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయో వనరులు అస్పష్టమైనవి. అది ఎటువంటి చట్టబద్ధమైన ఆధారాలనూ వదలదు. అది లెక్కలేనన్ని అనుబంధ సంస్థల రూపంలో పనిచేస్తుంది. అది ఒక జాతి లోపలి జాతి.

పాకిస్తాన్‌, ఇరాన్‌, పర్షియన్‌ గల్ఫ్‌ లోని అనేక దేశాలు తమను తాము ఇస్లామిక్‌ దేశాలు అని గుర్తించుకున్నట్టుగా, ఇజ్రాయెల్‌ అధికారికంగా, చట్టబద్ధంగా ”యూదు ప్రజల జాతి రాజ్యం” అని ప్రకటించుకున్నట్టుగా, భారతదేశం కూడ హిందూ దేశంగా ప్రకటించుకోవాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావిస్తుంది.
నిజం చెప్పాలంటే, ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‘అఖండ భారత్‌’ అనే ఒక రకమైన మిథ్యను విశ్వసిస్తుంది. అది ఒక భవిష్యత్‌ ఊహ, అదే సమయంలో ప్రాచీనమైనది కూడ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లను ఓడించి, హిందూ పాలనకు పాదాక్రాంతం చేసుకుని, నిర్మించబోయే భవిష్యత్‌ ప్రాచీన భారతదేశం అది. అబ్బురపడేంత మత, సామాజిక, ఉపజాతీయ అస్తిత్వాల వైవిధ్యంతో నిండిన భారతదేశాన్ని, యూరప్‌ కన్న ఎక్కువ బహుళత్వం ఉన్న భారతదేశాన్ని, చదును చేసి, ఒక కాలం చెల్లిన, కుల ఆధారిత, కచ్చితమైన అంతరాల హిందూ జాతిగా మార్చాలనే ఆలోచనే ఊహించశక్యం కానంత హింసా ప్రక్రియ. దాని అర్థం భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టడం. భారతదేశం అనే మౌలిక భావననే రద్దు చేయడం.

అంతేగాక, కొత్త ముస్లిం వ్యతిరేక పౌరసత్వ చట్టం అమలులోకి వచ్చింది. ఇది ఒకరకంగా కాందిశీకులను తయారు చేసే పథకం. తప్పనిసరి అని చెపుతున్న తమ ”వారసత్వ పత్రాలు” చూపలేని జనాభా కాందిశీకులుగా మారిపోతారు. ఆ పత్రాలు అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటాయి. మిగిలిన వారు తమ పౌరసత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. అయితే, ముస్లింలను ఒంటరులను చేయడం ఒక్కటే సరిపోదు. వేల కులాలతో, నరజాతులతో చాల వైవిధ్యం ఉన్న హిందూ సమాజాన్ని కృత్రిమంగా ఒకే ఆధిక్య సమూహంగా తయారుచేయడం బిజెపి అధికారంలో కొనసాగడానికి అత్యవసరం. అందరికీ కలిపి ఒకే ఉమ్మడి శత్రువు ఉన్నారని బూచి చూపి ద్వేషాన్ని రగిల్చడమే ఆ ఆధిక్యతా నిర్మాణానికి అవసరమైన సిమెంటు. అందుకు ఎప్పటికప్పుడు మూర్ఖత్వాన్ని పెంచి పోషించవలసి ఉంటుంది.

హిందూ హింసావాద మూకలు ముస్లింలను ఊచకోత కోసిన, కొట్టి చంపిన ఘటనలతో పాటు, ఇళ్లలోకే ద్వేష ప్రచారం, తప్పుడు సమాచార వెల్లువ నిరంతరాయంగా సాగుతున్నాయి.

ముస్లింలు నివసించే ప్రాంతాల గుండా వేలాది మంది హిందూ పురుషులు కత్తులు పట్టుకుని రెచ్చగొట్టే ప్రదర్శనలు జరపడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. మే లో ఒక బిజెపి అధికార ప్రతినిధి ఒక జాతీయ టి.వి మీద మహమ్మద్‌ ప్రవక్త మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఇలా తమ నియోజకవర్గాన్ని రూపొందించుకునే కసరత్తులో భాగమే. దాని పట్ల నిరసన తెల్పడానికి సాహసించిన ముస్లింల ఇళ్లను మునిసిపల్‌ అధికారులు నేలమట్టం చేయడమనే దారుణమైన చర్య కూడ అందులో భాగమే.
అంతర్జాతీయ నిరసన పెల్లుబికింది గనుక, ఒక రాయితీగా బిజెపి తన అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను సస్పెండ్‌ చేసింది. కాని ఆ పార్టీ శ్రేణులన్నీ ఆమెను బహిరంగంగా సమర్థించాయి. విభజన బిజెపి కే అనుకూలంగా పరిణమించింది.

  • దీనంతటితో ప్రధాని నరేంద్ర మోడీకి ఏం సంబంధం?

అధికార ప్రతినిధి గురించి గాని, నిరసనల గురించి గాని మోడీ పెదవి విప్పలేదు. ఆయనకు బాగా అలవాటయిన విద్య అది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మౌనానికి ఆయన అనుచరులు సమర్థన అనే అర్థమే చెప్పుకుంటారు. ఆ అర్థం సరైనదే. తనను తాను రక్షకుడుగా చూపుకోవడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, వాస్తవంగా ఆయన ఒక ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యకర్త. తన సంస్థ మరికొందరు నాయకులను తయారు చేస్తున్నదనీ, వారు తన స్థానం చేపట్టడానికి నిరీక్షిస్తున్నారనీ కూడ ఆయనకు తెలుసు. ప్రస్తుతానికైతే ఆయన ఎదురులేని నాయకుడే.

మోడీ రాజకీయ రంగ ప్రవేశం 2001 అక్టోబర్‌ లో జరిగింది. ఆయనను గుజరాత్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారనీ, ఆయన ఎన్నుకోబడలేదనీ గుర్తుంచుకోండి. అది సరిగ్గా అమెరికాలో సెప్టెంబర్‌ 11 దాడులు జరిగాక కొన్ని వారాలకే. ప్రపంచమంతా ఇస్లామోఫోబియాలో తలమునకలుగా ఉండింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌ కు సరిగ్గా సరిపోయిన రాజకీయ వాతావరణం అది. కొన్ని నెలల తర్వాత, 2002 ఫిబ్రవరిలో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న ఒక రైల్వే బోగీ తగులబడిపోయిన ఘటన తర్వాత, గుజరాత్‌ లోని గ్రామాల్లో, పట్టణాల్లో ముస్లింల మీద దారుణమైన ఊచకోత అమలయింది. ఆ దారుణ మారణ కాండ వారాల తరబడి సాగింది. ఆ తర్వాత ఆ హంతకులు తాము చేసిన పనుల గురించి గొప్పలు చెప్పుకుంటుండగా కెమెరాలకు చిక్కారు. వారిలో చాలమంది తాము మోడీ నుంచి ఎలా ప్రేరణ పొందామో, ఆయన తమను ఎలా రక్షించాడో చెప్పారు. మోడీ కించిత్తు పశ్చాత్తాపమైనా ప్రకటించలేదు. హిందూ హృదయ సామ్రాట్‌ అనే కీర్తి పొందాడు. 2002 హనన కాండ తర్వాత కొద్ది రోజులకే ఆయన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రకటించి, భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. మూడు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా మారణకాండలూ, విద్వేష ప్రచారాలూ ఎన్నికల ప్రచారసరళిలో విడదీయరాని భాగమని మేం నమ్మడం ప్రారంభించాం.

భారతదేశపు అంతర్జాతీయ ముస్లిం వాణిజ్య భాగస్వాములు,

  • ఆ మాటకొస్తే అసలు ప్రపంచమే ఎట్లా స్పందించాలంటారు?

భారతదేశపు ”ముస్లిం వాణిజ్య భాగస్వాములు” అని మీరు ప్రస్తావిస్తున్న దేశాలలో ఎన్నో దేశాలు…ప్రజాస్వామ్యం, బహుళత్వం అనే సిగ్గు బిళ్లలను ఎప్పుడో వదిలేశాయి. మోడీ, బిజెపి భారతదేశాన్ని ఏ గమ్యానికి లాగదలచుకున్నారో ఆ గమ్యానికి అవి ఎప్పుడో చేరిపోయాయి. అది మనం చేరడానికి భయపడవలసిన గమ్యం. అది ఒక మతరాజ్యం.

భారతదేశపు విషాదం ఏమంటే, అది ప్రపంచంలోకెల్లా ఘోరమైన స్థలమేమీ కాదు. అటువంటి ఘోరమైన స్థలానికి చేరే దారిలో ఉన్నాం. అంతే. మేం మా ఇల్లు తగులబెట్టుకుంటున్నాం. భారతదేశం అనేది అతి భయానకంగా విఫలమైన ప్రయోగం. ఎందుకు విఫలమవుతున్నామంటే, మా ఎన్నికైన నాయకులకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. జ్ఞానం పెద్ద ఎత్తున లోపించడం వల్ల వైకల్యం సంభవించింది. అది చాలా ప్రమాదకరమైన విషయం. దాని పర్యవసానాలు ఊహించడానికి వీలు లేనివి.

ఇక మిగిలిన ప్రపంచం ఏమి చేయవచ్చు అని అడిగితే, ఎక్కడున్నవారైనా ఈ దేశం గురించి శ్రద్ధ వహించండి, వాస్తవాలు తెలుసుకుని అభిప్రాయాలు ఏర్పరచుకోండి. అసలు ఈ మార్కెట్‌ అనేదే ఉనికిలో లేకుండా పోతే, ఈ ”మార్కెట్‌” నుంచి మీరు ఆశిస్తున్న ఇబ్బడి ముబ్బడి లాభాలు కూడ వట్టిపోతాయని గుర్తించండి. భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉంది. సంపన్నులు, పెద్దా చిన్నా వ్యాపారులు దేశం విడిచి పారిపోతున్నారు. వాతావరణాన్ని సరిగ్గా పసిగట్టే కచ్చితమైన, మంచి సూచికలు వాళ్లు.

  • నిజంగానే భారతదేశం ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమా?

ప్రజాస్వామ్యమంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం ఒక్కటి మాత్రమే కాదు. మత అల్ప సంఖ్యాక వర్గంగా ఉన్న ఇరవై కోట్ల మంది ప్రజలను ఏ హక్కులూ లేకుండా జీవించమని అడిగేది ప్రజాస్వామ్యం కాదు. వాళ్లను కొట్టి చంపడం, ఊచకోత కోయడం, జైళ్లలో నిర్బంధించడం, వాళ్లమీద ఆర్థిక, సాంఘిక బహిష్కరణ అమలు చేయడం, విచారణా, శిక్షా భయం లేకుండా వాళ్ల ఇళ్లను నేలమట్టం చేయడం, వాళ్ల పౌరసత్వాన్ని లాగివేస్తామని బెదిరించడం సాగుతుంటే అది ప్రజాస్వామ్యం కాదు. హంతకులూ, కొట్టిచంపే దుర్మార్గులూ త్వరత్వరగా రాజకీయ నిచ్చెన పైకెక్కే చోటు ప్రజాస్వామ్యం కాదు.

  • భారత ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టాన్ని సవరించడం సాధ్యమేనా?

ఏ స్థాయిలో దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం ప్రజల మెదళ్లలో విష భావజాలం నింపడం జరిగిందో చూస్తే దాన్ని వెనక్కి తిప్పడం కష్టం అనిపిస్తుంది. విధినిషేధాలతో, విచక్షణతో ఉండవలసిన ప్రతి ఒక్క నిర్మాణాన్నీ డొల్లగా మార్చారు, హిందూ జాతీయవాద ఆయుధంగా మార్చి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే కొత్త లక్ష్యం ఏర్పరిచారు, ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టారు. రాజకీయ ప్రతిపక్షం విషయానికొస్తే, తమిళనాడు, బెంగాల్‌, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌ వంటి చోట రాష్ట్రస్థాయిలో బిజెపిని జయప్రదంగా ఎదుర్కొన్న రాజకీయ పార్టీలున్నాయి. కాని జాతీయ స్థాయిలో ప్రతిపక్షం అనేది ఉనికిలో లేదనే చెప్పవచ్చు. మొత్తం ఎన్నికల వ్యవస్థనే ఒక ఆటగా మార్చేశారు. అంతేకాదు, ఏది ఏమైనా, బుర్ర నిండా భావజాలం నింపుకున్న ప్రజానీకాన్ని మీరు ఎలా ఆకర్షించగలరు? మీరు మెరుగైన, ఎక్కువ గర్వం ఉన్న హిందువు అని రుజువు చేసుకుని మాత్రమేనా? ఆ క్రీడలో బిజెపి కి ఎవరూ సాటి కారు. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ ఆటే ఆడుతున్నారు. కనీసం ప్రధానస్రవంతి రాజకీయాలలో ఆ ఆటే నడుస్తున్నది.
కనుక, నేను ఈ నష్టాన్ని సవరించగలమని అనుకోవడం లేదు. జరుగుతున్నదాన్ని అంగీకరిస్తున్న, అమాయకులైన, లొంగిపోతున్న ప్రజలు ఆ జరుగుతున్నది తమకు ప్రమాదమని గుర్తిస్తే మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. అప్పుడిక ఆ మార్పు హఠాత్తుగా వచ్చేస్తుంది. ఆ మార్పు వీథుల్లో నుంచి వస్తుంది. అది వ్యవస్థ లోపలి నుంచి రాదు.

– / తెలుగు: ఎన్‌ వేణుగోపాల్‌

Leave a Reply