అసంఘటిత కార్మికుల్లో 70శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు

0
234

– వ్యవసాయం, నిర్మాణరంగానికి చెందినవారే అత్యధికం
– ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో 7.86కోట్ల రిజిస్ట్రేషన్లు
– కార్మికుల్లో..40.5శాతం ఓబీసీ, 27.4 శాతం జనరల్‌
– 23.7శాతం ఎస్సీ, 8.3శాతం ఎస్టీ సామాజిక వర్గాలు
– మహిళా కార్మికులు 51.61శాతం

న్యూఢిల్లీ : అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొత్త విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఏ ఏ సామాజిక వర్గాలకు చెందినవారు అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారన్నది సుమారుగా బయటకు వచ్చింది. ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో తాజా గణాంకాల ప్రకారం, కార్మికుల్లో 70శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. 40.5శాతం ఓబీసీలు, 27.4శాతం జనరల్‌ కేటగిరి, 23.7శాతం ఎస్సీ, 8.3శాతం ఎస్టీలు ఉన్నారు. ఇప్పటివరకూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో 7.86కోట్ల మంది కార్మికులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ఇందులో 51.61శాతం మహిళా కార్మికులున్నారు.

వివిధ రాజకీయ పక్షాలు, సుప్రీంకోర్టు పలు మార్లు ఒత్తిడి చేసిన తర్వాత మోడీ సర్కార్‌ అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏర్పాటైన ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో గత కొన్ని నెలలుగా కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కార్మికులందరికీ సార్వత్రిక సంఖ్యను కేటాయిస్తున్నారు. ఈ నెంబర్‌తో ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా సంఖ్యను అనుసంధానం చేశామని, ‘ఈ-శ్రమ్‌’ కార్డును జారీచేస్తామని కేంద్ర కార్మికశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్డు వివిధ సామాజిక భద్రతా పథకాల్లో ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. అసంఘటిత కార్మికుల్లో వివిధ సామాజిక వర్గాల సంఖ్యను అంచనావేయడానికి ఈ-శ్రమ్‌ పోర్టల్‌ గణాంకాలు ఉపయోగపడనున్నాయి. వారి సంక్షేమ, అభివృద్ధి కోసం ప్రభుత్వం విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లలో ఎక్కువగా వ్యవసాయ, అనుబంధ రంగాల(53.6శాతం) కార్మికులవే ఉన్నాయి. నిర్మాణరంగ కార్మికులు 12.2శాతం, ఇండ్లల్లో పనిచేసే కార్మికులు 8.71శాతం ఉన్నారు.

వ్యవసాయరంగంలో అత్యధికం
రాష్ట్రాల వారీగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో కోటీ 5లక్షల రిజిస్ట్రేషన్లు(13.35శాతం) నమోద య్యాయి. ఆతర్వాత స్థానాల్లో ఒడిషా-82.6లక్షలు (10.5శాతం), ఉత్తరప్రదేశ్‌-71.9 లక్షలు (9.15 శాతం), బీహార్‌-44.9 లక్షలు (5.71శాతం), జార్ఖాండ్‌-23.82లక్షలు(3.03శాతం). నిర్మాణరంగ కార్మికుల్లోనూ అత్యధిక రిజిస్ట్రేషన్లు పశ్చిమ బెంగాల్‌లో నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో.. ప.బెంగాల్‌లో 17.03లక్షలు, యూపీ-14.95 లక్షలు, బీహార్‌-13.13లక్షలు, ఒడిషా-12.04 లక్షలు. వీరిలో అత్యధికం భవనాలు, గృహ నిర్మాణ పనులతో ఉపాధి పొందుతున్నారు.

గృహసంబంధ కార్మికులు
ఇండ్లల్లో పనిచేసే అసంఘటిత కార్మికుల రిజి స్ట్రేషన్లు 68.47లక్షలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం ఇండ్లల్లో వంట పని (56.02లక్షలు) చేసు కునేవారున్నారు. క్లీనర్లు, స్వీపర్ల సంఖ్య 12.45 లక్షలు. ఈకేటగిరిలో ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికం గా రిజిస్ట్రేషన్లున్నాయి. ఆతర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌(14.29లక్షలు), బీహార్‌(13లక్షలు) రాష్ట్రాలున్నాయి.

92శాతం మంది ఆదాయం రూ.10వేల లోపే
కార్మికుల ఆదాయ వివరాల్ని కూడా పోర్టల్‌లో నమోదుచేశారు. దీని ప్రకారం మొత్తం కార్మికుల్లో 92 శాతం మంది ఆదాయం రూ.10వేల లోపే ఉందని తేలింది. రూ.10వేల నుంచి రూ.15వేల మధ్య ఆదా యం కలిగినవారు కేవలం 6శాతం మంది ఉన్నారు. రూ.15వేలు-రూ.18వేల మధ్య ఆదాయమున్న వారు 1శాతం కాగా, రూ.18వేల నుంచి రూ.21వేల మధ్య ఆదాయంగల వారు 0.5శాతమున్నారు. పోర్టల్‌లో 86.33శాతం కార్మికుల బ్యాంక్‌ ఖాతా నెంబర్లు అనుసంధానం అయ్యాయి.

Courtesy Nav Telangana

Leave a Reply