వృద్థి రికవరీకి విఘాతం..!

0
261

అధిక పెట్రో ధరల ప్రభావం

న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలపై మోపుతున్న అధిక పన్ను రేట్లు ఆర్థిక వ్యవస్థను అనిశ్చిత్తిలోకి నెట్టుతున్నాయి. రికార్డ్‌ స్థాయికి చేరిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల వాహన, రవాణ పరిశ్రమలు తీవ్ర అలజడిని ఎదుర్కొంటున్నాయి. హెచ్చు ధరలు ముఖ్యంగా ప్రజల ఆదాయాలను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రికవరీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ప్రపంచ దేశాల్లో చమురుకు డిమాండ్‌ లేక ధరలు పడిపోతున్నాయి. కాగా.. భారత్‌లో మాత్రం మోడీ సర్కార్‌ పన్నుల మీద పన్నులేసి ప్రజల నడ్డి విరుస్తోందనే విమర్శలు పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ వస్తోంది. గడిచిన మూడేండ్లలో పెట్రోల్‌ 25 శాతం ప్రియమైంది. భారీగా పెరిగిన చమురు ధరలు ఇతర ఉత్పత్తుల ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. అధిక ద్రవ్యోల్బణంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురైతుంది.

దేశ ఆర్థిక వ్వవస్థలో కీలకంగా ఉన్న మధ్యతరగతి ప్రజలను హెచ్చు ధరలు విలవిలలాడేలా చేస్తున్నాయని న్యూఢిల్లీలో ఓ సంస్థలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ రాహుల్‌ శ్రీవాస్తవా పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఎంతో ఆశగా కొనుగోలు చేసిన తన కారును ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నానని అన్నారు. ప్రస్తుతం సొంత కారు నడుపుకోవడమంటే తనకీ లగ్జరీగా మారిందన్నారు. అధిక చమురు ధరలే ఇందుకు కారణమన్నారు. ఇది వరకు రూ.3వేల పెట్టి ట్యాంక్‌ ఫుల్‌ చేసుకునే వాడిననీ.. ఇప్పుడు రూ.2వేల ఇంధనం మాత్రం వేయించుకుంటున్నానని తెలిపారు. ఇది దేశంలో తన ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదనీ.. ట్రక్కు డ్రైవర్లు, ఇతర లక్షలాది మంది బ్రతుకులు ఇలాగే ఉన్నాయన్నారు.

డిమాండ్‌పై ప్రభావం..
ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో దేశంలో డిమాండ్‌ పడిపోయిందనీ.. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ 7.3 శాతం క్షీణించింది. దేశంలో ఇప్పటికీ నిరుద్యోగం పెరుగుతున్నదనీ.. లక్షలాది మంది ఒత్తిడిలో ఉన్నారని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విశ్లేషించింది. 2020లో మధ్యతరగతి ప్రజలు 3.2 కోట్లకు తగ్గారని పేర్కొంది. అధిక ధరలు ఇంధన డిమాండ్‌ను దెబ్బతీశాయని ఎఫ్‌జీఈ సౌత్‌ ఏసియా హెడ్‌ సెంతిల్‌ కుమారన్‌ పేర్కొన్నారు. అధిక రిటైల్‌ ధరలు.. డిమాండ్‌ రికవరీని నెమ్మదించేలా చేస్తున్నాయని.. ఇది దేశ వృద్థి రేటుపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. హెచ్చు ఇంధన ధరలు లక్షలాది చిన్న ట్రక్కు ఆపరేటర్ల కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని ఏఐఎంటీసీ ప్రెసిడెంట్‌ కుల్తారన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్త సాధారణ సమ్మెకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply