- దివ్యాంగునిపై టీఆర్‌ఎస్ సర్పంచ్ ప్రతాపం
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
- తహసీల్దార్ ఆఫీస్ వద్ద దివ్యాంగుల నిరసన
- పోలీసులకు ఫిర్యాదు.. సర్పంచ్ అరెస్టు
- సస్పెన్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
హన్వాడ : ఉపాధి హామీ పథకం కింద తాను చేసిన పనికి రావాల్సిన కూలి డబ్బు అడిగిన ఓ దివ్యాంగునిపై అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ సర్పంచ్ రెచ్చిపోయాడు. బూతులు తిట్టడమే కాకుండా ఆ దివ్యాంగుని గుండెలపై కాలితో తన్ని తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పులుపువానిపల్లిలో గురువారం ఈ అమానవీయ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి బాధిత దివ్యాంగుని నుంచి శుక్రవారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ సర్పంచ్‌ను అరెస్టు చేశారు. పులుపువానిపల్లికి చెందిన కృష్ణయ్య అనే దివ్యాంగుడు.. తమ గ్రామ సర్పంచ్ కోస్గి శ్రీనివాసులకు గురువారం ఫోన్ చేసి తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బు కోసం ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. అనంతరం కృష్ణయ్య ఇంటికి సమీపంలోని గుడి దగ్గరకు చేరుకుని వాదనకు దిగారు. సర్పంచ్ శ్రీనివాసులు అసభ్యపదజాలంతో దూషించడంతో వివాదం మరింత ముదిరింది.
మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన శ్రీనివాసులు.. కృష్ణయ్యను కాలి తన్నాడు. ఈ గొడవ మొత్తాన్ని వీడియో తీసిన కృష్ణయ్య కుమారుడు దానిని శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో పెట్టాడు. తన మీద దాడి చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణయ్య హన్వాడ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. కాగా, కృష్ణయ్యపై జరిగిన దాడికి నిరసనగా దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా జరిగింది. సర్పంచ్ శ్రీనివాసులును పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, తాను ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, వాగ్వాదంలో తనను మితిమీరీ దూషించడంతో సహనం కోల్పోయి పొరపాటు చేశానని సర్పంచ్ శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు.. సర్పంచ్ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు.