పిజ్జా బాయ్‌కి కరోనా.. ఢిల్లీలో 89 మంది క్వారంటైన్‌

0
216

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌లో హోంఫుడ్‌ తిని బోర్‌ కొడుతోందా? లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే పిజ్జాలు, బర్గర్లు ఆర్డరిచ్చి.. జిహ్వచాపల్యాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారా? కరోనా కల్లోలం నేపథ్యంలో అలా చేయడం సరికాదని దక్షిణ ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఘాటుగా హెచ్చరిస్తోంది. 19 ఏళ్ల వయసున్న ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కు మార్చి మూడో వారంలో దగ్గు, జలుబు, జ్వరం వచ్చాయి. ఆస్పత్రికి వెళ్లగా.. కరోనా లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించి, ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతడి నమూనాల ఫలితాలు ఈ నెల 14న (మంగళవారం) వచ్చాయి. అతడికి కొవిడ్‌-19 పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది.

దీంతో.. అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద అతడు లాక్‌డౌన్‌కు ముందు పిజ్జాలను డెలివరీ చేసిన 72 మందిని, అతడితో కలిసి పనిచేసిన పిజ్జాబోయ్స్‌, మేనేజ్‌మెంట్‌ను గుర్తించి.. మొత్తం 89 మందిని క్వారంటైన్‌కు తరలించింది. వీరిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేకున్నా స్వీయ నిర్భందంలో ఉన్నారని అధికారులు వివరించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఆహారం, పాలు తదితర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి పరీక్షలు జరిపించాలని నిర్ణయించింది.

Courtesy Andhrajyothi

Leave a Reply