ఇంటి గోస

0
35
పీఎం ఆవాస్‌ యోజన సగం కూడా పూర్తికాలే..

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు. అధికారం కైవసం చేసుకున్నాక చేసిన వాగ్ధానాలు మరిచిపోయారు. 2022 కల్లా (8ఏండ్లలో) దేశంలో ఇండ్లులేని పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ , ఆయన నేతృత్వంలోని బీజేపీ దేశ ప్రజలకు వాగ్దానం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 2.94 కోట్ల పక్కా గృహాలు కట్టబోతున్నామని ఘనమైన ప్రచారానికి ప్రధాని మోడీ తెరలేపారు. తమ ప్రభుత్వం అందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వబోతోందని వెళ్లిన ప్రతి రాష్ట్రంలో చెప్పుకొచ్చారు. ఇండ్ల నిర్మాణ పథకాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకోవటంలో ఉన్న ఆసక్తి, లక్ష్యాన్ని పూర్తిచేయటంలో లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

– నిర్మాణం మొదలుకాని ఇండ్లు గ్రామాల్లో 84 లక్షలు..పట్టణాల్లో 59 లక్షలు..
– 2022కల్లా అందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామన్న మోడీ సర్కార్‌
– ప్రతి రాష్ట్రంలోనూ పెద్దఎత్తున ప్రచారం..రాజకీయ లబ్ది

న్యూఢిల్లీ : తమది డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వమని చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆవాస్‌ యోజన నత్తనడకను తలపిస్తోంది. ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, వారి సంకీర్ణ కూటములే అధికారంలో ఉన్నాయి. ఇక్కడ కేంద్రం తన వాటాగా 90శాతం నిధులు ఇవ్వాలి. అయినా ఆవాస్‌ యోజన పథకం ద్వారా ఇండ్లు లేని పేదలకు న్యాయం జరగటం లేదు. తెలంగాణలో ఈ పథకం అమల్లో లేదు. తమ రాష్ట్రంలో 18.2శాతం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. గోవాలో 8శాతం, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఒడిషా, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో ఇండ్ల నిర్మాణ పథకం జాతీయ సగటు 72శాతం కన్నా తక్కువగా ఉంది.

పేరు మార్పులో ఉన్న శ్రద్ధ..
ఇండ్ల నిర్మాణ పథకం తమ ఘనతగా మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. పథకానికి అప్పటవరకూ ఉన్న ‘ఇందిరా ఆవాస్‌ యోజన’ పేరును మార్చేశారు. పీఎం ఆవాస్‌ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 2.94 కోట్ల పక్కా ఇండ్లు నిర్మిస్తామని అధికారిక వెబ్‌సైట్‌లో కేంద్రం పేర్కొంది. ఈ సమాచారం ప్రకారం, జనవరి 6, 2023నాటికి 2.10 కోట్ల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 84 లక్షల ఇండ్లను నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణంలో కనీసం పునాది కూడా పడలేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే కేంద్రం ప్రకటించిన లక్ష్యంలో 51శాతం మాత్రమే పూర్తయింది. పట్టణ ప్రాంతాల్లో 1.25 కోట్ల గృహాలు కడతామని ప్రకటించగా, ఇందులో 61.19 లక్షల యూనిట్ల నిర్మాణం పూర్తయ్యింది. దీనినిబట్టి ఇంకా ఇండ్ల నిర్మాణం చేపట్టాల్సినవి 59 లక్షలున్నాయి. దీనిని బట్టి పీఎం ఆవాస్‌ యోజన పథకం అమలు తీరుపై మోడీ సర్కార్‌ ఎప్పుడో చేతులెత్తేసిందని అర్థమవుతోంది.

పేదల ఆశలపై నీళ్లు
8ఏండ్లలో లక్ష్యాన్ని చేరుకోవటంలో కేంద్రం దారుణంగా విఫలమైందని గణాంకాలే చెబుతున్నాయి. దాంతో ఆవాస్‌ యోజన (గ్రామీణ) పథకం లక్ష్యాన్ని మార్చి 2024కు పొడగించారు. అలాగే ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం లక్ష్యాన్ని డిసెంబర్‌ 2024కు పొడగిస్తూ గతంలో కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఎంతోమంది పేదల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. నిజానికి క్షేత్రస్థాయిలో ఉన్న డిమాండ్‌కు కేంద్రం ప్రకటించిన లక్ష్యానికి పొంతనలేదు. అయినప్పటికీ ఆ లక్ష్యాన్ని సైతం చేరుకోవటంలో కేంద్రం దారుణంగా విఫలమైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆవాస్‌ యోజన (గ్రామీణ)కు నిధులు మంజూరు చేస్తున్నారు.

రోజు కూలీ రూ.90
గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంటి నిర్మాణానికి కేటాయించిన మొత్తం రూ.లక్షా 20 వేలు. కొండ ప్రాంతాల్లో ఇది రూ.లక్షా 30వేలు. ఇంటి నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు రోజు కూలీగా రూ.90 ఇవ్వాలని నిబంధనలు రూపొందించారు. ఒక యూనిట్‌కు అయ్యే ఖర్చును కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో 90శాతం కేంద్రం, 10శాతం రాష్ట్రం తమ వాటాగా నిధులు విడుదల చేయాలి. ఇక ఆవాస్‌ యోజన (పట్టణ) పథకాన్ని గృహ నిర్మాణం, పట్టణ సంబంధాల శాఖ కింద అమలుజేస్తున్నారు. దీంట్లో మళ్లీ నాలుగు కేటగిరీలున్నాయి. 2011 సామాజిక, ఆర్థిక, కుల గణాంకాల్లో వెలువడ్డ వివరాల్ని పరిగణలోకి తీసుకొని ఆవాస్‌ యోజన పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది.
2011-22 మధ్యకాలంలో దేశ జనాభా ఎంతో పెరిగింది. ఇండ్లు లేని పేదల సంఖ్య భారీగా ఉంది. మట్టి గోడలతో, రేకులతో ఏండ్లుగా కష్టాలు పడుతున్న పేద కుటుంబాలు ప్రభుత్వం తమకు ఏదైనా సాయం చేయకపోతుందా? అని ఎదురుచూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న డిమాండ్‌కు ప్రభుత్వం కడతామని ప్రకటించిన 2.94 కోట్ల ఇండ్లు ఏమాత్రమూ సరిపోదని, ప్రకటించిన వాటినీ సమయానికి పూర్తిచేయకపోవటం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఆవాస్‌ యోజన పథకాన్ని దారుణంగా ప్రభావితం చేస్తోందన్న ఆరోపణలున్నాయి.

Leave a Reply