గంటకు 14 మంది మృతి

0
220

– చిన్నారులపై న్యుమోనియా పంజా
– రెండో స్థానంలో భారత్‌ : అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచం వ్యాప్తంగా చిన్నారులను న్యుమోనియా కబళిస్తోంది. ఎంతలా అంటే 2018లో ఒక గంటకు 14 మందికిపైగా ఐదేండ్ల లోపు చిన్నారులు న్యూమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా చనిపోయిన చిన్నారుల్లో సగానికి పైగా ఈ వ్యాధి బారిన పడగా…మృతుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో నిలిచిందని అధ్యయనం తెలిపింది. శ్వాస కోసం పోరాటం(‘ఫైటింగ్‌ ఫర్‌ బ్రీత్‌ ఇన్‌ ఇండియా) అనే అంశంపై సేవ్‌ ది చిల్డ్రన్‌, యూనిసెఫ్‌, ఎవ్రీ బ్రీత్‌ కౌంట్స్‌ చేసిన అధ్యయనం ప్రకారం 2018లో భారత్‌లో 1,27, 000లకు పైగా ఐదేండ్ల లోపు చిన్నారులను న్యుమోనియా పొట్టనపెట్టుకుంది. న్యుమోనియా కారణంగా ప్రతి నాలుగు నిమిషాలకు ఐదేండ్ల లోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నారు. దీనికి పోషకాహారలోపం, కాలుష్యం కూడా తోడ్పడున్నాయని సేవ్‌ ది చిల్డ్రన్‌ హెల్‌ అండ్‌ న్యూట్రిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేష్‌ ఖన్నా చెప్పారు. ఈ వ్యాధి కారణంగా చిన్నారులు చనిపోతున్న దేశాల్లో నైజీరియా(1,62,000), భారత్‌(1,27,000), పాకిస్తాన్‌(58వేలు), కాంగో (40వేలు) ఇథోపియా(32వేలు) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. 2018లో డయేరియా వల్ల 4,37, 000 మంది చిన్నారులు మృతి చెందగా, మలేరియా 2,72, 000 మంది ప్రాణాలను బలిగొందని పేర్కొంది.

Courtesy Navatelangana..

 

Leave a Reply