ఆటవిక న్యాయం!..ఉడుమును తిన్నందుకు..

0
309
  • ఉడుమును తిన్నందుకు జైలుకు ఆదివాసీలు
  • భూమి లాక్కోవద్దన్నందుకు బూటు కాలి తన్నులు
  • గిరిజనులపై అటవీ అధికారుల దాష్టీకాలు
  • భూమి రైతులదేనని రెవెన్యూ శాఖ స్పష్టీకరణ
  • అంగీకరించేందుకు అటవీ శాఖ ససేమిరా
  • సీఎం ప్రజా దర్బారు కోసం ఎదురు చూపులు
  • పోడు సమస్య పరిష్కరించాలని వినతులు

నిత్యం ఇంట్లో.. పెరట్లో తిరిగే ఉడుములను పట్టుకుని తినడం ఆదివాసులకు దశాబ్దాలుగా అలవాటే! కానీ, ఉడుమును పట్టుకుని తిన్నారంటూ ఇటీవల అటవీ శాఖ అధికారులు నలుగురిని పట్టుకున్నారు. వారిని తీవ్రంగా కొట్టి.. కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఉడుమును పట్టుకుని తిన్నందుకు కేసా అని ఆశ్చర్యపోకండి! సార్సాల ఘటనలో అటవీ శాఖాధికారిణి అనితపై దాడికి ముందు, తర్వాత ఆదివాసులను వేధించిన ఘటనలు ఎన్నో! పోడు భూముల ఆక్రమణ, హరితహారంలో మొక్కల పెంపకం తదితర కార్యక్రమాల్లో ఆదివాసీలను అటవీ, పోలీసు శాఖాధికారులు వేధిస్తూనే ఉన్నా అవేవీ బయటకు రావడం లేదు. సార్సాల ఘటనలో అటవీ అధికారిణిపై దాడి మాత్రమే జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందని.. అందుకు దారి తీసిన పరిస్థితులు, వారి అరాచకాలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం.. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య పోడు భూముల సమస్య రగులుతుండడమే. ఏళ్ల తరబడి తమ సాగులోని భూమిని స్వాధీనం చేసుకుంటుండడంతో కడుపు మండిన రైతులు దాడులు చేస్తున్నారు. భూ ప్రక్షాళనలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించినా వివాదాస్పద భూముల జోలికి వెళ్లకపోవడంతో మరింత తీవ్రమవుతోంది. అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం నిరుపేదలకు శాపంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే 50 వేల ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. భూ తగాదాలతో దాదాపు 20 వేల మంది పేదలు నలిగిపోతున్నారు. దాడులు, కేసులు తట్టుకోలేక చాలామంది సాగు మానేశారు. వేల ఎకరాలు నిరుపయోగంగా మారాయి.

అధికారుల దాష్టీకాలు ఇవీ!…రైతులు కాస్తు చేస్తున్న భూములు తమవని అటవీ అధికారులు అంటున్నారు. దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్నాయని, డిజిటల్‌ పాస్‌ బుక్‌లు కూడా ఇచ్చారని రైతులు వాదిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ పంచాయతీ తేలడం లేదు. కానీ, పోడు పేరిట అటవీ అధికారుల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు, సిర్పూర్‌ నియోజకవర్గం కాగజ్‌ నగర్‌ మండలంలోని సార్సాలలో ఈ ఏడాది జూన్‌ 8న మల్లయ్యకు చెందిన రెండెకరాల చుట్టూ అఽధికారులు హద్దులు పాతడం మొదలు పెట్టారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నానని, భూమిని లాక్కోవద్దని అతడు అధికారును వేడుకున్నాడు. కాళ్లూ చేతులూ పట్టుకున్నాడు. ఈ సందర్భంగా, ఎఫ్‌ఆర్‌వో ఒకరు బూటు కాలితో మల్లయ్యను తన్నాడు. దాంతో, మల్లయ్య నేరుగా తన చేనుకు వెళ్లి విషం తాగాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని, అందుబాటులో ఉన్న ఫారెస్టు అధికారుల వాహనం ఇవ్వాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వేడుకున్నా అటవీ శాఖాధికారులు దురుసుగా ప్రవర్తించారు. చివరకు గ్రామస్థులు మల్లయ్యను భుజాలపై మోసుకుని తీసుకెళ్లారు. ఆటోలో కాగజ్‌నగర్‌కు; స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో మంచిర్యాలకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనను అటవీ మంత్రికి, ఇతర అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

భూ వివాదం ఇదీ..!సార్సాల గ్రామంలో వంద ఎకరాల భూమి ఉంది. 30 ఎకరాల్లో 1993కు ముందు నుంచే 9 మంది గిరిజనులు, నలుగురు దళితులు, ఏడుగురు బీసీలు సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో ఐటీడీఏ వారికి జీడిమామిడి మొక్కలు కూడా ఇచ్చింది. ఐదుగురికి 2006లో ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలు ఇచ్చారు. ఇదే ప్రాంతంలో 193 సర్వే నంబరులోని 1850 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 1976లో 848 ఎకరాలను ప్రభుత్వం అటవీ శాఖకు అప్పగించింది. అసలు వివాదమంతా ఇక్కడే ప్రారంభమైంది. ఆ భూమికి హద్దులు లేవు. ఇదే సర్వే నంబర్లో 86 మంది రైతులకు 293 ఎకరాలను ప్రభుత్వం అసైన్‌ చేసింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వీరు కాస్తులో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్‌ పాసు పుస్తకాలు కూడా వీరి వద్ద ఉన్నాయి. రైతుబంధు పథకం కూడా అమలవుతోంది. కానీ, రైతులు కాస్తు చేస్తున్న భూమితోపాటు వారికి కేటాయించిన భూమి చుట్టూ సుమారు 272 ఎకరాల్లో ఇటీవల అటవీ అధికారులు ట్రెంచ్‌ (కందకం) తవ్వారు. ఈ భూమి రైతులదేనని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నా.. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు.

భారీ కవాతు మధ్య హరితహారం…సార్సాలలో ఉన్నవి 150 కుటుంబాలు మాత్రమే. జూన్‌ 30న అనితపై దాడి తర్వాత పలువురిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆదివాసీలంతా భయంభయంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సార్సాలలోని వంద ఎకరాల్లో (ఇందులో 30 ఎకరాలు మాత్రమే రైతులవి) మొక్కలు నాటేందుకు 700 మంది అటవీ, పోలీసు శాఖాధికారులు 95 వాహనాల్లో వచ్చారు. వారిలో 5 ఐపీఎ్‌సలు, 11 మంది ఐఎ్‌ఫఎస్‌, 5 డీఎస్పీలు ఉన్నారు. గ్రామాన్ని చుట్టుముట్టి భారీ కవాతు మధ్య మొక్కలు నాటారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో పోయిన భూములకు బదులుగా డీ గ్రేడ్‌ ఏరియాల్లో మొక్కలు నాటుతున్నామని అటవీ అధికారులు అంటున్నారు. కానీ, ఇక్కడ డి గ్రేడ్‌ అడవి వేల ఎకరాల్లో ఉంది. దానిని వదిలేసి పోడు భూములను దున్నడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

Courtesy Andhrajyothi..

Leave a Reply