గ్రామాలను ఖాళీ చేయాల్సిందే..

0
56

పోలవరంనిర్వాసితులపై ప్రభుత్వం ఒత్తిడి!

రాజమహేంద్రవరం : ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయకుండానే గ్రామాల నుంచి పోలవరం నిర్వాసితులను పునరావాస కాలనీలకు ప్రభుత్వం బలవంతంగా వెళ్లగొడుతోంది. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రామాలను ఖాళీ చేయాలంటూ నిర్వాసితులపై అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు మండలాల్లో 236 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయి. 70,929 కుటుంబాల వారు నిర్వాసితులవుతున్నాయి. గత 16 ఏళ్లలో వీటిలో 1,001 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. తాజాగా దేవీపట్నంలోని 18 గ్రామాల్లో 1,067 కుటుంబాలను హడావుడిగా నిర్వాసిత కాలనీలకు తరలిస్తున్నారు. వీరికి వారం క్రితం బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహాం జమ చేశారు. కానీ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. పునరావాస కాలనీలకు వెళ్లిన వారికి మాత్రమే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తామంటూ అధికారులు చెప్తుండడంతో చాలామంది ఇష్టం లేకపోయినా గ్రామాలను ఖాళీ చేశారు. అక్కడికి వెళ్లిన వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీనిపై అడిగితే అధికారులు కూడా మాట దాటవేస్తున్నారని నిర్వాసితులు తెలిపారు. పునరావాస కాలనీలో తాగునీరు, విద్యుత్తు వంటి కనీస వసతులు లేకపోవడంతో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31లోపు 13 గ్రామాలను, ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడు గ్రామాలను తరలించేందుకు అధికారులు ఒత్తిడి పెంచారు. ఇప్పటికే దేవీపట్నం మండలంలోని సీతారాం, మంటూరు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. సీతారాంలో మొదటి దశలో 68, రెండు, మూడో దశలో మరో పది కుటుంబాలను నిర్వాసితుల జాబితాలో చేర్చారు. మొదటి జాబితాలోని వారికి మాత్రం ఇళ్లు కేటాయించారు. రెండు, మూడో జాబితాలోని వారికి పట్టాలు ఇచ్చారుగానీ, ఇళ్లు చూపించలేదు. జిల్లాలోని సుమారు 69 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది.

విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామంటున్నారు : కొమరం గంగాభవాని, సీతారాం గ్రామం
పునరావాసంలో భాగంగా మాకు ఇళ్ల కేటాయించలేదు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. చేయకపోతే విద్యుత్తు సరఫరా నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలోను మా పేరు లేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలి.

Courtesy Prajashakti

Leave a Reply