ఫిర్యాదు చేసినా.. కనికరించని ఖాకీలు

0
191

– ఢిల్లీ హింసపై దర్యాప్తులో అలసత్వం

న్యూఢిల్లీ : ఫిబ్రవరి 24 సాయంత్రం.. ఈశాన్య ఢిల్లీలో మూకలు వీధులను తమ గుప్పెట్లోకి తీసుకుని హల్‌చల్‌ చేశాయి. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదాయి. మారణకాండకు పాల్పడ్డాయి. బుల్లెట్ల వర్షం కురిపించాయి. నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న నసీర్‌ ఖాన్‌ (30) తన సోదరితో కలిసి ఇంటికి తిరిగివెళుతుండగా ఓ బుల్లెట్‌ దూసుకొచ్చింది. అతని ఎడమ కంటిని తాకింది. నసీర్‌ను అతని తండ్రి, సోదరుడు ఓ ఆటో రిక్షాలో ఖాలిద్‌ఖాన్‌ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ప్రాణాలైతే దక్కాయి కానీ, ఎడమ కన్ను చూపు కోల్పోయాడు. గురు తేగ్‌ బహదూర్‌ ఆసుపత్రిలో నసీర్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ‘ఏ ఒక్క పోలీసు అధికారి మమ్మల్ని సంప్రదించలేదు..’ అని నసీర్‌ తండ్రి చెప్పారు. పోలీసుల దర్యాప్తునకు అవసరమైన వైద్య కేసుల్లో తప్పనిసరి అయిన మెడికో-లీగల్‌ సర్టిఫికేట్‌ కూడా వారికి ఇవ్వలేదు, సాక్షి వాంగ్మూలం నమోదు కాలేదు. పోలీసు ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌) దాఖలు చేయలేదు.
ఫిబ్రవరి 24-26 మధ్య ఈశాన్య ఢిల్లీని చుట్టేసిన ‘మత హింసాకాండ’లో 53 మంది ప్రాణాలు పోయాయి. హింసకు సంబంధించి 702 కేసులు దాఖలుచేసినట్టు ఢిల్లీ పోలీసులు చెబుతుండగా, వీటిలో ఎన్ని హత్య కేసులున్నాయో? ఎన్ని హత్యాయత్నం కేసులున్నాయో స్పష్టతలేదు. ఇక పోలీసుల పనితీరు చెప్పాల్సిన పనిలేదు.. దాడులు జరుగుతుంటేనే చూస్తూ నిలబడిపోయిన పోలీసులు, ఇక రాతపూర్వక ఫిర్యాదుల సమర్పించినా పట్టించుకోవటంలేదని బాధితులు వాపోతున్నారు.

పోలీసుల పనితీరు ఇలా….
తమ బిడ్డ తప్పిపోయాడంటూ ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. అతని మృతదేహాన్ని ఓ కాలువ నుంచి వెలికితీశారు. కానీ, ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. మరొక కేసులో ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ‘యూనీఫామ్‌’ వేసుకొన్న కొందరు మూకలు తన సోదరుడిని కాల్చటం చూశానని చెప్పినా.. అతని సాక్ష్యాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే మహమ్మద్‌ హమ్జా మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. ఆ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేసినా.. ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు నిరాకరించారు.

వీడియో ఆధారాలున్నా..
నసీర్‌ఖాన్‌ కేసులో పోలీసులకు దర్యాప్తు చేయటం చాలా సులభం. ఎందుకంటే ఆ ఘటనకు సంబంధించి వీడియో రికార్డులున్నాయి. హింసాత్మక గుంపు చెలరేగిపోతుంటే… చుట్టుపక్కల వాళ్లు వీడియోలను రికార్డ్‌ చేశారు. తాను ఆ మూకలను గుర్తించగలనని మహమ్మద్‌ సలీమ్‌ పోలీసులకు చెప్పారు.
తమ ఇంటిపై ‘కిరాతక దాడి జరిగిందనీ మార్చి 1న జఫ్రాబాద్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ‘వారు నా ఇంటిపై కాల్పులు జరిపారు … బుల్లెట్‌ గుర్తులు ఇప్పటికీ నా ఇంటి గోడలకు ఉన్నాయి. వారు పెట్రోల్‌ బాంబులను కూడా విసిరారు.. ఆ ఆనవాళ్లు కూడా ఉన్నాయి’ అని సలీం అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నసీర్‌ఖాన్‌ ఈ విషయాన్ని కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ‘వాళ్లు బుల్లెట్‌ వర్షం కురిపించారు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి’ అని పేర్నొన్నాడు. సలీం ఫిర్యాదును పోలీసులు స్వీకరించారుకానీ, ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కాలేదు సరికదా…తనకే బెదిరింపులు వస్తున్నాయని సలీం అన్నారు.

‘మీరు ఫిర్యాదు చేసినంతమాత్రాన కేసు నమోదవుతుందనుకుంటే తప్పు. రాసిందల్లా నమ్మటానికి.. నువ్వు సత్యహరిశ్చంద్రుడో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తో కాదు.. మీరు ముందు పోలీస్టేషన్‌కు రండి.. మీ సంగతి చూస్తాం..’ అంటూ తనకు ఫోన్‌ చేసిన అధికారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఫోన్‌ కాల్‌ సంభాషణ కూడా సలీం రికార్డు చేశారు. అయితే, సలీం పోలీస్టేషన్‌కు వెళ్ళలేదు. పోలీస్టేషన్‌కు వెళితే.. తనను లక్ష్యంగా చేసుకుంటారని సలీంకు అర్థమైంది.

అష్ఫాక్‌ హుస్సేన్‌ : ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినా.. కీలకమైన వివరాలు లేవు
అష్ఫాక్‌ హుస్సేన్‌ (22)కు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున వివాహం జరిగింది. ముస్తాఫాబాద్‌లోని వీధి నంబర్‌ 15లో అతని నివాసం ఉంది. పెండ్లి అలంకరుణ ఇంకా చెదిరకముందే.. 11 రోజులకు అతని మృతదేహం ఇంటికి చేరింది.

ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 2 గంటల సమయంలో, హుస్సేన్‌ సోదరుడు అబ్బాస్‌కు తన స్నేహితుడి నుంచి ఫోన్‌ వచ్చింది. బ్రిజ్‌పురిలో హింస చెలరేగిందని చెప్పాడు. అది హిందూ-మెజారిటీ ప్రాంతం. తన సోదరుడు పనిమీద బ్రిజ్‌పురి వెళ్ళాడని తెలిసి అబ్బాస్‌ అక్కడికి చేరుకున్నాడు. ఓ మసీదు, మదర్సా, ఉన్నత పాఠశాల అప్పటే ధ్వంసం అయ్యాయి. బ్రిజ్‌పురి వైపు నుంచి కాల్పులు జరిపారు. హింస పెరగడంతో తాను వెనక్కి వచ్చాననీ, సాయంత్రం తిరిగి తండ్రితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళామనీ, కానీ అష్ఫాక్‌ హుస్సేన్‌ దొరకలేదని వారు చెప్పారు. గాయపడిన అష్ఫాక్‌ను మొదట ముస్తాఫాబాద్‌లోని అల్‌ హింద్‌ ఆస్పత్రికి, తరువాత గురు తేగ్‌ బహదూర్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఆ తర్వాత వారికి సమాచారం అందింది. అయితే, అప్పటికే అష్ఫాక్‌ హుస్సేన్‌ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బుల్లెట్‌ గాయాలతోనే అతను చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే, పోలీసులు పిబ్రవరి 26న దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో హుస్సేన్‌ కుటుంబసభ్యులు చెప్పిన కీలక విషయాలేవీ లేవు.
అష్ఫాక్‌ హుస్సేన్‌తోపాటు మరో ముగ్గురు మృతిచెందారు. బ్రిజ్‌పురి నివాసి మెహతాబ్‌ మున్నా ఖాన్‌ (22), ముస్తఫాబాద్‌ వాసి జాకీర్‌ (24), 25-30 ఏండ్ల మధ్యవయసు కలిగిన మరో వ్యక్తి జీటీబీ ఆస్పత్రిలో మృతిచెందినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మత హింసలో వారు హత్యకు గురయ్యారన్న విషయం తప్ప ఎప్‌ఐఆర్‌లో ఎలాంటి వివరాలూ లేవు. నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారా అన్నదానిపైనా ఎలాంటి వివరణా లేదు.

కోర్టు జోక్యం తర్వాతే..

ఫిబ్రవరి 25న ముస్తాఫాబాద్‌ వాసి మహమ్మద్‌ హంజ్జా హత్యకు గురయ్యాడు. కిరాణా సామాగ్రి కొనేందుకు వెళ్ళిన ఆయన ఇంటికి తిరిగిరాలేదు. 26న ఆయన కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్ళారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు తిరస్కరించారు. 28న మరోసారి వెళ్ళారు. రెండు మూడు పోలీస్టేషన్లు తిరిగారు. అయినా పట్టించుకోలేదు. మార్చి 1న మేం హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేశామనీ, ఆ తర్వాత మాత్రమే పోలీసుల నుంచి స్పందన వచ్చిందని అతని సోదరుడు ఆరీఫ్‌ చెప్పారు. పిటిషన్‌ విచారణ సందర్భంగా పోలీసులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది.
ఈ కేసుకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. అదే రోజు సాయంత్రం పోలీసులు బాధితుడి కుటుంబసభ్యులను రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ మూడు గుర్తుతెలియని మృతదేహాలు మార్చరీలో ఉన్నాయి. అందులో హంజ్జా మృతదేహాన్ని గుర్తించాం. ఆ కుటుంబానికి పోస్టుమార్టం నివేదిక కాపీ ఇంతవరకూ అందలేదు.

Courtesy Nava Telangana

Leave a Reply