- నిరంతర విధుల్లో అప్రమత్తతే రక్ష
- పది రోజుల వ్యవధిలో ఇద్దరికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ విస్తరిస్తోంది. వారూ.. వీరు.. అనే తేడా లేకుండా అంతా వ్యాధి బారిన పడుతున్నారు. అత్యాధునిక సమాచార పరిజ్ఞానం.. అధునాతన వైద్యసేవలు అందుబాటులో ఉన్న దేశాల్లోనూ వందల మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బందితో పాటు నిరంతరంగా విధులు నిర్వహిస్తున్న న్యూయార్క్ పోలీస్ విభాగంలో పలువురు వైరస్ బారిన పడ్డారు. అక్కడి లాగానే వైరస్ కట్టడికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు నెల రోజుల నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పది రోజుల వ్యవధిలో ఒక జమేదార్, మరో కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. పోలీస్ అధికారులు, సిబ్బంది తమ రక్షణపై మరింత దృష్టిసారించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రక్షణ పరికరాలు అవసరం..
లాక్ డౌన్ ప్రకటన నుంచి పోలీస్ అధికారులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను వినియోగించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 10 వేల మంది అధికారులు, సిబ్బందికి తొలి రోజు మాస్కులు అందజేశారు. కొద్ది రోజులకే మాస్కులు, శానిటైజర్ల సరఫరా ఆగిపోయింది. దాతలు ఇస్తున్న వాటితో సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు పోలీసులు సొంతంగా మాస్కులు, శానిటైజర్లు సమకూర్చుకుంటున్నారు. కార్యాలయాల్లోకి ప్రవేశించే ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు అందరికీ శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఇవి మరింత అవసరం ఉంది. రహదారులపై విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరికి మాస్కులు ఉండడం లేదు.
అన్ని చోట్లా వారే..
కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగమంతా కృషి చేస్తున్నా.. తెరపై పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. రద్దీ ప్రాంతాలు, రైతు బజార్లు, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు వస్తున్న ప్రజలు ఎడం పాటించడం లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్తున్న పోలీసులు రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో చేతి తొడుగులు లేకుండానే వాహనాలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. పోలీసులు నిరంతరంగా విధులు నిర్వహించకుండా విడతలవారీగా పని చేస్తే.. వ్యక్తిగత శుభ్రత పాటించేందుకు వీలవుతుందని వివరిస్తున్నారు.
ఫీవరాసుపత్రికి 15 మంది కరోనా అనుమానితులు
నల్లకుంట, అమీర్‌పేట, న్యూస్‌టుడే: కరోనా అనుమానిత లక్షణాలతో 15 మంది శనివారం నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు. వైద్యులు వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 38 మంది అనుమానితులు ఉన్నారు.
ఛాతీ ఆసుపత్రిలో 23 మంది..
కొవిడ్-19 నిర్ధారణతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో శనివారం నాటికి 23 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా।। మహబూబ్‌ఖాన్ తెలిపారు. మరో 15 మంది అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో ఉండగా.. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా.. నివేదికలు రావాల్సి ఉందన్నారు.
Courtesy Eenadu