- బాబును ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కారు నిలిపివేత
- రూ.1,100 చలానా చెల్లించాలని పోలీసుల ఒత్తిడి
- చెల్లింపునకు మీసేవలో అరగంట సమయం వృథా
- నిలోఫర్‌కు వెళ్లేసరికి ఆలస్యమైపోయిందన్న వైద్యులు
- పోలీసుల నిర్లక్ష్యమేనంటూ తల్లిదండ్రుల ఆరోపణ!
- యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ఘటన
యాదగిరిగుట్ట రూరల్ : ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోతే.. ఆ మార్గంలో వాహనంపై వెళ్తున్నవారు పక్కకు జరిగి మరీ దారిస్తారు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా కాస్త కనికరం చూపిస్తారు. ఇంకా అవసరమైతే సాయం చేసేందుకు ముందుకొస్తారు. కానీ, దీనికి పూర్తి భిన్నంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సమీపంలో మంగళవారం జరిగిన ఘటన శిశువు ప్రాణాలు బలిగొంది. నిరుపేద తల్లిదండ్రులకు తీరని మనో క్షోభ మిగిల్చింది. తల్లిదండ్రుల సమాచారం మేరకు.. జనగామ జిల్లా జనగామ మండలం మరిపగి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశ, సరస్వతి దంపతులకు మూడు నెలల కిందట కుమారుడు (రేవంత్) జన్మించాడు. కొన్ని రోజులుగా శిశువు పాలు తాగడం లేదు.
దీంతో జనగామ శ్రీసుధా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే, అక్కడి వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించి రేవంత్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అందుబాటులో ఉన్న కారును అద్దెకు మాట్లాడుకుని హైదరాబాద్ బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ సమీపంలోకి రాగానే స్థానిక ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు. రూ.1,100 మేర చలానాలు ఉన్నాయని.. వాటిని చెల్లిస్తేనే విడిచిపెడతామని పోలీసులు చెప్పారని, తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదని మల్లేశ, సరస్వతి తెలిపారు. కారు డ్రైవర్ సాయి.. వంగపల్లి సమీపంలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి చలానా కట్టి వచ్చేందుకు 30 నిమిషాలుపైగా పట్టిందని చెప్పారు. అనంతరం హైదరాబాద్ వెళ్లాక.. రేవంత్‌ను పరీక్షించిన వైద్యులు ఆలస్యంగా రావడంతో మృతి చెందాడని చెప్పారని పేర్కొన్నారు.
ఆ కారును ఆపలేదు
ఈ ఘటనలో పోలీసుల వివరణ మరోలా ఉంది. మంగళవారం ఉదయం తమ సిబ్బంది జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారని, ఆస్పత్రికి వెళ్తామని ఎవరూ తమ దృష్టికి తేలేదని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదులు తెలిపారు. శిశువును ఎవరు ఏ కారులో తెచ్చారో ఎవరికీ తెలియదన్నారు. ఆపద ఉందంటే వేరే కారులో పంపి ఉండేవారమన్నారు. తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదని వివరణ ఇచ్చారు.
– సైదులు, ట్రాఫిక్ సీఐ