తెరుచుకోనున్న నిఘా నేత్రం

0
74
  • ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నేడు ప్రారంభించనున్న సీఎం
  • హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు
  • రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు
  • సిగ్నలింగ్‌ వ్యవస్థ, పోలీస్‌ యాప్‌లు, డయల్‌ 100
  • అన్నీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం
  • ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే వీలు
  • 600 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సర్కారు

హైదరాబాద్‌/సిటీ : అక్షరాలా పది లక్షల కెమెరాల అనుసంధానంతో.. రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా క్షణాల్లో కనిపెట్టి అక్కడి పోలీసు అధికారులను అప్రమత్తం చేసే నిఘా నేత్రం తెరుచుకోవడానికి రంగం సిద్ధమైంది! రూ.600 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌  కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురువారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు హోంమంత్రి, ఇతర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, డీజీపీ, అదనపు డీజీపీలు, సీపీలు, జిల్లా ఎస్పీలు, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు, భవన నిర్మాణం చేపట్టిన ఆర్‌అండ్‌ బి అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2016 నవంబర్‌ 22న  ప్రారంభమైన కమాండ్‌ కంట్రోల్‌ భవన నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. గతంలో రెండుసార్లు ప్రారంభోత్సవానికి ప్రణాళికలు రచించినప్పటికీ..

నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందని… పోలీస్‌ సిబ్బందికి కొత్త శక్తి చేకూరుతుందని.. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, నేరగాళ్లపై చర్యల వంటి అంశాల్లో ఎంతో పురోగతికి అవకాశం ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సంబంధించిన విశేషాల గురించి డీజీపీ మహేందర్‌ రెడ్డి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటిదాకా 9.5 లక్షల కెమెరాలు అమర్చామని ఆయన వెల్లడించారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజీని.. స్థానిక పోలీ్‌సస్టేషన్లు, ఎస్పీ, కమిషనర్‌ స్థాయిలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌తో పాటు నగరంలో ప్రారంభమవుతున్న కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా 365 రోజులు, 24/7 గంటలు వీక్షించే అవకాశం ఉందన్నారు. ఆ సీసీ ఫుటేజీని 30 రోజుల దాకా భద్రపరిచే ఏర్పాట్లు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నాయన్నారు. ప్రత్యేక బ్యాక్‌ ఎండ్‌ బృందాలు నిరంతరం వాటిని పరిశీలిస్తూ.. రాష్ట్రంలోని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా వెంటనే గుర్తించి అక్కడి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు క్షణాల వ్యవధిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తాయి. అయితే.. ఈ భవనాన్ని గురువారం ప్రారంభిస్తున్నప్పటికీ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం ఇక్కడికి తరలడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని విభాగాలనూ ఒకేసారి కాకుండా విడతలవారీగా ఇక్కడికి మారుస్తారని సమాచారం.

అన్నింటితో అనుసంధానం..
తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌ స్టేషన్లనూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలతో పాటు ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డేటా, అన్ని ప్రాంతాల్లోని సిగ్నలింగ్‌ వ్యవస్థ, క్రైమ్‌, క్రిమినల్స్‌ డేటా, డయల్‌ 100, 112 లైన్లను,  తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన అన్ని రకాల యాప్‌లూ (హాక్‌ఐ, తెలంగాణ కాప్‌ తదితరాలు), ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర పోలీసుల ఖాతాలను, ఇతర జిల్లాల్లో ఉపయోగిస్తున్న అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానాలనూ అనుసంధానం చేసినట్లు తెలిసింది.

ఇతర శాఖలూ
కేవలం పోలీస్‌ శాఖకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సైతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకునేలా ఈ భవనంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఏదైనా ఉపద్రవం తలెత్తినప్పుడు ప్రత్యేక వార్‌ రూమ్‌ ద్వారా వివిధ శాఖాధికారులు పరిస్థితిని పరిశీలించే అవకాశం కల్పించారు. సుమారు 500 మందికి సరిపోయేలా ప్రత్యేక ఆడిటోరియం, టవర్‌లోని 14, 15 అంతస్తుల్లో మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. మ్యూజియం ద్వారా సాధారణ ప్రజలు కూడా పోలీసుల పనితీరు.. కమాండ్‌ కంట్రోల్‌ పనితీరును తెలుసుకునే అవకాశముంటుంది.

ఏఐతో రద్దీ నియంత్రణ
జాతరలు, రాజకీయ బహిరంగ సభలు, క్రికెట్‌ మ్యాచులు జరిగినప్పుడు లక్షలాది ప్రజలు తరలి వస్తుంటారు. ఆ రద్దీని నియంత్రించడం పోలీసులకు పెనుసవాలే. అంచనాలు ఏ మాత్రం తప్పినా రద్దీ అకస్మాత్తుగా పెరిగి తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. కానీ. కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌లోని కృత్రిమ మేధ సాయంతో ఇలాంటి రద్దీని నియంత్రించవచ్చు. ఏవీరోస్‌ అనే స్టార్టప్‌ అభివృద్ధి చేసిన టెక్నాలజీ.. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పెరిగే రద్దీని గమనించి ముందే అప్రమత్తం చేస్తుంది. వెంటనే సెంటర్‌లోని అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారమిచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పల్‌లో గతంలో జరిగిన భారత్‌-వెస్టిండీ్‌స మ్యాచ్‌ సమయంలో ఈ టెక్నాలజీని పరీక్షించి చూశారు.

క్షణాల్లో స్పందన
రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా క్షణాల్లో హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం అందుతుంది.

ూ ఏదైనా ప్రాంతంలో నేరం జరిగితే.. ఆ ప్రాంతంలో ఇదివరకు ఏయే నేరాలు జరిగాయి, ఆ నేరాలకు పాల్పడినవారెవరు, ఆ ప్రాంతంలో ఉన్న పాత నేరగాళ్ల జాబితా.. తదితర వివరాలను విచారణ అధికారులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందజేస్తుంది. దీంతో దర్యాప్తు సులువవుతుంది.

ూ 100, 112, ఇతర టోల్‌ ఫ్రీ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి.. బాధితులు ఫోన్‌ చేసిన ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇస్తుంది. సమీపంలో ఏ పోలీస్‌ గస్తీ వాహనం ఉందో గుర్తించి వారిని అప్రమత్తం చేస్తుంది. దీంతో అధికారులు నిమిషాల్లో అక్కడకు చేరుకుంటారు.  వారిని రక్షిస్తారు. అలాగే.. హాక్‌ ఐ, పోలీస్‌ కాప్‌లాంటి యాప్‌ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారలకు చేరవేస్తుంది. పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి బాధితులకు తెలుపుతుంది.

కేసు విచారణలో ఎలాంటి సాంకేతిక సహాయం కావాలన్నా దర్యాప్తు అధికారులకు కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఒక అస్త్రంలా ఉపయోగపడుతుంది.

ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డా.. అక్కడి ఉన్నతాధికారులను, ట్రాఫిక్‌ పోలీసులను వెంటనే అలర్ట్‌ చేస్తుంది.

పాత నేరగాళ్ల వేలిముద్రలు, ముఖచిత్రాలతో కూడిన డేటా బేస్‌ సాయంతో.. వారి కదలికలను ఎప్పటికప్పుడు దర్యాప్తు అధికారులకు అందజేస్తుంది. కొత్త నేరగాళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఈ డేటాబే్‌సకు జోడించవచ్చు.

భవనం విశేషాలు
కళ్లు చెదిరేలా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవన విస్తీర్ణం.. 6.42 లక్షల చదరపుటడుగులు. అందులో 2.16 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణాన్ని పార్కింగ్‌ కోసం కేటాయించారు.

 ఈ భవనం ఎత్తు.. 272 అడుగులు.
టవర్‌-ఏలో 20 అంతస్తులు (హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌)
టవర్‌-బిలో 15 అంతస్తులు (టెక్నాలజీ ఫ్యూజన్‌ టవర్‌లో డయల్‌-100, షీ సేఫ్టీ, సైబర్‌, నార్కోటిక్స్‌, క్రైమ్స్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్‌)
టవర్‌-సి.. జీ+2, 480 మంది కూర్చునే అవకాశం గల ఆడిటోరియం.
టవర్‌-డి.. జీ+1, మీడియాఅండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌.
టవర్‌-ఈ.. కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ డేటా సెంటర్‌
600 కార్లు, 350 ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు అవకాశం
ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ నిమిత్తం భవనం పైభాగంలో హెలీ ప్యాడ్‌
గ్రీన్‌ బిల్డింగ్‌- అద్దాల మేడ కావడంతో వెలుతురు ధారాళంగా వస్తుంది. దీనివల్ల 50ు విద్యుత్తు ఆదా అవుతుందని అంచనా.
సోలార్‌ ప్యానెల్స్‌తో 0.5 మెగావాట్స్‌ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
35 శాతం స్థలంలో మొక్కల పెంపకం కోసం ఏర్పాట్లు
యోగా సెంటర్‌, జిమ్‌, వెల్‌నెస్‌ సెంటర్‌
తెలంగాణ చరిత్రను ప్రతిబింబించే మ్యూజియం, నగరమంతా వీక్షించే విధంగా నిర్మాణం

ప్రపంచస్థాయి కేంద్రం మంత్రి కేటీఆర్‌
అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను (టీఎస్‌పీఐసీసీసీ) సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నారంటూ మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. దేశంలో ఇప్పటిదాకా నిర్మితమైనఅత్యంత అధునాతన ప్రభుత్వ కేంద్రాల్లో ఇది ఒకటని ఆయన కొనియాడారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చిత్రాలను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

Leave a Reply