దిశా నిందితులు మరణశిక్ష విధించ దగినవాళ్లే విధించాలి.

0
228

దిశా నిందితులు మరణశిక్ష విధించ దగినవాళ్లే విధించాలి కుడా కానీ ఆ శిక్షా చట్టబద్ధంగా జరగాలి. కానీ చట్టవిరుద్దంగా ఒక రకంగా దొంగతనంగా చంపడం అంటే మన చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థ బాగోలేవు అని చెప్పడమే. నిజానికి పోలీసు వ్యవస్థ కూడా అంతకంటే గోరంగా ఉన్న సంగతి అందరూ అంగీకరించేదే.

కానీ ఇపుడు న్యాయవ్యవస్థ కంటే పోలీసు వ్యవస్థ మెరుగు అనే భావన కల్పిస్తున్నారు. పోలీసు వ్యవస్థను ఇలాంటి కొమ్ములు ఇస్తే ఉన్న నామ మాత్రపు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేయడానికి వారికి లైసెన్స్ ఇవ్వడమే. ఈ పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థకు లోబడి ఉంటుంది. పోలీసులు కాల్చిచంపినా ప్రభుత్వ లోపాయకారి అనుమతి లేకుండా జరగదు. కావున ఈ చట్ట విరుద్ధ చర్యలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఘటనతో భూటకపు ఎంకౌంటర్లకు ప్రజల ఆమోదముద్ర వేయించుకున్న వీరు భవిష్యత్తులో తమ దుర్మార్గాలకు ఈ ఆమోదాన్ని వాడుకోకుండా ఉండరు. వాకపల్లిలో 17 మంది గిరిజన మహిళలను రేప్ చేసిన గ్రేహౌండ్స్ పోలీసులపై చర్యలు లేవు. యూపీ లో ఒక మంత్రి మహిళపై అత్వచారం చేయడమే కాకుండా కేసు పెట్టిందని ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడి హత్య చేసినా శిక్షలేదు. కాశ్మీరులో పసిమొగ్గ అసిఫా పై రోజుల తరబడి రేప్ చేసి చంపినా సరైన శిక్షలు లేవు. పైగా నిందితులను సమర్థిస్తూ అక్కడి లాయర్ల ప్రదర్శన. అసిఫా తరపున కేసు వాదించిన లాయరుపై హత్య ప్రయత్నం. ఆక్కడ పోలీసులు లేరా. మరెందుకు వారికి శిక్షలు లేవు. భూటకపు ఎంకౌంటర్లకు పాల్పడి ఉద్యమకారులతో పాటు అనేక మంది గిరిజనులను కాల్చి చంపుతున్న పోలీసులపై కోర్టుల తీర్పుల ప్రకారం కూడా కేసులు నమోదు చేయరు. చర్యలు ఉండవు. కోర్టు తీర్పు ప్రకారం దిశా నిందుతుల భూటకపు ఎంకౌంటర్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలి. కానీ చట్టం, కోర్టు తీర్పులు అమలు జరగవు.

దళిత వర్గాల, పేద వర్గాల కు ఇలాంటి అన్యాయాలు రోజూ అనేకం జరుగుతున్నాయి. కానీ పోలీసులు, ప్రభుత్వం కనీసమైన ఎలాంటి చర్యలు తీసుకొని వైఖరి చూస్తున్నాం. ప్రజలు దేశవ్యాపితంగా ఆందోళన చేసిన సందర్భాలలో ఏదో ఒక చట్టం చేసో, ఇలా కాల్చి చంపి చేతులు దులుపుకుంటున్నారు. అదికూడా నిందితులు కూడా పేదవారు వెనుక ఎలాంటి పొలిటికల్ బ్రాక్ గ్రౌండ్ లేనివారు అయితేనే ఇలాంటి చర్యలు కనిపిస్తాయి. ప్రజలు రోడ్డెక్కితేనో, నిరసన పెద్ద ఎత్తున ఉంటేనో, నిందితులు క్రింది వర్గాలు ఐతేనే అనే వివక్షత లేకుండా ఇలాంటి నేరస్థులందరికి ఒకే రకమైన శిక్షలు ఉండాలి. అవి మరణ శిక్షలు అయినా తప్పుకాదు. కానీ ఆ శిక్షలు చట్టబద్ధంగా విధించాలి. తొందరగా విచారణ పేరుతో జాప్యం జరగకుండా, నిందితులు చట్టం లొసుగులతో తప్పించుకునే అవకాశం లేని విధంగా చట్టాలు మార్చాలి

కె.పోలారి,
IFTU, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Leave a Reply