బాబు పర్యటన అడ్డుకున్న పోలీసులు

0
65
  • కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • రోజంతా హైటెన్షన్‌
  • ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులకు అడ్డుకట్ట
  • ప్రచార రథం సీజ్‌.. వాహనాలు తరలింపు
  • రచ్చబండ కోసం వేసిన వేదిక ధ్వంసం
  • టీడీపీ శ్రేణులపై ఉదయం నుంచే జులుం
  • గడ్డూరు, గొల్లపల్లె వద్ద లాఠీచార్జి
  • నేతలు, కార్యకర్తలకు గాయాలు
  • ఆటంకాలపై చంద్రబాబు ఆగ్రహం
  • ఎందుకు అడ్డుకున్నారంటూ నిలదీత
  • లిఖితపూర్వక నోటీసులిచ్చేదాకా అక్కడే
  • ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం యథాతథం
  • ఇంటింటికీ నడిచి వెళ్లిన మాజీ సీఎం
  • మీ జీవోకు చట్టబద్ధత ఎక్కడ?

‘నేను లోకల్‌ ఎమ్మెల్యేని. 35 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నా. 14 ఏళ్లు సీఎంగా పనిచేశాను. రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించకుండా ప్రచారం ఎలా చేయాలి? ఇంటింటికీ వెళ్లమంటే ఓ ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఇళ్లకు ఎలా వెళ్లగలను? ఏ చట్టం కింద నా రోడ్‌షో ఆపుతున్నారు. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించకూడదా? మీరు తీసుకొచ్చిన జీవోకు చట్టబద్ధత ఎక్కడుంది? ఈ నిబంధనలు చట్టంలో ముందు నుంచీ ఉంటే కొత్తగా జీవోను ఎందుకు తెచ్చారు.’

కర్ణాటక సరిహద్దును దాటుకుని శాంతిపురం మండలం 121 పెద్దూరు వద్దకు రాగానే తనను అడ్డుకున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డిని నిలదీసిన చంద్రబాబు

చిత్తూరు : ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబును సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలను కట్టడిచేశారు. వారిపై లాఠీచార్జి కూడా చేశారు. కుప్పంలో ఎక్కడా సభలు జరపకూడదని ఆంక్షలు విధించారు. అసలాయన పర్యటనకే అనుమతి లేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో తననే తిరగనివ్వరా అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్యటన ఆపేది లేదని భీష్మించారు. చివరకు పోలీసు ఆంక్షలతో సభలు రద్దుచేసుకున్నా.. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి.. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బుధవారం నుంచి కుప్పంలో మూడ్రోజులపాటు చంద్రబాబు పర్యటిస్తారని టీడీపీ వారం కిందటే షెడ్యూల్‌ విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు నగరంలో తొక్కిసలాటలు జరిగి 9 మంది టీడీపీ కార్యకర్తలు మరణించడంతో.. రాష్ట్రంలో రోడ్లపై రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదంటూ జగన్‌ ప్రభుత్వం ఈ నెల 2న రాత్రి జీవో విడుదల చేసింది. దానిని ఇంతవరకు ఆన్‌లైన్లో పెట్టలేదు. గెజిట్‌ కూడా విడుదల చేయలేదు. ఈలోపే కుప్పంలో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మంగళవారమే ప్రకటించారు.

అయినా సభలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తదనుగుణంగా బుధవారం ఉదయం నుంచే కుప్పం ప్రాంతంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వస్తున్న చంద్రబాబును తీసుకొచ్చేందుకు ఆయన ప్రచారరథం బయల్దేరగా అక్కడే అడ్డుకున్నారు. దాని డ్రైవరును కూడా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు తొలుత వచ్చే శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆవైపుగా వెళ్లే టీడీపీ శ్రేణులను, ప్రజలను ఎక్కడికక్కడ నిలువరించారు. గడ్డూరు క్రాస్‌, చెంగుబల్ల, గొల్లపల్లె క్రాస్‌ వంటి ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి మరీ టీడీపీ కార్యకర్తలను ఆపేశారు. ధిక్కరించే నాయకుల వాహనాలను క్రేన్‌తో తొలగించేశారు. కేనమాకులపల్లెలో చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన రచ్చబండ వేదికను కూడా తీసివేశారు. చాలాచోట్ల మైకులు, స్పీకర్లను తొలగించారు. చంద్రబాబు పర్యటనకు వెళ్తున్న టీడీపీ నాయకుల వాహనాలను తనిఖీలు చేసి మరీ గుడుపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయినా టీడీపీ శ్రేణులు లెక్కచేయలేదు. ఆంక్షలను, బారికేడ్లను ఛేదించుకుని చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

తోపులాట, లాఠీచార్జి
121 పెద్దూరు వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా గొల్లపల్లె క్రాస్‌ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. తమ నాయకుడి వద్దకు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారంటూ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణరహితంగా చితకబాదారు. శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, మహిళా అధ్యక్షురాలు శ్యామల సహా మరికొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. రాణి అనే మహిళా కార్యకర్త స్పృహతప్పి పడిపోవడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ కార్యకర్తలను రక్తం వచ్చేలా కొట్టారంటూ గడ్డూరులో టీడీపీ శ్రేణులు ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు కింద పడ్డారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు డ్రైవరుపై పోలీసులు అకారణంగా వడ్డివాని కొత్తూరు వద్ద ఓ సీఐ టీడీపీ శ్రేణులను దుర్భాషలాడారు.

Leave a Reply