వలసకూలీలపై విరిగిన లాఠీ

0
322

– ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దులో ఉద్రిక్తత
– ఉపాధి కోసం వెళ్తుంటే దాడులు చేస్తారా?: వలసకార్మికుల ఆవేదన

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కల్పోయిన పేదలు.. తమ స్వస్థలకు వెళ్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కనిండని పేదలు.. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ సడలింపులు ప్రకటించడంతో పలు చోట్లకు తిరిగి ఉపాధికోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వందలాది మంది వలస కార్మికులు ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దుకు చేరుకున్నారు. గురుగ్రామ్‌ సరిహద్దును దాటకుండా హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉపాధిలేక తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయనీ, ఇలాగే కొనసాగితే తమ ప్రాణాలు పోయే ప్రమాదముందనీ.. సరిహద్దు దాటి ఉపాధికోసం వెళ్లడానికి తమకు అనుమతించాలని వలస కార్మికులు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ వారికి అనుమతి నిరాకరించడంతో పలువురు వలస కార్మికులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వివాదం నెలకొని.. ఘర్షణకు దారి తీసింది.

దీంతో అదనంగా పోలీసుల బలగాలు అక్కడికి చేరుకుని వలసకార్మికులపై లాఠీలతో విరుచుకుపడ్డాయి. వలసకార్మికుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. పలువురు ఈ ఘటనను తమ మొబైళ్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
కాగా, ఇప్పటికే హర్యానా సరిహద్దును మూసివేయడంతో అక్కడ వలస కార్మికులు అగిపోయారు. తినడానికి తిండి.. తాగడానికి నీరు లేక పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే సరిహద్దును తెరవాలనీ, అక్కడ ఉన్న వలస కార్మికులకు వెంటనే వైద్యం అందించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు గతవారమే ఆదేశించింది. ఉపాధి కోసం వస్తే తమపై దాడి చేయడం దారుణమనీ, మమ్మల్ని ఆదుకోలేని ప్రభుత్వాలకు తమను కొట్టే హక్కు ఎలా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో ఇలాంటి ఘటనే నోయిడా-ఢిల్లీ సరిహద్దులోనూ చోటుచేసుకుంది.

Courtesy Nava Telangana

Leave a Reply