నేర చరితులకా వీరగంధాలు?

0
219

బాలు

సచ్ఛీల రాజకీయానికి నిలువెత్తు సంతకం- పూజ్య బాపూజీ. అటువంటి గాంధీ పుట్టిన దేశంలో సమకాలీన రాజకీయాలు ఎంతటి దుర్దశకు చేరుకున్నాయి! పార్టీలు నేరచరితులకు పోటాపోటీగా వీరగంధాలు పులుముతున్నాయి. ఏరికోరి మరీ గెలుపు గుర్రాలుగా అక్కున చేర్చుకుంటున్నాయి. నేరగ్రస్త రాజకీయాల విషపరిష్వంగంలో జాతి నిస్సహాయంగా కునారిల్లుతోందిప్పుడు! ఏ న్యాయస్థానమైనా దోషిగా ప్రకటించిన వెంటనే ప్రజాప్రతినిధులకు అనర్హతా దోషం అంటుతుందని 2013 జులైలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎనిమిదేళ్ల తరవాతా ఆ స్ఫూర్తి నిలువునా నీరోడుతూనే ఉంది. ‘అమికస్‌ క్యూరీ’ విజయ్‌ హన్సారియా ఇటీవల సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించిన గణాంక వివరాల ప్రకారం- దేశంలో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలపై మనీలాండరింగ్‌ చట్టం కింద ఆరోపణలున్నాయి. వివిధ సీబీఐ కోర్టుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ జరగాల్సిఉన్న 121 కేసులలో 58- జీవిత ఖైదు విధించదగినవి. 45 కేసులకు సంబంధించి ఆరోపణలే నమోదు చేయలేదు. దేశవ్యాప్తంగా వేర్వేరు కోర్టుల్లో ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై 4800కు పైగా కేసులు పెండింగులో పడి మూలుగుతున్నాయి. నేర రాజకీయాలు ప్రజాస్వామ్య పునాదులనే కదలబారుస్తున్నాయని లోగడ ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తాజా పరిస్థితిపై ఆలోచనాత్మకంగా స్పందించింది. దర్యాప్తు సంస్థల్లో సిబ్బంది ఖాళీలు భర్తీ చేయడంతోపాటు కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాలవారీగా ప్రత్యేక న్యాయస్థానాల్ని అదనంగా నెలకొల్పాలన్నది మేలిమి సూచన. ముఖ్యంగా జడ్జీల కొరతపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. నేర రాజకీయాల చీడపురుగు భారత జనతంత్రాన్ని తొలిచేయకుండా పార్టీలూ కూడిరావాలి. ఇదెప్పటికి సాధ్యపడుతుందన్నదే చిక్కుప్రశ్న.

ధనస్వామ్యం, నేరస్వామ్యం అనే జంటగుర్రాలు కొన్నేళ్లుగా భారత ఎన్నికల రంగమంతటా యథేచ్ఛగా కదం తొక్కుతున్నాయి. ఏడాది, అంతకన్నా ఎక్కువ కాలం జైలుశిక్ష పడినవాళ్ల సభ్యత్వాన్ని బ్రిటన్‌, ఐర్లాండ్‌ శాసనాలు రద్దు చేస్తున్నాయి. నేర నిర్ధారణ జరిగిన, కనీసం సంవత్సరంపాటు శిక్ష విధించదగ్గ నేరానికి పాల్పడిన ప్రజాప్రతినిధుల్ని ఆస్ట్రేలియా వంటివి ఇంటికి సాగనంపుతున్నాయి. అదే ఇక్కడ, న్యాయపాలిక నిర్దేశాల్నీ తుంగలో తొక్కుతూ పార్టీలు నేరనేతాశ్రీల సేవలో తరించిపోతున్నాయి. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా తొలి దశ నామినేషన్ల దాఖలుకు కనీసం రెండు వారాల్లోగా అభ్యర్థుల నేరచరితను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలిచ్చింది. నిరుటి బిహార్‌ ఎన్నికల్లో వాటిని పార్టీలు చిల్లపెంకులుగా జమకట్టేశాయి. అప్పట్లో పది పార్టీలు 469 మంది నేరచరితుల్ని అభ్యర్థులుగా మోహరించాయి. ఈ తరహా బాగోతాలపై విచారణ బాధ్యతను విస్తృత ధర్మాసనానికి నివేదించే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. కడకు నేరచరితుల ఏరివేత ఎప్పటికి సాకారమవుతుందో ఎవరికెరుక? అభ్యర్థుల నేరమయ గతాన్ని వెల్లడించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించాలని, ఆయా వివరాల్ని పార్టీల వెబ్‌సైట్లలో పొందుపరచాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఈ నెలలోనే ఆదేశించింది. హైకోర్టుల అనుమతి లేనిదే ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఎత్తేసే వీల్లేదనీ లక్ష్మణరేఖ గీసింది. నేరం నిర్ధారణ అయితే శిక్ష పడుతుందంటున్నా- విచారణ దశలోనే ఏళ్లూ పూళ్లూ గతించిపోతుంటే క్రిమినల్‌ నేరగణానికి బెదురేముంటుంది, స్వీయ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో ఎదురేముంటుంది?

ఎన్నికల మాజీ ప్రధానాధికారి జీవీజీ కృష్ణమూర్తి గతంలో చెప్పినట్లు- శాసన నిర్మాతలు, నేరాలకు తెగబడేవారు ఒక్కరే కాకూడదు. నేరం, రాజకీయం అద్వైతసిద్ధి పొందినచోట అలా ఆశించడమే ఘోర భంగపాటు కొనితెచ్చిపెడుతోంది. నేరగాళ్ల వల్లే పార్టీకి జవసత్వాలు ఒనగూడుతున్నట్లు లోగడ రామ్‌విలాస్‌ పాసవాన్‌ ప్రభృతులు సెలవిచ్చారు. ఇప్పుడు నేరచరితులే పార్టీలు పెట్టి నడిపించేంతగా పరిస్థితులు విషమించాయి. అందుకే జైలునుంచి నేరుగా పోలీసు వాహనంలో వచ్చి, ధూమ్‌ధామ్‌ సంరంభాల మధ్య నామినేషన్లు సమర్పించి, ఎన్నికల్లో అలవోకగా నెగ్గుకొస్తున్న ఘరానా నేరచరితుల కథలు వింటున్నాం, లీలలు చూస్తున్నాం.

భారత శిక్షాస్మృతితోపాటు ఇతర చట్టాలకింద ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష పడితే, వారిని జీవితకాలం విధులనుంచి బహిష్కరిస్తున్నారు. అదే,  ప్రజాప్రతినిధుల్ని నిర్ణీత కాలమే వెలివేయడం పద్నాలుగో రాజ్యాంగ అధికరణ ప్రకారం సరికాదన్న వాదనలు- సామాన్యుల దృష్టిలో సహేతుకమైనవి. సర్కారు దృష్టిలో మాత్రం పసలేనివి. రాజ్యాంగంలోని 102(1)(సి) అధికరణ- దివాలా తీసినవారికి ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదంటోంది. నైతికంగా దివాలా తీసినవారు, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రబుద్ధులు సైతం నిక్షేపంగా చట్టసభలకు ఎంపికై శాసన నిర్మాతలుగా చక్రం తిప్పుతుండటం నిశ్చేష్టపరుస్తోంది.

నేరగ్రస్త రాజకీయాల బారినుంచి దేశాన్ని బంధవిముక్తం చేయడం ఎలాగన్నదానిపై కొత్తగా సూచనలు, సలహాలను ఎవరూ క్రోడీకరించనక్కరలేదు. న్యాయసంఘం 1999, 2014 సంవత్సరాల్లో వివరణాత్మక నివేదికలు సమర్పించింది. 2002లో రాజ్యాంగ సమీక్షా సంఘం పలు సూచనలు చేసింది. 2004లో తనవంతుగా ఈసీ (ఎలెక్షన్‌ కమిషన్‌) కీలక ఎన్నికల సంస్కరణలు ప్రతిపాదించింది. 2009లో రెండో పరిపాలన సంఘం సిఫార్సులందించింది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు నేరగాళ్లను ఆబగా ఆదరించి చట్టసభలకు నెగ్గించే ధోరణుల్ని కొనసాగించినన్నాళ్లు- ఈ అంతులేని కథలో కొత్త ప్రకరణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర్‌ తిలక్‌ బాణీలో ‘సురాజ్యం మా జన్మహక్కు’ అని యువతరం పిడికిలి బిగించి ముందుకురికితేనే తప్ప- భారత ఘనతంత్రానికి నేర సంకెళ్లు తెగిపడవు. ఏమంటారు?

Courtesy Eenadu

Leave a Reply