వ్యూహకర్తలే ఊపిరి!

0
57
  • అభ్యర్థుల ప్రచారం వెనుక అన్నీతామై నిర్వహణ ప్రచారంలో ఏం మాట్లాడాలో
  • 24 గంటల ముందే ప్రణాళిక
  • 3 పార్టీలు.. 200 మంది వ్యూహకర్తలు
  • ఐఐటీ, ఐఐఎంలో చదివినవారే ఎక్కువ
  • మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి

ఎక్కడైనా ఎన్నికల్లో అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారు. మరి.. తనవైపు ప్రజలు చూసేలా చేసేందుకు ఆ అభ్యర్థి ఎవర్ని నమ్ముకుంటున్నారు? ఎన్నికల్లో తాను గెలిచేందుకు ఊపిరిగా ఆయన భావిస్తోందెవర్ని? అంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎన్నికల వ్యూహకర్తలు అనే! అవును.. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డుతున్న అన్ని పార్టీలదీ ఇప్పుడీ వ్యూహాన్నే నమ్ముకున్నాయి. ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణలో ఆరితేరిన వ్యూహకర్తలను నియమించుకున్నాయి. ప్రచారంలో అభ్యర్థి ఏం మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? ఎక్కడ ఆగాలి? ఎక్కడ తినాలి? ఎవర్ని కలవాలి? ఇలా అన్నీ వ్యూహకర్తలే నిర్ణయిస్తున్నారు. మునుపు అభ్యర్థి తన తరఫున కీలక బాధ్యతలను కుటుంబసభ్యులకు, తనకు అత్యంత విశ్వాసపాత్రులకు అప్పగించేవారు. పార్టీ సీనియర్ల సలహాలను తీసుకునేవారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తల శకం ఆరంభమైంది. రాష్ట్రంలోనూ 2018 అసెంబ్లీ, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి వాతావరణం కనిపించింది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలను రంగంలోకి దించాయి. అభ్యర్థికి ఉన్న బలహీనతలు, లోటుపాట్లను ఎలా అధిగమించాలి? ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు దీటుగా ఎలా సమాధానమివ్వాలి? ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి? ప్రచారంలో వెనుకబడితే తీసుకోవాల్సిన నష్టనివారణ చర్యలు ఏమిటి? ఇలా గతంలో అభ్యర్థే స్వయంగా నిర్ణయించే అంశాలన్నింటినీ ఆయన కోసం వ్యూహకర్తలే నిర్ణయిస్తున్నారు. ఒక రకంగా అభ్యర్థిని అన్నీ తానై వ్యూహకర్తలే ముందుకు నడిపిస్తున్నారు.

ఏ పార్టీ తరఫున ఎవరు?
కాంగ్రె్‌సకు సునీల్‌ కనుగోలు నేతృత్వంలోని మైండ్‌షేర్‌ పొలిటికల్‌ కన్సల్టేన్సీ పూర్తిస్థాయిలో సేవలు అందిస్తోంది. బీజేపీకి అసోసియేటివ్‌ బిలియన్‌ మైండ్స్‌ (నేషన్‌ విత్‌ నమో) సేవలు ఇస్తుండగా టీఆర్‌ఎ్‌సకు ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ సోషల్‌మీడియా ప్రచార సేవలందిస్తోంది. మూడు ప్రధాన పార్టీల తరఫున మూడు సంస్థల్లో ఇక్కడ దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఐఐటీ, ఐఐఎం, ఐఎ్‌సబి, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ (టిస్‌) లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన పట్టభద్రులు ఉండటం గమనార్హం.

ప్రచారానికి 24 గంటల ముందే ప్రణాళిక
నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడేంతవరకు బరిలో ఉన్న అభ్యర్థి తరఫున ప్రతీ పనిని నిర్వహించే బాధ్యతలు వీరివే. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు రచించాల్సిన వ్యూహాలు, ప్రచారం, సోషల్‌ మీడియా నిర్వహణ, వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రధాన ప్రత్యర్థులు లక్ష్యంగా ప్రసంగాలు చేయడం ఇలా అన్ని వ్యూహకర్తల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అభ్యర్థి ప్రచారానికి సంబంధించి రానున్న 24 గంటల ప్రణాళికను ముందు రోజే సిద్ధం చేస్తారు. గడచిన రోజు ప్రచార తీరు, ప్రజల స్పందన, వారిలో ఉన్న అసంతృప్తి, ఆకట్టుకున్న, నిరాశపరచిన అంశాలు, ఇచ్చిన హామీలు.. ఇలా ప్రచారం సాగిన ప్రతీ చోట ప్రజల స్పందనను గమనించి.. మరుసటి రోజు ప్రచార క్రతువుకు రూపకల్పన చేస్తారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలకు దీటుగా సమాధానమివ్వడం, ఒక వర్గం, ప్రాంతంలోని ఓటర్లు పార్టీకి దూరరమయ్యే పరిస్థితులు ఉంటే నష్ట నివారణ చర్యలు చేపట్టడం కూడా వీరి బాధ్యతే. ఆకట్టుకునేలా ప్రసంగించడం, వెళ్లినచోట స్థానిక సమస్యలను ముందుగానే తెలుసుకుని వాటికి సంబంధించిన హామీలు ప్రకటించడం కూడా వీరి నిర్వర్తించే విధుల్లో భాగమే. తమ క్లయింట్లుగా ఉన్న పార్టీలు విజయం సాధిస్తే భవిష్యత్తులోనూ మళ్లీ అవకాశం రావచ్చునని, సంస్థలుగా తమ విజయాలను ఇతర రాష్ట్రాల్లోనూ గొప్పగా చెప్పుకోవచ్చునని తమ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా చెమటోడుస్తున్నారు.

వ్యూహకర్తల చేస్తున్న కీలక పనుల్లో కొన్ని..

  • గత ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ ఓట్లొచ్చిన బూత్‌ల వివరాలను సేకరించి అక్కడ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తారు. గతంలో పార్టీలో ఉండి ఇతర పార్టీలోకి ఫిరాయించిన స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల ఇలాకాల్లో అనుసరించిన వ్యూహాలను రూపొందిస్తారు.
  • ఓటర్లను ప్రభావితం చేయగల ఒక నేత పార్టీకి దూరమైతే ప్రత్యామ్నాయ నేతలు, ఇతర పార్టీల నుంచి ఆకర్షించే విధానాలూ వీరి సేవల్లో భాగమే.
  • ప్రత్యర్థి పార్టీ అత్యంత బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు రాబట్టేందుకు నగదు నజరానాల పంపిణీ గురించి కూడా వ్యూహకర్తల సలహాల్లో భాగం కావడం గమనార్హం.
  • ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా వీరి సేవల్లో అంతర్భాగం. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్‌ సరళి, బూత్‌లవారీగా పార్టీ సాధించిన ఓట్ల వివరాలను వీరు అంచనావేస్తారు.

Courtesy Andhrajyothi

Leave a Reply