కన్న కూతురును కడతేర్చిన తండ్రి

0
171
  • – పోషణ భారమే కారణం
  •  – మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో ఘటన 

బాలానగర్‌ కుటుంబాన్ని పోషించలేక కన్న కూతుర్నే కడతేర్చాడు ఓ తండ్రి. ఈదారుణ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలా నగర్‌ మండలం సురారం గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ వెంకటేశులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని హన్వాడ మండల కేంద్రానికి చెందిన రాజు కొంత కాలంగా బతుకు దెరువు కోసం సురారం గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. నాలుగేండ్ల కిందట భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా చిన్న కూతురైన స్నేహ(6)ను భార్యపై కోపంతో విసిరేశాడు. ఆ సమయంలో స్నేహకు బాగా దెబ్బలు తగలడంతో నడవలేని స్థితికి చేరుకుంది. దాంతో భార్య బాలిక ఆలనా పాలనా చూస్తూ వచ్చింది. నెల కిందట అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దాంతో పిల్లల పోషణ భారం తండ్రిపై పడింది. ఈ క్రమంలో స్నేహ ఆలనా పాలనా చూడలేక తండ్రి అత్యంత కర్కశంగా వ్యవహరించి ఎవరూ లేని సమయంలో కుమార్తెను గ్రామ సమీపంలోని వాగులో పడేశాడు.

అయితే ఇంటికొచ్చిన తండ్రితో మరో ఇద్దరు కుమార్తెలు చెల్లెలు ఎక్కడా అని నిలదీశారు. ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో పిల్లలు గ్రామ సర్పంచ్‌ను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో నిందితుడ్ని విచారించి నిజాన్ని రాబట్టారు. తానే తన కుమార్తెను వాగులో పడేసి హతమార్చినట్టు ఒప్పుకున్నారు. వెంటనే పోలీసులు నిందితుడితో కలిసి వాగు వద్దకు వెళ్లి అందులో బాలిక మృతదేహాన్ని వెలికితీయించారు. మృతి చెందిన చెల్లెలిని చూసి ఇద్దరక్కలు కన్నీటి పర్యాంతమయ్యారు. మా అమ్మ ఉంటే చెల్లికి ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ వారు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Courtesy Nava Telangana

Leave a Reply