మోసపూరిత గణాంకాలు

0
650

ఈ మధ్య ప్రపంచ బ్యాంకు అధికార గణం, ఇంకా చాలామంది ఆర్థిక వేత్తలు, వివిధ దేశాల ప్రభుత్వాలు తమను తామే అభినందించుకుంటున్నారు. 1990 దశకం నుండి ఇటీవల కోవిడ్‌-19 మహమ్మారి వచ్చిపడే ముందు వరకూ గడిచిన కాలంలో పేదరికం బాగా తగ్గిపోయిందట. ఎవరు పేదలో నిర్ధారించడానికి ప్రపంచ బ్యాంకు ఒక అంతర్జాతీయ దారిద్య్ర రేఖను నిర్ణయించింది. 2011 నాటికి 1.90 అమెరికన్‌ డాలర్లతో అమెరికాలో ఎన్ని సరుకులు కొనవచ్చునో తేల్చి, అంత మేరకు ఒక వ్యక్తి కొనగలిగితే అతడు లేక ఆమె పేదరికంలో లేనట్టేనని నిర్ధారించింది. అవే వస్తువులను ఏ ఇతర దేశంలోనైనా అక్కడ కరెన్సీతో కొనడానికి ఎంత సొమ్ము అవసరమో లెక్కించి ఆమేరకు ఒక వ్యక్తికి రోజుకు ఆదాయం వచ్చినట్టైతే ఆ వ్యక్తి పేదరికంలో లేనట్టే అని తేల్చి చెప్పారు. (కరెన్సీ మారకపు విలువను బట్టి గాక ఆ కరెన్సీతో కొనుగోలు చేయగలిగే సరుకులు బట్టి లెక్క వేయడం – దీనినే పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ లేదా పిపిపి అంటారు.) రోజుకు ఒక వ్యక్తి గనుక 1.90 అమెరికన్‌ డాలర్లు సంపాదించగలిగితే (2011 నాటి లెక్క) ఆ వ్యక్తి పేదరికంలో లేనట్టే. 1.90 అమెరికన్‌ డాలర్లతో 2011లో ఎన్ని సరుకులు పొందవచ్చో అన్ని సరుకులను ఒక రోజులో పొందలేనట్టైతే అటువంటివారు పేదరికంలో ఉన్నట్టు లెక్క.

ఈ దారిద్య్ర రేఖ ఎంత అన్యాయంగా నిర్ణయించారో చూడండి. 2011లో 1.90 డాలర్లతో అమెరికాలో ఒక కప్పు కాఫీ మాత్రమే వస్తుంది. అప్పటి రేట్ల ప్రకారం పిపిపి లెక్కిస్తే 1.90 డాలర్లతో కొనగలిగే సరుకులను ఇండియాలో 29 రూపాయలకు కొనవచ్చు. 2011లో రు.29 తో రెండు మంచినీటి బాటిళ్ళు మాత్రమే వస్తాయి. అంత తక్కువ ఆదాయంతో ఒక వ్యక్తి ఎలా జీవించగలడు? అది అసంభవం. కాని ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం సంభవమే. ఈ దారిద్య్రరేఖ ప్రకారం లెక్కించి 1990 నాటికి ప్రపంచ జనాభాలో 36 శాతం, అంటే 189 కోట్ల 50 లక్షలమంది ప్రజలు దరిద్రంలో ఉన్నారని, 2015 నాటికి వారి సంఖ్య 73 కోట్ల 60 లక్షలకు, అంటే జనాభాలో కేవలం 10 శాతానికి తగ్గిపోయిందని, 115 కోట్లమందికి పైగా ప్రజలను పేదరికంలోనుంచి బైటకు తీసుకురాగలిగామని ప్రపంచ బ్యాంకు చెప్పుకుంటోంది.

తక్కిన వివరాలలోకి పోయేముందు ఈ పేదరికం ఎక్కడ, ఎంత తగ్గిందో కాస్త చూద్దాం. ప్రపంచ బ్యాంకు కొలబద్ద ప్రకారమే చూసినా, ఈ తరుగుదల ప్రధానంగా చైనాలో కనపడుతుంది. 1990లో చైనాలో 75 కోట్లమంది పేదరికంలో ఉంటే 2015 నాటికి ఆ సంఖ్య ఒక కోటికి తగ్గిపోయింది. అంటే మొత్తం ప్రపంచంలో పేదరికం నుంచి బైటపడిన వారిలో 64 శాతం ఒక్క చైనాలోనే ఉన్నారన్నమాట. ఇదే కాలంలో మధ్యప్రాచ్యంలో, ఆఫ్రికాలో అదనంగా పేదరికంలోకి జారిపోయినవారు 14 కోట్లమంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారమే చూసినా పేదరికం నుండి బైటపడడం అనేది చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగింది ఒక్క చైనాలోనే. అందుచేత ఈ ఘనతను ప్రపంచబ్యాంకు తనకు, తను అమలు చేయిస్తున్న విధానాలకు ఆపాదించి గొప్పలు పోవడంలో అర్ధం ఏమీ లేదు.

ఈ అంతర్జాతీయ దారిద్య్ర రేఖను కాస్త పైకి, అంటే, రోజుకు 2.5 డాలర్ల వద్దకు జరిపి చూస్తే 1990 నుండి 2010 మధ్య దారిద్య్రం ఏమీ తగ్గలేదని కనపడుతుంది. దీనికి మళ్ళీ చైనా మాత్రం మినహాయింపు. అదే ఇంకాస్త పైకి, అంటే రోజుకు 5.5 డాలర్ల వద్దకు జరిపి లెక్క కడితే 1990 నుండి 2015 మధ్య దరిద్రంలో ఉన్న వారి సంఖ్య 200 కోట్ల నుండి 260 కోట్లకు పెరిగింది. ఇక్కడ కూడా చైనాను, తూర్పు ఆసియా దేశాలను మినహాయించి చూడాలి. అంటే, దారిద్య్రం నుండి బైటపడడం అనే ధోరణి చైనాకు, కొన్ని తూర్పు ఆసియా దేశాలకు మాత్రమే ఈ కాలంలో పరిమితం అయిందన్నమాట.
ప్రపంచబ్యాంకు నిర్ణయించిన ఈ అంతర్జాతీయ దారిద్య్రరేఖ మరీ హీనంగా ఉంది. అంత తక్కువ రోజువారీ ఆదాయంతో బతకడం ఎవరికైనా సాధ్యం కాని స్థితి ఉంది. ఈ వాస్తవాన్ని చాలాకాలం నుండీ వామపక్షాలు చెప్తూనే వున్నాయి. అయితే ఇటీవల ఇదే విషయాన్ని ఐరాస మానవ హక్కుల సలహా మండలి తన నివేదికలో చాలా స్పష్టంగా నొక్కి చెప్పింది.

ప్రపంచబ్యాంకు ఈ విధంగా అతి తక్కువ స్థాయిలో దారిద్య్రరేఖను నిర్ణయించడం వెనక ప్రాతిపదిక ఏమిటి? ఏ కనీస అవసరాలను లెక్కలోకి తీసుకున్నారు? ఎంత స్థాయిలో పోషక విలువలున్న ఆహారం కనీసం రోజూ ఉండాలని నిర్ధారించారు? అసలు ప్రపంచబ్యాంకు ఇటువంటి అంశాలను వేటినీ ప్రాతిపదికగా తీసుకోనేలేదు. ప్రపంచంలోని అతి పేద దేశాలను పదిహేనింటిని ఎంచి (వాటిలో అత్యధిక దేశాలు ఆఫ్రికా ఖండంలోని సబ్‌ సహారా ప్రాంతానికి చెందినవి) ఆ దేశాలలోని జాతీయ పేదరిక స్థాయిని తీసుకుని వాటి సగటును లెక్కించింది. ఆ సగటును అమెరికన్‌ డాలర్లలోకి మార్చింది. అది కూడా మారకపు రేటు కాదు సుమా, పిపిపి రేటు మాత్రమే. అలా 2011నాటికి 1.90 డాలర్లు దారిద్య్ర రేఖగా లెక్క తేల్చింది. ఈ దేశాలలో జాతీయ పేదరిక స్థాయిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్నది ఇదమిత్థంగా తెలియదు. కాని చాలా ప్రభుత్వాలు తమ హయాంలో పేదరిక నిర్మూలన బ్రహ్మాండంగా సాగిందని గొప్పలు చెప్పుకోడానికి వీలుగా వాస్తవ పేదరికాన్ని బాగా తగ్గించి చూపుతారన్నది జగమెరిగిన సత్యం.

దేశ దేశానికీ ఉండే వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం కొన్ని దేశాల పేదరిక స్థాయిలనే లెక్కలోకి తీసుకోవడంలో అర్ధం లేదు. నిజానికి చాలా దేశాలలో నిర్ణయించుకున్న జాతీయ పేదరిక రేఖలు ప్రపంచబ్యాంకు నిర్ణయించిన దానికన్నా బాగా పై స్థాయిలోనే ఉన్నాయి. మొత్తం మీద ఏ విధంగా చూసినా, ప్రపంచంలో వాస్తవ పేదరికం ప్రపంచ బ్యాంకు నిర్ధారించిన లెక్కల కన్నా బాగా హెచ్చు మోతాదులో ఉందని స్పష్టమవుతోంది.

మన దేశంలో జాతీయ శాంపిల్‌ సర్వే విధానం అమలులో ఉంది. ప్రతి ఐదేళ్ళకొకసారి విస్తృతంగాను, మధ్యలో ప్రతి ఏడూ పరిమితంగాను శాంపిల్‌ సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వేలో వచ్చే సమాధానాలు అన్నీ వాస్తవ పరిస్థితిని చూపవు. అయినప్పటికీ, ఇటువంటి సర్వే కూడా చేయని దేశాలు చాలానే ఉన్నాయి. అందువలన ఆయా దేశాలలో దారిద్య్ర రేఖల నిర్ధారణ చాలా లోపభూయిష్టంగా ఉందని గమనించవచ్చు. చాలా దేశాలలో ధరల సూచికలు వాస్తవంగా పెరుగుతున్న జీవన వ్యయాన్ని వ్యక్తం చేయవు. మన దేశమే ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడ కొన్ని సరుకుల జాబితాను నిత్యావసరాలుగా గుర్తించి వాటి ధరలలో వచ్చే ఎగుడుదిగుడులను నమోదు చేస్తారు. ఈ నిత్యావసరాల జాబితా నుండి కొన్ని పాతవి తగ్గించి కొత్తవి కలుపుతూ వుంటారు.

మన దేశంలో సరళీకరణ విధానాల అమలు ఫలితంగా విద్య, వైద్యం ఎక్కువగా ప్రైవేటు రంగంలోకి వచ్చాయి. ప్రైవేటు ఆస్పత్రులు ఎప్పటికప్పుడు ఫీజులు విపరీతంగా పెంచుతూనే వుంటాయి. కాని ప్రభుత్వ వైద్య శాలల్లో వైద్యసేవల రేట్లు పెద్దగా పెరిగిందేమీలేదు. అందువలన వాస్తవంగా వైద్యానికి పెట్టే ఖర్చు పెరుగుతున్నా ధరల సూచికలో ఆ పెరుగుదల కనిపించదు. ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు నానాటికీ అందుబాటులో లేకుండా పోవడం, అనివార్యంగా ప్రజలు ప్రైవేటు వైద్యసేవలపై ఆధారపడవలసి రావడం మనకు కనపడే వాస్తవం. కాని ధరల సూచికలో మాత్రం ఈ పెరిగే వైద్యసేవల ఖర్చు వ్యక్తం కాదు. పర్యవసానంగా దారిద్య్రరేఖ గణనలో వాస్తవ పేదరికం కనపడదు. దరిద్రం తగ్గిపోతోందనే లెక్కలు సరైనవి కావని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మొదట్లో మన దేశంలో పేదరికానికి కొలబద్దగా తీసుకున్న అంశాన్ని చూద్దాం. రోజుకు 2700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందగలిగితే ఒక వ్యక్తి పేదరిక స్థాయికంటే ఎగువన ఉన్నట్టు లెక్క. ఈ ప్రమాణాన్ని కుదించి ఒక గ్రామీణ వ్యక్తి రోజుకు 2200 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందగలిగితే ఆ వ్యక్తి పేదరికంలో లేనట్టు భావించాలని, అదే విధంగా ఒక పట్టణ ప్రాంత వ్యక్తి రోజుకు 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందగలిగి వుండాలని తిరిగి నిర్వచించారు. ఇలా చేసినందు వలన వాస్తవ పేదరికం తగ్గకపోయినా లెక్కల్లో మాత్రం బాగా తగ్గిపోయినట్టు కనపడుతుంది. ఇదేదో మన దేశానికే ప్రత్యేకమైన ధోరణి కాదు. నయా ఉదారవాద విధానాలు చేపట్టి నిత్యావసర సేవలను ప్రైవేటీకరించిన అన్ని దేశాలలోనూ ఇదే పరిస్థితి.

2011 ఏప్రిల్‌ నుండి 2019 డిసెంబరు మధ్య ప్రపంచం మొత్తం మీద చూసుకున్నప్పుడు వస్తువుల ధరలు, ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ధరలు 38 శాతం పడిపోయాయి. ధరలు తగ్గాయి గనుక పేదరికం తగ్గినట్టేనని ప్రపంచబ్యాంకు చెప్పుకుంటోంది. వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గిపోవడమంటే మూడో ప్రపంచ దేశాల ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం అని మనం గుర్తించాలి. ఆదాయాలు తగ్గాక ఇక వారు ఏ విధంగా ఎక్కువ కొనుగోలు చేయగలుగుతారు? ధరలు తగ్గినా, వినిమయం పెరగకపోవడం బట్టి ఈ సంగతి మనకు అర్ధం ఔతుంది. వారి ఆదాయాలు తగ్గినా అప్పులు చేసి కొనుగోలు చేస్తారని, ఆ విధంగా పేదరికం లోనుంచి బైటపడతారని ఎవరైనా భావిస్తే అంతకన్నా అవకతవక వాదన ఇంకొకటి ఉండదు.

ఇటీవల నిరుద్యోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. తీవ్రమౌతున్న పెట్టుబడిదారీ సంక్షోభానికి ఇది సంకేతం. మరీ ముఖ్యంగా మన దేశంలో కోవిడ్‌-19 సంభవించకముందే నిరుద్యోగం గత 45 సంవత్సరాలోకెల్లా అత్యధిక స్థాయిని చేరింది. నిరుద్యోగం పెరుగుతున్నకొద్దీ వినిమయ స్థాయి పడిపోతుంది, లేదా రుణభారం పెరిగిపోతుంది. మన దేశంలో సామాన్య ప్రజల వినిమయ స్థాయి తీవ్రంగా పడిపోతున్న వాస్తవాన్ని 2017-18లో జరిపిన శాంపిల్‌ సర్వే బయటపెట్టింది. 2011-12తో పోల్చితే 2017-18లో గ్రామీణ తలసరి వినిమయం ఏకంగా 9 శాతం తగ్గిపోయింది. ఈ వాస్తవాలు బయటకి రాకూడదనే మోడీ ప్రభుత్వం ఆ సర్వే వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టింది. వాస్తవాలిలా ఉంటే ప్రపంచంలో పేదరికం తగ్గిపోతోందని చెప్పుకోవడం (చైనా, తూర్పు ఆసియా దేశాలను మినహాయించి) అర్ధరహితం.

ప్రభాత్‌ పట్నాయక్‌ (స్వేచ్ఛానుసరణ)

Leave a Reply