మాలేగావ్‌ పేలుడు కేసు.. ఆ స్కూటర్‌ ప్రజ్ఞాసింగ్‌దే

0
81

ఫోరెన్సిక్‌ నిపుణుడి వెల్లడి

ముంబై : మాలేగావ్‌ పేలుడు కేసులో.. సంఘటన జరిగిన ప్రదేశంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లతో లభించిన ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌దేనని ఫోరెన్సిక్‌ నిపుణుడు స్పష్టం చేశారు. 2008 సెప్టెంబరు 29 నాటి ఈ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 100 మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో  261వ సాక్షిగా ఉన్న ఓ ఫోరెన్సిక్‌ నిపుణుడు.. ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో బుధవారం ఈ మేరకు వాంగ్మూలమిచ్చారు. ‘‘పేలుడు జరిగిన ప్రదేశంలో ఓ ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ శకలాలను సీజ్‌ చేశాం. ఆ వాహనం ప్రజ్ఞాసింగ్‌ పేరిటే రిజిస్టర్‌ అయ్యి ఉంది’’ అని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఆయన సహాయ రసాయన విశ్లేషకుడిగా పనిచేశారు. ‘‘మాలేగావ్‌ పేలుడుకు ఉపయోగించిన బాంబులను అమ్మోనియం నైట్రేట్‌తో తయారు చేశారు. నేను పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు.. తీవ్రంగా ధ్వంసమైన ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ శకలాలను గుర్తించాను. ఆ శకలాలను సేకరించి, రసాయన పరీక్షలు నిర్వహించగా.. స్కూటర్‌పైనే పేలుడు పదార్థాల ఆనవాళ్లు దొరికాయి. ఈ పేలుడు జరపడానికి ముందు.. ఆ స్కూటర్‌ ఇంజన్‌ నంబర్‌ను చెరిపేశారు. ఆ తర్వాత ఫోరెన్సిక్‌ విశ్లేషణలో వాటిని గుర్తించాం’’ అని ఆయన కోర్టుకు వివరించారు.

Leave a Reply