పునరావాస కేంద్రంలో మహిళల తిరుగుబాటు!

0
38
  • నేరస్థులు బయట తిరుగుతుంటే తమను బంధిస్తారా? అంటూ గుస్సా 
  • సెక్యూరిటీ సిబ్బందిపై 35 మంది దాడి.. పారిపోయేందుకు యత్నం
  • ఆమనగల్లు  ప్రజ్వల పునరావాస కేంద్రంలో ఘటన

ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలోని ప్రజ్వల పునరావాస కేంద్రంలో మహిళల్లో 35 మంది శుక్రవారం నిర్వాహకులపై తిరగబడ్డారు. నేరస్థులు బయట తిరుగుతుంటే బాధితులమైన తమను బంధించి, స్వేచ్ఛను హరిస్తే ఎలా? అంటూ మండిపడ్డారు. కొన్నేళ్లుగా పునరావాస కేంద్రంలో మగ్గుతున్న తమను విడుదల చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భద్రతా సిబ్బందిపై దాడిచేసి కేంద్రం నుంచి పారిపోయేందుకు యత్నించారు. రోడ్డు మీదకొచ్చి అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం .ఈ పునరావాస కేంద్రంలో బంగ్లాదేశ్‌, నేపాల్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది మహిళలు వివిధ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు పునరావాసం పొందుతున్నారు.

అయితే కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నా విడుదల చేయడం లేదని, కుటుంబ సభ్యులను కూడా కలవనీయడం లేదని, తమతో శ్రమదోపిడీ చేయిస్తున్నారని, కేంద్రంలో సరైన వసతులు లేవని కొందరూ ఆరోపిస్తూ వస్తున్నారు. గురువారమే మహిళల్లో కొందరు నిరసనకు దిగి కేంద్రం నుంచి  తప్పించుకునే ప్రయత్నం చేయగా  సాఽధ్యం కాలేదు.  శుక్రవారం ఉదయం 8 గంటలకు 35 మంది ఒక్కసారిగా ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని అక్కడున్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గేటు తెరుచుకొని బయటకొచ్చారు. రోడ్డు వెంట రెండు కిలోమీటర్ల మేర నడిచారు. ఆమనగల్లు ఎస్సై ధర్మేశ్‌, తమ సిబ్బందితో వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఎస్సై ధర్మేశ్‌, కొంతమంది సి బ్బందిపై బాధిత మహిళలు రాళ్లు, గాజు పెంకలతో దాడిచేసే ప్రయత్నం చేశారు. సమీపంలోని తండాల యువకులు, మహిళలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని మహిళలను నిలువరించేందుకు యత్నించగా వారినీ ఎదిరిస్తూ  సమీపంలోని జంగారెడ్డిపల్లికి చేరుకున్నారు.

ఆమనగల్లు-మాడ్గుల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిర్బంధం నుంచి విముక్తి కలిగించి తమ ప్రాంతాలకు పంపించాలంటూ కొంతమంది రోదించారు. కేంద్రంలో ఏళ్లకాలంగా తాము దుర్భర జీవితం అనుభవిస్తున్నామని, జైల్లో ఉన్న ఖైదీలకు ములాఖత్‌ ద్వారా తమ కుటుంబసభ్యులను కలుసుకోవడానికి అవకాశం ఉందని, తమకు ఆ అవకాశం, స్వేచ్ఛ లేదని మీడియాతో వాపోయారు. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న బాధిత మహిళలను స్థానికుల సహకారంతో పోలీసులు వ్యాన్లలో ఎక్కించి తిరిగి పునరావాస కేంద్రానికి తరలించారు.

ఒక్కరు కూడా తప్పించుకోలేదు
ప్రజ్వల పునరావాస కేంద్రం నుంచి ఒక్కరు కూడా తప్పించుకోలేదు. కోర్టు ఆదేశాలను అనుసరించి వివిధ ప్రాంతాలకు చెందిన 82 మంది కేంద్రంలో పునరావాసం పొందుతున్నారు. బయటకు పంపడం లేదన్న అసహనంతో కొంతమంది మహిళలు మిగతా వారిని రెచ్చగొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. అందరినీ  కేంద్రంలోకి తిరిగి తీసుకువచ్చాం. బాధితులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వారు చేసే పనిని బట్టి నెలనెలా వేతనం వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బు జమ చేస్తున్నాం,  కేంద్రంలో అన్ని రకాల వసతులు, వైద్య సదుపాయాలు ఉన్నాయి.
– ప్రజ్వల పునరావాస కేంద్రం ఇన్‌చార్జి సుజాత  

Leave a Reply