న్యూఢిల్లీ : జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్సిటీ విద్యార్థి సఫూరా జర్గర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం జర్గర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఢిల్లీ పోలీసులు ఒక్క రోజు గడువు కోరడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి విజృంభణ, రద్దీగా ఉండే జైళ్లలో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదనీ, తీహార్ జైలులో తన ఆరోగ్యం, భద్రతపై జర్గర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ఆమెకు బెయిల్ మంజూరు చేయడంపై తమకెలాంటి అభ్యంతరమూ లేదని ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. ఆమె ఢిల్లీలోనే ఉండాలంటూ న్యాయస్థానానికి చెప్పారు. కాగా, జర్గర్ తరఫున న్యాయవాది నిత్య రామకృష్ణన్ వాదించారు. కొన్ని షరతులతో రూ.10వేల బాండ్‌పై జర్గర్‌కు న్యాయమూర్తి రాజీవ్ షాఖ్దర్ బెయిల్‌ను మంజూరు చేశారు.
కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగేలా చేయకూడదనీ, ఢిల్లీ విడిచి వెళ్తే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు అధికారితో ఫోన్‌లో టచ్‌లో ఉండాలని న్యాయస్థానం తెలిపింది. కాగా, జర్గర్‌కు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టుకు నిత్య రామకృష్ణన్ ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య ఢిల్లీ అలర్ల కేసులో జర్గర్‌ను ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 10న అరెస్టు చేసిన విషయం విదితమే. ఆమె ప్రస్తుతం 23 వారాల గర్భిణి.
Courtesy Nava Telangana