- రాష్ట్రపతి ఎన్నికల బరిలో కేంద్ర మాజీ మంత్రి
- కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ ఎంపిక
- తెరాస, ఆప్ సానుకూలమన్న పవార్
- వైకాపా, బిజదల మద్దతూ కూడగడతామని వెల్లడి
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో దిగనున్నారు. ఈ నెల 27న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో దిల్లీలోని పార్లమెంటు అనుబంధ భవనంలో మంగళవారం జరిగిన సమావేశంలో విపక్షాలు సిన్హా అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశాయి. దీంతో ఇన్నాళ్లూ తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తద్వారా పార్టీల వాసన లేకుండా పోటీకి సిద్ధమయ్యారు. మోదీ విధానాలతో తీవ్రంగా విభేదించి భాజపా నుంచి బయటికొచ్చిన సిన్హాకు రాజ్యాంగం, లౌకిక భావనలపై అపార విశ్వాసం ఉందని.. అందుకే ఆయన్ను తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశామని ప్రతిపక్ష నేతలు ప్రకటించారు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల రేసు నుంచి శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ తప్పుకోవడంతో సీనియర్ నేత అయిన యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్షాలు సోమవారమే దాదాపుగా ఖరారు చేశాయి. ఆయన తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు షరతు విధించాయి. దీంతో తాను తృణమూల్‌ను వీడుతున్నట్లు మంగళవారం ఉదయం సిన్హా ట్విటర్ ద్వారా ప్రకటించారు. అనంతరం పవార్ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశమవడం, సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఆయన ఎంపిక విషయంపై తాను కేజ్రీవాల్(ఆప్), కేసీఆర్(తెరాస), మమతా బెనర్జీ(తృణమూల్), అఖిలేశ్(ఎస్పీ), సంజయ్‌రౌత్(శివసేన), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ)లతో మాట్లాడానని.. వారంతా సానుకూలంగా స్పందించారని పవార్ చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి(వైకాపా), నవీన్‌పట్నాయక్(బిజద)లతోనూ మాట్లాడి సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎంఐఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కారణంగా శివసేన హాజరుకాలేదు.
రాజ్యాంగాన్ని సంరక్షించగలరు
యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘‘దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోబోయే తరుణంలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో.. భారత ప్రజాస్వామ్యం, సామాజిక తత్వానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని అడ్డుకొనే, రాజ్యాంగాన్ని సంరక్షించే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. అందులో భాగంగా యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశాం. ఆయన సమర్థ పాలకుడు. సంపూర్ణ పార్లమెంటేరియన్. అత్యంత అవగాహనవంతుడు. సుదీర్ఘ ప్రజాజీవితంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ వ్యవహారాల మంత్రిగానే కాకుండా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేశారు. దేశ అత్యున్నత పదవికి ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి ఏకాభిప్రాయంతో అభ్యర్థిని నిలిపితే ఆదర్శంగా ఉంటుంది. అందుకు అవసరమైనంత స్థాయిలో మోదీ సర్కారు చొరవ తీసుకోలేదని చెప్పడానికి చింతిస్తున్నాం. కాబట్టి సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని అన్ని రాజకీయ పార్టీలకూ పిలుపునిస్తున్నాం’’ అని ప్రకటించాయి.
ఆయనకు మించిన అనుభవజ్ఞులు కనిపించలేదు: అభిషేక్ బెనర్జీ
ప్రతిపక్షాల నుంచి యశ్వంత్ సిన్హాను మించిన రాజకీయ అనుభవజ్ఞులు కనిపించలేదని, అందుకే ఆయన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఏకగీవ్రంగా ఎంచుకున్నామని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. సిన్హాకు భాజపా మూలాలున్నప్పటికీ, ఆ పార్టీ విధానాలను విభేదించి బయటికొచ్చారని గుర్తుచేశారు. ప్రతిపక్షాల సమావేశంలో ఇదివరకు శరద్ పవార్ పేరు మాత్రమే ప్రతిపాదన వరకు వచ్చిందని, ఆయన వ్యక్తిగత కారణాలతో పోటీకి విముఖత చూపారని చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్లు చర్చలకే పరిమితయ్యాయని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సిన్హా దేశవ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల పార్టీలు మద్దతివ్వాలి: ఏచూరి
సిన్హా అభ్యర్థిత్వానికి తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ మద్దతివ్వాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ‘‘మూడేళ్లుగా సిన్హా భాజపా, మోదీ వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, రఫేల్ కుంభకోణం, జీఎస్‌టీ విషయంలో ప్రతిపక్షాలు నిర్వహించిన ఉద్యమాలకు మద్దతు పలికారు. సిన్హాకు ఓటేయాలని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలను కోరుతున్నా. ఈ నెల 15 నాటి సమావేశానికి రెండు రోజుల ముందు కేసీఆర్ ఫోన్ చేయడంతో మాట్లాడాను. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించాం. తొలి సమావేశం తర్వాత మళ్లీ మాట్లాడలేదు. పవార్ మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు. జగన్‌తో నేనుగానీ, పవార్‌గానీ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతాం’’ అని ఏచూరి పేర్కొన్నారు.
కేసీఆర్‌కు శరద్ పవార్ ఫోన్
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున బరిలో దిగుతున్న యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సిన్హా పేరును ఖరారు చేసిన అనంతరం ఆయన కేసీఆర్‌కు ఫోన్ చేశారు. సిన్హా ఎంపిక గురించి తెలియజేశారు. 22 పార్టీలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చాయని చెప్పారు. తెరాస మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు.
Courtesy Eenadu