ద్రౌపదికి అవమానం!

0
185
 • అధీర్‌ ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యపై దుమారం
 • అట్టుడికిన పార్లమెంట్‌.. సోనియా వర్సెస్‌ స్మృతి
 • దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పండి: స్మృతి ఇరానీ
 • మీతో మాట్లాడడం లేదు.. డోంట్‌ టాక్‌ టు మీ: సోనియా 
 • రాజ్యసభలో కాంగ్రెస్‌పై మండిపడ్డ పీయూష్‌ గోయల్‌
 • ఉభయ సభల్లో పలుమార్లు వాయిదాల పర్వం
 • సోనియా క్షమాపణ చెప్పకుంటే.. సభాహక్కుల తీర్మానం
 • తేల్చిచెప్పిన బీజేపీ ఎంపీలు.. పార్లమెంట్‌లో నిరసన
 • ముర్ము బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతా: అధీర్‌
 • కాంగ్రెస్‌ ‘కులహంకార ధోరణి’ని మార్చుకోవాలి: మాయ
 • తెలంగాణలోనూ ఆందోళనలు.. దిష్టిబొమ్మల దహనాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి చేసిన ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్య గురువారం దుమారం రేపింది. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ అధికార పక్షం బీజేపీ మండిపడింది. పార్లమెంట్‌లోనూ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. అధీర్‌ రంజన్‌ చౌదరి బేషరతుగా రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు.. ప్రత్యేకించి మహిళా ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఓ దశలో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ వర్సెస్‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నట్లుగా వాడివేడి వాగ్బాణాలతో పరస్పరం నిప్పులు కురిపించుకున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, మరికొందరు మహిళా ఎంపీలు కూడా అధీర్‌ తీరును పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టారు. ఓ ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరించడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాల్సిం దేనని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఉభయసభల్లో పలుమార్లు వాయిదాలపర్వం కొనసాగింది.

వివాదం మొదలైందిలా..
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ బుధవారం ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద కాం గ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు అధీర్‌ రంజన్‌ చౌదరి బదులిస్తూ.. ‘‘మేము భారత రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నాం.. కాదుకాదు.. రాష్ట్రపత్ని.. అందరికీ’’ అన్నారు. తర్వాత తాను చేసింది తీవ్ర వ్యాఖ్య అని గుర్తించి దాన్ని ప్రసారం చేయొద్దని విలేకరులను కోరారు. ఈ వ్యాఖ్య కాస్తా వైరల్‌ అవ్వడంతో ఉద్దేశపూర్వకంగా అనలేదని, నోరుజారి రాష్ట్రపత్ని అన్నానని వివరణ ఇచ్చారు.

పార్లమెంట్‌ సాక్షిగా వాగ్యుద్ధం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అధీర్‌ రంజన్‌చౌదరి వాడిన పదజాలం పార్లమెంట్‌ ఉభయ సభల్లో వాగ్యుద్ధానికి దారి తీసింది. దీంతో గురువారం కూడా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ వాయిదా పడగానే బీజేపీ మహిళా ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. సోనియాకు, అధీర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియాగాంధీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సోనియా క్షమాపణ చెప్పకుంటే ఆమెపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు. దేశంలో అతున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని అవమానించేందుకు సోనియా అనుమతినిచ్చారని, ఒక పేద మహిళను అవమానించేందుకు ఆమె ప్రేరేపించారని, ప్రతి భారతీయ పౌరుడిని అవమానించేందుకు వీలు కల్పించారని స్మృతిఇరానీ వేలెత్తి చూపించి మాట్లాడడం సోనియాకు ఆగ్రహం తెప్పించింది.

దీనికి సోనియా స్పందిస్తూ అధీర్‌ ఇప్పటికే క్షమాపణ చెప్పారని, ఈ వివాదంలోకి తనను లాగొద్దని అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ రమాదేవికి చెప్పేందుకు సోనియా అధికార పక్షం వైపు వెళ్లగా.. గందరగోళం చెలరేగింది. రమాదేవితో సోనియా మాట్లాడుతుండగాస్మృతి ‘‘నేను మీకు సహాయపడగలనా?’’ అన్నారు. ‘‘నాతో మాట్లాడకండి(డోంట్‌ టాక్‌ టు మీ)’’ అని సోనియా ఆగ్రహం చెందారు. సోనియా తిరిగి వెళ్తున్నప్పుడు బీజేపీ ఎంపీలు సోనియాను చుట్టుముట్టడంతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, మరికొందరు ఆమె వద్దకెళ్లారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యసభలోనూ దీనిపై వాడివేడిగా చర్చ జరిగింది. రాష్ట్రపతి కార్యాలయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కులం-మతం కోణంతో చూస్తోందని రాజ్యసభలో బీజేపీ పక్ష నేత, కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ విమర్శించారు. ‘‘రాష్ట్రపత్ని అంటూ ఒకసారి అవమానించిన అధీర్‌ రాష్ట్రపతి స్థానంలో బ్రాహ్మిణ్‌ అయినా.. ఆదివాసీ అయినా ఉండొచ్చని వ్యంగ్యంగా అంటూ మరోమారు అవమానించారు’’ అన్నారు.

సోనియాకు సమర్థన..
సోనియాను క్రూరంగా వేళాకోళం చేయడం, మాటలతో దాడిచేయడం, భౌతికంగా బెదిరించడం బీజేపీ ఎంపీల మూక మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ అన్నారు. సోనియా పట్ల స్మృతి ఇరానీతో పాటు కొందరు బీజేపీ మగ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ ఎంపీలు గీతా కోరా, జ్యోత్స్నా మహంత్‌ ఆరోపించారు. ఈ వివాదం ముదురుతుండడంతో సోనియా పార్లమెంట్‌లోని కాంగ్రెస్‌ పక్ష కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు సభలో తనకు అవకాశం ఇవ్వాలని అధీర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ‘‘నా వ్యాఖ్యలు ఒకవేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బాధించినట్లయితే.. శుక్రవారం ఆమెను కలిసి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను తప్పు చేస్తే పార్టీ ఎందుకు క్షమాపణ చెప్పాలి? నన్ను ఉరితీయండి..! కానీ, నా పొరపాటుకు మేడం(సోనియాగాంధీ)ను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు?’’ అని ప్రశ్నించారు. అధీర్‌ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఖండించారు. కాంగ్రెస్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

సోనియా దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్‌ : రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు గాంధీభవన్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎగ్జిబిషన్‌ మైదానం వద్ద సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌, సికింద్రాబాద్‌, మెదక్‌, వనపర్తి, హనుమకొండ, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి అర్బన్‌ జిల్లా, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోనూ సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్టీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రపతికి క్షమాపణ చెబితే తప్పేంటని నిలదీశారు. గిరిజనులు, పేదలంటే కాంగ్రె్‌సకు కడుపు మంట అని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు.

జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు
రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై అధీర్‌ రంజన్‌కు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 3న మహిళా కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, త్రిపుర సహా 12 రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్‌పర్సన్లు అధీర్‌ రంజన్‌ ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. ప్రస్తుతం వారంతా జాతీయ, రాష్ట్రాల మహిళాకమిషన్ల చైర్‌పర్సన్లు, సభ్యుల త్రైమాసిక సమావేశం నిమి త్తం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్నారు. వీరు ఓ సంయుక్త ఖండనను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

వివాదాల అధీర్‌
అధీర్‌ రంజన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలి సారి కాదు. గతంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యల దుమారంతో కాంగ్రెస్‌ పార్టీ పలుమార్లు చిక్కుల్లో పడింది. వాటిలో కొన్ని..

 సిక్కు వ్యతిరేక ఆందోళనలను ఉద్దేశించి ‘‘మహా వృక్షం కూ లినప్పుడు భూమి కొద్దిగా కంపించడం సహజమే’’ అం టూ ఇందిరాగాంధీ హత్యను ఉద్దేశించి అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అది ‘సమన్యాయం.. సమర్థనీయం’ అంటూ అధీర్‌ రంజన్‌ చౌదరి ఓ ట్వీట్‌ చేసి వెంటనే డిలీట్‌ చేశారు. అప్పటికే నష్టం జరిగిపోయి కాంగ్రె్‌సను నెటిజన్లు విమర్శించారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని ఎన్డీయే సర్కారు నిర్వీర్యం చేశాక.. ఈ వ్యవహారం దేశ ‘అంతర్గత’ విషయమని కేంద్రం స్పష్టం చేసింది. దానికి అధీర్‌ కౌంటర్‌ ఇస్తూ ‘అంతర్గతం’ ఎక్కడిది? 1948 నుంచి ఐక్య రాజ్య సమితి(ఐరాస) పర్యవేక్షిస్తూనే ఉంది కదా? అని ప్రశ్నించి.. కాంగ్రెస్‌కు చిక్కులు తెచ్చిపెట్టారు.

ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తర్వాత ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌ సభ్యులు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. ఆ బృం దాన్ని ‘కిరాయికి పనిచేసేవారు(కిరాయే కా టట్టూ)’ అని సంబోధించి విమర్శలు మూటగట్టుకున్నారు.

జాతీయ పౌర నమోదు(ఎన్నార్సీ) అమలుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నప్పుడు ‘‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా నిజమైన వలసదారులు’’ అని వ్యాఖ్యానించారు. వారిద్దరూ గుజరాత్‌ నుంచి ఢిల్లీకి వలస వచ్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించి, విమర్శలు ఎదుర్కొన్నారు.

2019లో మోదీ రెండో విడత ప్రభుత్వ ఏర్పాటు సందర్భం గా లోక్‌సభలో ప్రవేశపెట్టిన ధన్యవాదాల తీర్మానంపై అధీర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ‘మురికి కాలువ’తో పోల్చారు. ఇందిరాకు, మోదీకి మధ్య తేడాపై గంగానదిని మురికి కాలువతో పోల్చలేమన్నారు.

సొంత పార్టీ నేతలపైనా అధీర్‌ రంజన్‌ నోరు జారారు. ‘‘యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిఫలాలను అనుభవించిన వారు పార్టీ అధికారానికి దూరమవ్వగానే విమర్శి స్తుంటారు’’ అని జీ23 నేతలపై విమర్శలు గుప్పించారు.

Leave a Reply