ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సుల నరకయాతన

0
245

పాజిటివ్‌ వస్తే ఇళ్లకే.. సొంత డబ్బుతో చికిత్స
పని చేస్తున్న ఆస్పత్రిలో చికిత్సకు నిరాకరణ
ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ నిరాదరణ
క్వారంటైన్‌కు వెళితే వేతనాల్లో కోతలు
ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి మరీ దారుణం
యాజమాన్యాల తీరుతో మనస్తాపం
రాజీనామాలు, నర్సింగ్‌ వృత్తికి గుడ్‌బై
లక్షణాలున్నా విధులకు రావాల్సిందే
నిర్బంధించి పని చేయిస్తున్న ఓ ఆస్పత్రి
తెలంగాణ నర్సింగ్‌ కమిటీకి నర్సుల మొర

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ పేరుమోసిన చిన్నారుల ఆస్పత్రిలో పనిజేస్తున్న కేరళ నర్సుకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. యాజమాన్యం ఆమెను పట్టించుకోలేదు. తమ ఆస్పత్రిలోనే ఐసొలేషన్‌ సౌకర్యం ఉన్నా.. అడ్మిట్‌ చేయలేదు. గాంధీకి పంపింది. అక్కడే చికిత్స పొంది ఆమె కోలుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి తీరూ ఇంతే! అక్కడ పనిచేస్తున్న కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ నర్సు కరోనా బారినపడ్డారు. ఆమెను అమీర్‌పేటలోని సర్కారు దవాఖాన అయిన నేచర్‌క్యూర్‌కు పంపారు. అక్కడ చికిత్స తీసుకున్న ఆమె తన సొంతూరుకు వెళ్లిపోయారు.

సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిజేసే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ యువతికి నాలుగు రోజుల క్రితం తీవ్ర జర్వం వచ్చింది. తన సొంత డబ్బుతో అదే ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకుంది. ఫలితం పాజిటివ్‌ వచ్చింది. వెంటనే సదరు ఆస్పత్రి యాజమాన్యం, ఆ యువతిని ఇంటికెళ్లిపోవాలని సూచించింది. తమ వద్ద ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

..ఇదీ హైదరాబాద్‌లోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని నర్సుల పరిస్థితి. ఆస్పత్రుల్లో రోగులకు సేవలు చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించే నర్సులను యాజమాన్యాలు కూరలో కరివేపాకులా చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు చెల్లించలేమంటూ ఉద్యోగాలు పీకేసి నర్సులను ఇళ్లకు పంపిన ఆస్పత్రులు.. ఇప్పుడేమో వైరస్‌ సోకిన నర్సులను వదిలించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనే దాదాపు 80 వేల పైచిలుకు నర్సులు పనిజేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో పెద్దసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో నర్సులదే కీలక పాత్ర. ఎక్కువ సమయం రోగుల వద్ద ఉండేది వారే కావడంతో వైరస్‌ బారినపడుతున్న వైద్య సిబ్బందిలో నర్సులే ఎక్కువగా ఉంటున్నారు.

క్వారంటైన్‌ రోజుల్లో వేతనాల్లో కోత
ప్రైవేటు ఆస్పత్రుల్లోని నర్సులకు కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలంటే వారి సొంత డబ్బులే చెల్లించాల్సివస్తోంది. పాజిటివ్‌ వచ్చిన తర్వాత వారిని నిర్దాక్షిణ్యంగా ఇళ్లకు వెళ్లమని, క్వారంటైన్‌లో ఉన్న రోజులకు వేతనాల్లో కోత పెడుతున్నారు. విటమిన్‌ మాత్రలను కూడా ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న నర్సులు కరోనా బారినపడితే ఇళ్లకు వెళ్లిపోవాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ట్రావెలింగ్‌ ఎలా చేస్తామని ఓ నర్సు ప్రశ్నించారు. కరోనా లక్షణాలున్నా డ్యూటీలు చేయాలని ఆస్పత్రి యాజమాన్యం వేధిస్తోందంటూ ఓ నర్సు ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సింగ్‌పై తగ్గుతున్న ఆసక్తి
రాష్ట్రంలో దాదాపు 140కి పైగా జీఎన్‌ఎమ్‌ స్కూల్స్‌, 80కిపైగా బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలున్నాయి. గత ఏడాది వాటిలో సగం కూడా అడ్మిషన్లు రాలేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి చదివే వారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. నర్సింగ్‌ అంటే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు చిన్న చూపు ఉండటంతో చాలా మంది ఇటువైపు రావడం లేదు. విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉండటంతో అక్కడికి వెళ్లిపోతున్నారు. తెలంగాణలో ఇంతవరకు నర్సింగ్‌ డైరెక్టరేట్‌ లేదు.

నిర్బంధించి విధులు చేయిస్తున్న వైనం
వారంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన నర్సులు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. కొందరిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయినా వారిని విధులకు హాజరు కావాలని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధిత నర్సులు విధులకు హాజరవుతున్నారు. యాజమాన్యం వేధింపులు భరించలేక ఆయా నర్సులు తెలంగాణ నర్సింగ్‌ కమిటీకి లేఖ రాశారు. పారాసిటమల్‌ మాత్ర వేసుకొని డ్యూటీలకు హాజరు కావాలని యాజమాన్యాలు ఒత్తిడిచేస్తున్నట్లు వాపోతున్నారు.

Courtesy AndhraJyothy

Leave a Reply