నగదీకరణ ముసుగులో ప్రైవేటీకరణ

0
175
బి.వి.రాఘవులు

నగదీకరణకార్యక్రమం ద్వారా రూ. 6 లక్షల కోట్లు వస్తాయని గొప్పలు చెప్పుకోవడం పెద్ద మోసం. నగదీకరణచెయ్యదల్చుకున్న ఆస్తుల విలువ ఎంత? వాటి నుండి ఆదాయం ఇంత వరకు ఎంత వస్తున్నది? ఇప్పుడు మార్కెట్టులో ఆస్తులను లీజుకిస్తే ఎంత రాబడి వస్తుంది? …అన్న వివరాలు బహిరంగపర్చలేదు. ఎంతో రాబడి రాగల ఆస్తులను కారుచౌకగా పెట్టుబడిదారులకు అప్పగించి, తమ అనుంగు మిత్రులకు దోచిపెట్టే స్కీం కాబట్టే ప్రభుత్వం ఇంత గోప్యంగా వ్యవహరిస్తున్నది.

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ గత నెల 23వ తేదీన ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు 2021-22 బడ్జెట్టులో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ‘నీతి ఆయోగ్‌’ ఆస్తుల నగదీకరణకు సంబంధించి రెండు సంపుటాలతో కూడిన ప్రతిపాదనలుజేసింది. ఇందులో రోడ్లు, విద్యుత్తు, సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పైపులైన్లు, గోడౌన్లు, రైల్వే ఆస్తులు, టెలికాం టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌, విమనాశ్రయాలు, ఓడరేవులు, స్టేడియంలకు సంబంధించిన ఆస్తులు వున్నాయి. ఈ ఆస్తులను 2021తో ప్రారంభించి నాలుగు సంవత్సరాలలో నగదీకరణ చేస్తారు. దీని మూలంగా రూ. 6 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని, ఆ మొత్తాన్ని మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తామని, నిరర్థక ఆస్తులను ఉపయోగంలోకి తేవడానికి వీలవుతుందని, ప్రైవేటురంగ పెట్టుబడులు తరలివస్తాయని, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన జరుగుతుందని ప్రకటించారు.

నగదీకరణను సమర్థించుకుంటూ ఆర్థికమంత్రి చెప్పినవన్నీ ప్రజలను మభ్య పెట్టటానికి ఉద్దేశించిన కల్లబొల్లి కబుర్లు. నగదీకరణ అనేది ”ప్రైవేటీకరణ”కు మరొక రూపం మాత్రమే. కాకపోతే చేదు మాత్రకు తీపిపూయడం లాంటిది. నగదీకరణ అంటే ఆస్తులను అమ్మడం కాదని, ఆస్తుల యాజమాన్యం ప్రభుత్వం వద్దే వుంటుందని బిజెపి చెబుతున్నది. 20, 30, 50 సంవత్సరాలకు లీజుకిస్తూ, లీజు కాలం అయిపోయిన తర్వాత మరల లీజును పొడిగిస్తూ వుంటే ఆస్తుల యాజమాన్యం నామక: ప్రభుత్వం పేరుతో ఉన్నా వాస్తవంలో అవి ప్రైవేటు పరమైనట్టే. అందుకే నగదీకరణ ప్రైవేటీకరణకు ముద్దు పేరు అంటున్నాం.

‘నగదీకరణ’ కార్యక్రమం ద్వారా రూ. 6 లక్షల కోట్లు వస్తాయని గొప్పలు చెప్పుకోవడం పెద్ద మోసం. ‘నగదీకరణ’ చెయ్యదల్చుకున్న ఆస్తుల విలువ ఎంత, వాటి నుండి ఆదాయం ఇంత వరకు ఎంత వస్తున్నది, ఇప్పుడు మార్కెట్టులో ఆస్తులను లీజుకిస్తే ఎంత రాబడి వస్తుంది అన్న వివరాలు బహిరంగ పర్చలేదు. ఎంతో రాబడి రాగల ఆస్తులను కారుచౌకగా పెట్టుబడిదారులకు అప్పగించి, తమ అనుంగు మిత్రులకు దోచిపెట్టే స్కీం కాబట్టే ఇంత గోప్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ స్కీం గురించి పార్లమెంటులో చర్చించలేదు. నిపుణులతో అధ్యయనం చేయించలేదు. ఏ మాత్రం పారదర్శకత లేకుండా ప్రభుత్వం ముందుకు పోతున్నది.

ఈ పథకం మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం చెబుతున్నది. ఆస్తులను లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థలు భారీగా పెట్టుబడులను పెడతాయని, తద్వారా నిరర్థకంగా, నిరుపయోగంగా వున్న ఆస్తులు పూర్తిగా వినియోగంలోకి వస్తాయని, వాటి నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నది. కాని పెట్టుబడిదారులు లాభం కోసం వస్తారు. ఆస్తుల నుండి ఎంత లాభం, ఎంత తొందరగా గ్రహిద్దామా అని ఆలోచిస్తారు. లాభం పిండుకుని ఆస్తులను నిరర్ధకం చేసి, ఆ తర్వాత వాటిని వదిలేస్తారు. అన్ని దేశాల అనుభవం ఇదే.

నగదీకరణ ద్వారా వచ్చే డబ్బును మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 111 లక్షల కోట్లు కావాలి. అందులో రూ. 6 లక్షల కోట్లు ఏ మూలకు చాలవు. ఈ పేరుతో ‘నగదీకరణ’ను సమర్థించుకోవడం ‘హాస్యాస్పదం’. వున్న మౌలిక సదుపాయాలను ప్రైవేటు పెట్టుబడికి అప్పగించి, కొత్త మౌలిక సదుపాయాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా వుంది. వాటిని కూడా ప్రైవేటుకు అప్పగించడానికైతే ప్రభుత్వం నిర్మించడమెందుకు? ప్రైవేటు రంగాన్నే మౌలిక సదుపాయాలను నిర్మించమని అడగవచ్చు కదా !

వాస్తవం ఏమిటంటే మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రైవేటు రంగం ముందుకు రాదు. కాని ఈ రంగంలో కూడా దానికి లాభం కావాలి. అందుకు ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నిర్మించి సిద్ధం చేస్తే బరువు బాధ్యత లేకుండా ప్రైవేటు సంస్థలు లాభం చేసుకోవచ్చు. ఇదే నగదీకరణ అసలు స్వరూపం. ప్రభుత్వం ‘నగదీకరణ’ కిందకు తెచ్చిన ఆస్తులను ‘బరువు బాధ్యతలు లేని’ (రిస్క్‌ ఫ్రీ) ఆస్తులని పేర్కొనడంలో ఆంతర్యం ఇదే. లీజుకు తీసుకున్న తర్వాత ప్రకృతి విపత్తుల కారణంగా (తుఫాను భూకంపాలు, వరదలు, పెనుగాలులు, లాక్‌డౌన్లు) మౌలిక సదుపాయాలకు నష్టం జరిగితే ఈ ప్రైవేటు సంస్థలు బాధ్యత తీసుకోవు. వాటిని అత్యవసరంగా పునరుద్ధరించే పని ప్రభుత్వం మీద పడుతుంది. అంటే ఖర్చు ప్రభుత్వానిది, సంపాదన పెట్టుబడిదార్లది.

పై రంగాలు తరతమ భేదాలు లేకుండా ప్రజలందరికీ అవసరమైన సేవలు అందించేవి. సామాన్య ప్రజలకు కూడా నిత్యం అవసరమైనవి. వీటిని కూడా వదిలి పెట్టకుండా లాభాలు చేసుకోవడానికి ఈ రంగాలలోని అత్యంత లాభదాయకంగా వుండే భాగాలను మోడీ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్లకు అప్పగిస్తున్నది. ఈ రంగాల స్వభావం రీత్యా గుండుగుత్తగా కొనడానికి ప్రైవేటు పెట్టుబడి ముందుకు రాదు. కాబట్టి దొడ్డిదారిన ‘నగదీకరణ’ పేరుతో పెట్టుబడిదార్లకు ధారాదత్తం చేస్తున్నది.

మౌలికసదుపాయాల విస్తరణకు ‘నగదీకరణ’ అవసరం అని కొంతమంది మేధావులు ప్రభుత్వంతో గొంతు కలుపుతున్నారు. విమర్శకులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి, దేశ ప్రయోనాలకు వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చైనాతో పోలిక చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో చైనా ఎంతో ముందుకు పోయిందని, చైనాను అధిగమించాలంటే మౌలిక సదుపాయాల నగదీకరణ అవసరమని వాదిస్తున్నారు. ఈ వాదన బోడిగుండుకు మోకాలిచిప్పకు ముడి పెట్టడంలా వుంది.

మౌలికంగా దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం అనేదాంట్లో సందేహం లేదు. కాని దానికి ‘నగదీకరణ’ పరిష్కారం కాదు. చైనాలో మౌలిక సదుపాయాలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో, వాటి పెట్టుబడులతో అభివృద్ధి చెందాయి. ప్రైవేటురంగ ప్రమేయం నామమాత్రం. చైనాయే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ రంగానికి పెద్ద పీట వేశాయి. వున్న ప్రభుత్వ రంగాన్ని కూడా మన పాలకులు ‘నగదీకరణ’ పేరుతో వదిలించుకుంటున్నారు. ఇది ఆత్మహత్యా సదృశం.

Courtesy Prajashakti

Leave a Reply