అనుబంధంపై నెత్తుటి చార

0
564
  • అన్నపై కక్షతో ఉన్మాదిగా మారిన తమ్ముడు
  • సోదరుడు, వదిన, ఆమె తమ్ముడి దారుణహత్య
  • మిత్రులతో కలిసి వేటకొడవళ్లతో ఇంటిపైకి 
  • ఇంట్లోని ఐదుగురిపై విచక్షణారహితంగా దాడి 
  • ప్రాణాపాయ స్థితిలో ఇద్దరు కుమారులు
  • రక్తపు మడుగైన ఇల్లు.. వరంగల్‌లో దారుణం
  • అడ్డొచ్చిన అన్న కుమార్తెను వదిలేసిన ముఠా

వరంగల్‌ : తోడబుట్టిన తమ్ముడే ఉన్మాదిగా మారాడు. స్నేహితులతో కలిసి వేటకొడవళ్లతో రక్తంపంచుకు పుట్టిన అన్న ఇంట్లోకి చొరబడ్డాడు. అన్నను, వదినను, వారి ఇద్దరు కుమారులను విచక్షణా రహితంగా నరికాడు. ఈ దారుణాన్ని ఆ ఇంట్లోనే ఉన్న అన్న బావమరిది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతడినీ వదల్లేదు. ఇంట్లో నేలపై, గోడలపై ఎక్కడ చూసినా రక్త ధారలే.. శరీరాలు ఛిద్రమై గగుర్పాటుకు గురిచేసే దృశ్యాలే! తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఐదుగురిలో అన్న, ఆయన భార్య, అన్న బావమరిది క్షణాల్లో ప్రాణాలు విడిచారు. ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. నగరంలో మునుపెన్నడూ లేని విధంగా ఓ కుటుంబంపై ఈ స్థాయిలో దాడి జరగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అన్నతో నెలకొన్న ఆస్తి తగాదాలతోనే అతడు ఇంతటి దారుణానికి తెగబడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా నరికిన అతడు, అన్న కుమార్తెకు ఏమాత్రం హాని తలపెట్టకుండా వదిలేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన మహ్మద్‌ ఘనీ-అష్రాఫ్‌ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు  చాంద్‌ పాషా(50), రెండో కొడుకు షఫీ వరంగల్‌కు వచ్చి వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. పశువులను కబేళాలకు తరలించడం, గొడ్డు మాంసం విక్రయించే వ్యాపారాన్ని కొన్నేళ్లు కలిసే చేశారు. వీరి తండ్రి మరణించగా, తల్లి పరకాలలోనే ఉంటోంది. చాంద్‌పాషా, షఫీ మధ్య మూడేళ్లుగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.

అన్న ఇంటికి స్నేహితులతో ఆటోలో..
ఈ హత్యల్లో షఫీకి అతడి ఆరుగురు స్నేహితులు సహకరించినట్లు చెబుతున్నారు. అన్న చాంద్‌పాషా, ఆయన భార్యాపిల్లలను హత్య చేసేందుకు స్నేహితులతో  కలిసి అతడు పక్కా పథకం వేశాడు. వారిని ఆటోలో ఎక్కించుకొని బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చాంద్‌పాషా ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో చాంద్‌పాషా, ఆయన భార్య షబీరా (42), ఆమె సోదరుడు ఖలీల్‌ (40), చాంద్‌పాషా కొడుకులుఫహద్‌(26) సమద్‌(24), కుమార్తె రుబీనా(22) వారివారి గదుల్లో నిద్రిస్తున్నారు.  ఆటోలోంచి దిగిన షఫీ బృందం, ఆ వాహనాన్ని ఆన్‌లోనే ఉంచింది. ఇరుగుపొరుగు వారికి ఇంట్లో అరుపుల శబ్ధాలు వినపడకుండా ఉండేందుకు ఒకడు ఆటోలోనే కూర్చుని రైజ్‌ చేశాడు. షఫీ, మరో ఐదుగురు కలిసి ఇంటి తలుపులను రంపంతో కట్‌ చేశారు. ఆ చప్పుడుతో నిద్ర లేచిన రుబీనా డోరు వద్దకు వస్తుండగా నే  షఫీ బృందం లోనికి వచ్చేసింది. రుబీనాను ఉద్దేశించి వేటకొడవళ్లు చూపుతూ ‘నిన్నేమీ చేయం.. గదిలోకి వెళ్లు..’ అంటూ బెదిరించారు. జరగబోయే ఘోరాన్ని ఊహించిన ఆమె, బాబాయి కాళ్ల మీద పడి రోదిస్తూ ఎవర్నీ ఏమీ చేయొద్దంటూ వేడుకుంది. అయినా పట్టించుకోని షఫీ, ఆమెను ఓ గదిలోకి నెట్టి బయట నుంచి గడియ పెట్టాడు. అప్పుడే బెడ్‌రూంలోంచి చాంద్‌పాషా రాగా ఆయన్ను నరికారు. ఆ కేకలు విని లేచొచ్చి అడ్డుకోబోయిన షబీరా, ఖలీల్‌, ఫహాద్‌, సమద్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో చాంద్‌పాషా, షబీరా, ఖలీల్‌   ప్రాణాలు కోల్పోయారు. అంతా చనిపోయారని భావించిన ఆ ముఠా వచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికి సమీద్‌, ఫహాద్‌లు తీవ్రగాయాలతో పడివున్నారు. అరుపులు విన్న చట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చి భయకంపితులయ్యారు. రుబీనాను రూంలో నుంచి బయటకు తీసుకొచ్చి.. పహద్‌, సమీర్‌లను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.

అక్క పిలవడంతో వచ్చి..
నిందితులు ఆత్మకూర్‌ పరిసర ప్రాంతంలో ఉన్నట్లు మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చిన్నాన్నే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న  రుబీనా రోదిస్తూ  పోలీసులకు చెప్పింది. అన్నదమ్ముల మధ్య గొడవతో ఏమాత్రం సంబంధం లేకుండానే షబీరా తమ్ముడు ఖలీల్‌ బలయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖలీల్‌ది కేసముద్రం మండలం మీనాపూర్‌. వరంగల్‌లోని ఓ సెల్‌షాపులో పని చేస్తున్నాడు. ఆయనకు భార్య షామెదా, ఇద్దరు పిల్లలున్నారు.  మంగళవారం ఉదయం ఇంటికి రమ్మంటూ అక్క పిలవడంతో ఖలీల్‌ వెళ్లాడు. రాత్రి ఆ ఇంట్లోనే నిద్రించి.. అక్కాబావపై దాడిని అడ్డుకోబోయి బలయ్యాడు. షఫీ ఎలాంటి ఆపద తలపెట్టకుండా వదిలేసిన రుబీనాకు పెళ్లయింది. ఆమె భర్త ఖతర్‌లో ఉంటున్నాడు. ఘటనకు ముందు షఫీ, తన ఇంట్లోనే స్నేహితులతో  కలిసి పూటుగా మద్యం తాగినట్లు భావిస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply