నిరసన రాజ్యాంగ హక్కు

0
237

జామా మసీదేమీ పాక్‌లో లేదు
భీమ్‌ ఆర్మీ చీఫ్‌ బెయిల్‌ విచారణలో జడ్జి వ్యాఖ్య
ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం

న్యూఢిల్లీ: సాక్ష్యాలేవీ లేకుండానే భీమ్‌ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ను నిర్బంధంలో ఉంచడం, బెయిల్‌ను వ్యతిరేకించడంపై పోలీసుల తీరును ఢిల్లీ న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోవడం వల్లనే ప్రజలు వీధుల్లోకి వచ్చారని, ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం పాకిస్తాన్‌కు చెందిదా? అన్నట్టు పోలీసులు ప్రవర్తించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆ ప్రాంతం పాకిస్తాన్‌ దైనా శాంతియుతంగా ధర్నా చేసే అవకాశం అందరికీ ఉందని తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆజాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి కామినీ లౌ మాట్లాడుతూ ఆజాద్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనేందుకు సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

అలాగే జామా మసీదు ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదనే నిబంధనలను కూడా తెలపాలన్నారు. కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆందోళనలకు సంబంధించి తమ వద్ద డ్రోన్‌ రికార్డులు మాత్రమే ఉన్నాయని పోలీసులు విచారణ సందర్భంగా చెప్పడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిరసన తెలడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన ఆజాద్‌ కోర్టుల్లోనూ నిరసన తెలపవచ్చునన్నారు. కాగా, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పోలీసుల దాడిలో గాయపడ్డ 50 జామియా మిలియా వర్సిటీకి చెందిన విద్యార్థుల వాంగ్మూలాలను మంగళవారం నమోదు చేశారు.

Courtesy Sakshi

Leave a Reply