జి-7కు నిరసన సెగలు

0
200

లండన్‌ : సంపన్న దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కార్నివాల్‌లో భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. వాతావరణ మార్పులు, పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు, పాలస్తీనీయుల హక్కులు, సేవ్‌ మలేషియా డెమోక్రసీ, వ్యాక్సిన్‌ పాలిటిక్స్‌, వాటిపై జీ7 దేశాల తీరు ఇలా ప్రతి అంశంలోనూ పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు తమకు తోచిన రీతిలో ఈ మూడు రోజులూ ఆందోళనలు చేశారు.
కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ విషయంలో కార్న్‌వాల్‌లోని ఫాల్‌మౌత్‌ బీచ్‌ వద్ద నిరసనకారులు జీ-7 దేశాధ్యక్షుల రూపంతో కూడిన హెడ్‌ మాస్కులను ధరించి వ్యాక్సిన్‌ సిరంజీతో టస్సల్‌ వార్‌ చేస్తూ నిరసనలు తెలిపారు. ఒక సామాజిక కార్యకర్త బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రూపంలో ఉన్న హెడ్‌ మాస్కును ధరించి ఫాల్‌మౌత్‌ వీధుల గుండా మార్చ్‌ నిర్వహించారు. అలాగే, ఆక్స్‌ఫామ్‌కు చెందిన పర్యావరణవేత్తలు… స్వాన్‌పూల్‌ బీచ్‌లో నిరసన తెలిపారు. జీ7 సమ్మిట్‌ తొలిరోజే (శుక్రవారం) దాదాపు 500 మంది నిరసనకారులు మార్చ్‌ నిర్వహించారు. వారంతా ” వాతావరణం అంశం, ఎకోలాజికల్‌ ఎమర్జెన్సీ”పై అధ్యక్షులు మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.

అలాగే, బ్రిటన్‌లోని వందలాది మంది మయన్మార్‌ దేశస్థులు.. జీ7 సమ్మిట్‌ జరిగే కార్న్‌వాల్‌ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. సేవ్‌ డెమెక్రసీ ఇన్‌ మయన్మార్‌ పేరిట శనివారం వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలో మిలటరీకి వ్యతిరేకంగా జీ7 దేశాల అధ్యక్షులు చర్యలపై దృష్టిసారించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఫాల్‌మౌత్‌లో ఉండే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు.

ఇజ్రాయెల్‌కు మద్దతు పలకటం ఆపండి..
ఇంగ్లాండ్‌లోని కార్నివాల్‌లో జరిగిన జీ-7 దేశాల సదస్సు జరుగుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అధికార నివాసమున్న డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఆదివారం వేలాదిమంది నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. జీ7 దేశాల తీరును తప్పుబడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌ మద్దతు పలకటం ఆపాలనీ, పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ ఆక్రమణల్ని అడ్డుకోవాలని నిరసనకారులు నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలపై విచారణ జరపాలని, బ్రిటన్‌, జీ7లోని ఇతర దేశాలు ఇజ్రాయెల్‌ విధానాలకు మద్దతు పలకటం ఆపాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో లేబర్‌ పార్టీ మాజీ నాయకుడు జిరేమీ కోర్బైన్‌ హాజరై…ప్రసంగించారు. నేను కోరేది ఒక్కటే. ఇతర దేశాలకు బ్రిటన్‌ ఆయుధాలు అమ్మటం ఆపాలి. దీనివల్ల ఎంతోమంది అమాయక పౌరులు చనిపోతున్నారు. చిన్నారులు బలవుతున్నారు. ఇదంతా ఆపాలి” అంటూ జిరేమీ కోర్బైన్‌ ట్విట్టర్‌లో సందేశం పోస్ట్‌ చేశారు. ఇంగ్లాండ్‌లోని పలు నగరాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. అలాగే పలు చోట్ల నిరసనకారుల్ని పోలీసులు అడ్డుకుని, నిర్బంధిస్తున్నారు. ఆదివారం సదస్సు జరుగుతున్న ఫాల్‌హౌత్‌ ప్రదేశానికి సమీపంలోని ఒక గ్రామంలో సేదతీరుతున్న వందలాది మంది నిరసనకారుల్ని పోలీసులు అదుపు తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కాగా మూడు రోజుల జీ7 సమ్మిట్‌ ఆదివారం ముగిసింది.

Courtesy prajashakti

Leave a Reply