ముస్లింలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్

0
153

హుబ్లీలో ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలు
– 12 మంది పోలీసులకు గాయాలు
– 40 మంది అరెస్టు

న్యూఢిల్లీ : కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పరిగణించబడే ఉత్తర కర్నాటకలోని హుబ్లీ పట్టణంలో హిందూ మతోన్మాదం తలకెక్కిన ఓ విద్యార్థి చేసిన సోషల్‌ మీడియా పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం సాయంత్రం, మక్కా పవిత్ర కాబాపై కాషాయ జెండా ఉన్నట్టు రెచ్చగొట్టే ఫోటోషాప్‌ చేసిన ఫోటోను హిందుత్వ మద్దతుదారు, 20 ఏండ్ల విద్యార్థి అభిషేక్‌ హిరేమత్‌ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ఈ విషయం గుర్తించిన అతని ముస్లిం క్లాస్‌మేట్‌ స్క్రీన్‌షాట్‌గా ప్రచారం చేశాడు. స్క్రీన్‌షాట్‌ పట్టణంలోని ముస్లిం సమాజంలో విస్తృతంగా షేర్‌ అయ్యింది. దీంతో, పాత హుబ్బళిలోని ముస్లింలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీస్ట్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన హిరేమత్‌పై ఓ ముస్లిం సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు రాళ్లతో పోలీస్‌ స్టేషన్‌, వాహనాలపై దాడి చేశారు.

మరోవైపు నిందితుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద దాడిలో సుమారు 12 మంది పోలీసులు గాయపడ్డారు.

గుంపులోని ఒక గ్రూపు ఆసుపత్రి, పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న ఆలయంపైనా రాళ్లు రువ్వింది. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. వాట్సాప్‌ స్టేటస్‌ స్క్రీన్‌షాట్‌ను ప్రసారం చేసిన హిరేమత్‌ క్లాస్‌మేట్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 144 సెక్షన్‌ను పోలీసులు విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

హిరేమత్‌ను అరెస్టు చేశాం : పోలీసులు
హింస ప్రారంభమైనప్పటికే హిరేమత్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు విలేకరులకు తెలిపారు. అతనిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని గుంపు కోరింది. హుబ్బళ్లి-ధార్వాడ్‌ పోలీస్‌ కమిషనర్‌ లాభూరామ్‌ విలేకరులతో మాట్లాడుతూ, సుమారు 40 మందిని అరెస్టు చేశామని, కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని చెప్పారు. విధుల్లో ఉన్న 12 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, కొన్ని పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఆందోళన హింసాత్మకంగా మారినప్పుడు నిందితులపై పోలీసు చర్య గురించి తెలియజేయడానికి ముస్లిం సంఘాల నాయకులను పిలిచినట్లు ఆయన తెలిపారు. వారితో మాట్లాడిన తరువాత శనివారం సాయంత్రం కొంతమంది నిరసనకారులను సంఘటనా స్థలం నుంచి చెదరగొట్టామని తెలిపారు. మరొక గ్రూపు శనివారం అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిందని కమిషనర్‌ చెప్పారు. హుబ్బల్లికి చెందిన సీనియర్‌ రిపోర్టర్‌ ది వైర్‌తో మాట్లాడుతూ ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం), పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి ఒక గ్రూపును సమీకరించారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారని చెప్పారు. నిరసన ఉద్రిక్తంగా, హింసాత్మకంగా మారిందని తెలిపారు.

మతాల మధ్య చిచ్చుపెట్టొద్దు : కుమారస్వామి
మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (సెక్యులర్‌) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి ఈ ఘటనను ఖండిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారు వ్యవస్థపై విశ్వాసం పెంచుకోవాలని ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

వ్యవస్థీకృత దాడి : సీఎం బొమ్మై
హోసపేటలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ, ఈ సంఘటనను ”వ్యవస్థీకృత దాడి” అని అన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా, వారిపై (అల్లర్లు) కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడరని చెప్పారు. దీని వెనుక ఉన్న, గుంపును ప్రేరేపించిన వారెవరైనా శిక్షించబడతారని తెలిపారు. ఇలాంటి సంఘటనల వెనుక ఉన్న సంస్థలకు కర్నాటక రాష్ట్రం సహించదని చెప్పారు.

ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా హోం మంత్రి ప్రకటన
హిందువులు, ముస్లింల మధ్య మరింత ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడారు. ”ఒక పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన కొందరిని అరెస్టు చేశారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి. హుబ్బళ్లి ఘటనలా దేవర జీవనహళ్లి, కడుగొండహళ్లి సృష్టించాలని నిందితులు భావించారు.’ అని అన్నారు.

మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వం!
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధం నుంచి హలాల్‌ మాంసంపై నిషేధం వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు ఉద్రిక్తతలకు సంబంధించిన పలు సంఘటనలకు కర్నాటక గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు, వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా పాకిస్తాన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిందంటూ గత నెల, బాగల్‌కోట్‌ జిల్లాలోని ముధోల్‌లో 25 ఏండ్ల ముస్లిం మహిళ కుత్మా షేక్‌ను అరెస్టు చేశారు. షేక్‌ వాట్సాప్‌లో ‘అల్లా హర్‌ ముల్క్‌ మే ఇత్తేహాద్‌… అమన్‌… సుకూన్‌… అతా ఫార్మా మౌలా’ (అల్లాV్‌ా ప్రతి దేశంలో ఐక్యత, శాంతి, సామరస్యాన్ని ప్రసాదిస్తాడు) అనే శీర్షికతో ఒక చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త భజంతరీ ఫిర్యాదు చేయగా, ఆమెను అరెస్టు చేశారు. ”మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం” అంటూ ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Courtesy Nava Telangana

Leave a Reply