తప్పుడు నిర్ణయం

0
238
తప్పుడు నిర్ణయం

కశ్మీర్‌లో కాలు ఎలా వెనక్కుతీసుకోవాలో కేంద్రానికి తెలియడం లేదు. ఆర్నెల్లు గృహనిర్బంధంలో ఉంచిన మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాల మీద మోదీ ప్రభుత్వం ఇప్పుడు రెండేళ్ళ వరకూ నిర్బంధంలో ఉంచగలిగే ప్రజాభద్రతాచట్టాన్ని ప్రయోగించింది. నైతికంగానూ, చట్టపరంగానే కాదు, రాజకీయంగా కూడా ఇది తప్పుడు నిర్ణయం. ఒమర్‌ తండ్రి ఫారూఖ్‌ అబ్దుల్లా ఇప్పటికే ఇదే చట్ట ప్రకారం నిర్బంధంలో ఉన్నారు. ఈ చర్యలు ప్రజాభద్రతకు కాక, ఢిల్లీ పాలకుల రాజకీయ భద్రతకోసమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇక, ఈ చట్ట ప్రయోగానికి వీలుగా వారెంత ప్రమాదకారులో తెలియచెబుతూ పోలీసులు ముందుకు తెచ్చిన వాదనలు మరింత విచిత్రంగా ఉన్నాయి.

ఒమర్‌ అబ్దుల్లా కశ్మీర్‌ ప్రజలను తన మాటకారి తనంతో ప్రభావితం చేసి ఉద్యమాలు సృష్టించగలరనీ, భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టగలరని అభియోగ పత్రంలో పోలీసులు ఆరోపించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం పతాకస్థాయిలో ఉన్నకాలంలో ఎన్నికలు బహిష్కరించాలంటూ ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాదులు పిలుపునిచ్చినా, ఒమర్‌ ప్రజలను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఓటింగ్‌ జరిగేట్టు చేసిన విషయాన్ని ఆయన సమర్థతకు నిదర్శనంగా పోలీసులు చెప్పుకొచ్చారు. 2008లో ఎన్నికల బహిష్కరణకు వేర్పాటువాదులు పిలుపునిస్తే, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఒమర్‌ పూనుకొని ప్రజలను ఓటువైపు మళ్ళించిన కారణంగా ఓటింగ్‌ మరో 20శాతం పెరిగింది.

ఈ ఎన్నికలు ఉగ్రవాద, వేర్పాటువాదాలకు చెంపపెట్టు అని దేశమంతా ప్రశంసించింది. ఇప్పుడు ఆ ఎన్నికలనే సాకుగా తీసుకొని, అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయిన ఒమర్‌ పైనే ఈ వింతవాదనతో కేసు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ప్రతి ఎన్నికప్పుడు, పోలింగ్‌ పెరిగినప్పుడు కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగంగా కొనసాగాలని కశ్మీరీలు బలంగా కోరుతున్నారని కేంద్రం చెబుతూండేది. కానీ, ఇప్పటి ప్రభుత్వం ఓట్లు వేయించడాన్ని కూడా తప్పుబడుతున్నది. ఒమర్‌ అబ్దుల్లాతో పాటు ప్రజాభద్రతాచట్టం కింద అరెస్టయిన ఆయన పార్టీ కార్యదర్శి, మాజీ న్యాయమంత్రి అలీ మహ్మద్‌ సాగర్‌ మీద కూడా పోలీసులు ఇదే రీతిన అభియోగాలు మోపారు. ప్రజలను పోలింగ్‌కు మళ్లించిన ఆయన సమర్థతనే తప్పుబట్టారు.

మెహబూబా ముఫ్తీ ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడారనీ, కశ్మీర్‌ను భారత్‌ అన్యాయంగా ఆక్రమించుకుందన్నారనీ, నిషేధిత జమాతే ఇస్లామియాకు అనుకూలంగా మాట్లాడారనీ పోలీసుల అభియోగం. ప్రజాభద్రతాచట్టం ప్రయోగానికి సిద్ధపడినప్పుడు పోలీసులు ఇటువంటివి ఎన్నయినా తవ్వితీయవచ్చును. 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడం కూడా నేరమేనని అనవచ్చును. కానీ, ఈ సందర్భంగా 13వ శతాబ్దంలో కశ్మీర్‌ను పరిపాలించిన ‘కోట రాణి’తో పోలీసులు మెహబూబాను పోల్చారు. ఆమె మాదిరిగానే ఈమె శత్రువులకు విషం పెడుతూ, కుట్రలూ కుయుక్తులతో అధికారం కోసం తపించిపోతూంటుందని వారి వాదన. పోలీసుల ఇతరత్రా వాదనలు అటుంచితే, తండ్రిచాటు బిడ్డ, కోటరాణి వంటి మాటలు బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఆమెకు అతికినట్టే ఉన్నాయి. తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ అడుగుజాడల్లో నడిచి బీజేపీతో మైత్రిని కొనసాగించడంతో జమ్మూకశ్మీర్‌లో కమలం కాలూనేందుకు మరింత వీలు కలిగింది. అనంతరం ఆమె పార్టీతో వ్యూహాత్మకంగా తెగదెంపులు చేసుకొని ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికీ అవకాశం దక్కింది.

తండ్రిచాటు బిడ్డలా ఉండటం, ప్రజలను ఓటు వేసేందుకు ప్రోత్సహించడం భారత్‌లో ఎప్పటినుంచి దేశద్రోహమైపోయాయి? అని ప్రియాంకాగాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం కశ్మీర్‌ను గుప్పిట్లో పెట్టుకున్న అబ్దుల్లాలు, ముఫ్తీలమీద ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు. కానీ, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, వేర్పాటువాదులు ఆ రాష్ట్రాన్ని కల్లోలకాసారంగా మార్చేసినకాలంలో వారు భారత్‌ పక్షాన అక్కడ నిలబడ్డారు. కశ్మీరీలంతా ఢిల్లీమీద ఆగ్రహంతో రోడ్లమీదకు వచ్చినప్పుడల్లా వారిపక్షాన వాదిస్తున్నట్టు కనిపిస్తూనే వేర్పాటువాదుల బలం పెరగకుండా కాపుకాశారు. వారు తమ రాజకీయ ప్రయోజనాలకోసమే ఇదంతా చేసి ఉండవచ్చును కానీ, భారత్‌ తరఫున నిలబడినందుకు, దాని రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ నమ్మినందుకు వీరికి తగిన శాస్తి జరిగిందని భారత వ్యతిరేకులు ఆనందించేట్టుగా వ్యవహరించడం సరికాదు. కేంద్రప్రభుత్వం వరుస తప్పటడుగులతో కశ్మీర్‌ను మరింత దూరం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నది.

Courtesy Andhrajyothi

Leave a Reply