అటెండర్లే లైబ్రేరియన్లు

0
301

 – 1040కిగాను 410మందే ఉద్యోగులు
– 18 ఏండ్లుగా నియామకాలు నిల్‌
పేరుకుపోయిన సెస్‌ బకాయిలు రూ.400 కోట్లు
అందులో జీహెచ్‌ఎంసీవే రూ.329 కోట్లు
సొంత భవనాల్లేక ఇబ్బందులు

తాత్కాలిక అటెండర్లు, స్వీపర్లే లైబ్రరీయన్లుగా అవతారమెత్తారు. ఒకే ఉద్యోగి రెండు నుంచి ఐదారు గ్రంథాలయాలను పర్యవేక్షిస్తున్నారు. లైబ్రరీలకు సంబంధించి బరువు, బాధ్యత అంతా తాత్కాలిక సిబ్బందిదే. ఒక్క చోట అని కాదు… రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. వందల కోట్లకు చేరుకున్న సెస్‌ బకాయిలు సంస్థ మనుగడకు గుదిబండగా మారాయి. భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి దోహద పడ్డ గ్రంథాలయాలు నేడు అవసాన దశకు చేరుకుంటున్నాయి. నిధుల లేమి, ఉద్యోగుల కొరత, అద్దె భవనాలతో సతమతమవుతున్నాయి. వెరసీ మొత్తం వ్యవస్థనే శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పోటీపరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులు, పుస్తక ప్రియులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న 676 లైబ్రేరిల్లో మొత్తం 1040 మంది ఉద్యోగులు పని చేయాల్సిన అవసరముంది. కాగా కేవలం 410 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు మినహా స్వరాష్ట్రంలో కొత్తగా ఎలాంటి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. దీంతో ఉన్న అరకొర ఉద్యోగులే అన్ని బాధ్యతలూ చూస్తున్నారు. స్థానికంగా జిల్లా గ్రంథాలయాల సంస్థలు తమ జిల్లాల్లో తాత్కాలిక, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని అక్కడక్కడ నియమించుకోవడం మినహా పూర్తి స్థాయి భర్తీలకు ప్రభుత్వం చొరవచూపలేదు. ఒకే లైబ్రేరియన్‌ చుట్టు పక్కల ఉన్న నాలుగైదు గ్రంథాలయాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న తాత్కాలిక అటెండర్లు, స్వీపర్లే గ్రంథాలయాల బాధ్యతలను మోస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగులు అనుకోని పరిస్థితుల్లో సెలవులో ఉన్నా, మరే ఇతర కారణంతో రాకపోతే ఆరోజు అక్కడి గ్రంథాలయం తెరిచేవారే ఉండరు. మూతపడాల్సిందే. కొత్త జిల్లాల్లో గ్రంథాలయాల సంస్థ కార్యదర్శుల పోస్టుల్లో నూతనంగా నియామకాలు చేయలేదు. పూర్వపు జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శులే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వీపర్‌, అటెండర్‌ నుంచి మొదలుకొని హైదరాబాద్‌లోని రాష్ట్ర గ్రంథాలయాల డైరెక్టర్‌ కార్యాలయం వరకు ఇదే పరిస్థతి నెలకొంది. దీనికితోడు ఇప్పుడున్న సిబ్బందిలో సగం మంది పదవి విరమణకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో మరో రెండేండ్లపాటు నియామకాలు చేపట్టకుంటే గ్రంథాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి.

పేరుకు పోయిన సెస్‌ బకాయిలు
కొత్త పుస్తకాలను ఎప్పటికప్పుడు సమీకరించడం, ప్రజలకు గ్రంథాలయాలను చేరువచేయడమనే లక్ష్యంతో స్థానిక సంస్థలు వసూలు చేసే ఆస్తిపన్నులో ఆదనంగా 8 శాతం సెస్‌ వసూలు చేసి, గ్రంథాలయ సంస్థకు చెల్లించాలని పేర్కొంటూ… ప్రభుత్వం లైబ్రరీల చట్టాన్ని రూపొందించింది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు ప్రభుత్వం నిర్దేశించిన లైబ్రరీ సెస్‌ను దర్జాగా వసూలు చేసుకొని సొంతానికి వాడుకుంటున్నాయే తప్ప గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. ప్రభుత్వం సొంతగా నిధులు ఇవ్వకపోయినా గ్రంథాలయాలకు రావల్సిన సెస్‌ బకాయిలను వసూలు చేసేందుకు తోడ్పాటు అందించడం లేదు. ఫలితంగా గత కొన్నేండ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. 2018-19 ఆర్థిక సంవత్సం చివరి వరకు సెస్‌ బకాయిలు రూ. 400 కోట్లకు చెరుకోగా, ఇందులో జీహెచ్‌ఎంసీ బకాయే రూ. 329 కోట్లుగా ఉండటం గమనార్హం.

సొంత భవనాల్లేక ఇబ్బందులు
సొంత భవనాల్లేక సగానికి పైగా గ్రంథాలయాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పూర్వపు జిల్లా గ్రంథాలయాలు మినహా కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు సైతం కొన్ని చోట్ల సొంత భవనాల్లేవు. 96 గ్రంథాలయాలను అద్దెభవనాల్లో నిర్వహిస్తుండగా, గ్రామపంచాయితీ, మున్సిపాల్టీ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అద్దె లేకుండా 225 లైబ్రరీలు నడుస్తున్నాయి. తమ అవసరం కోసం స్థలం సరిపోవడం లేదనీ, వాటిని ఖాళీ చేయాలని కొన్ని చోట్ల ప్రభుత్వ శాఖలు ఒత్తిడి తెస్తుండటంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అద్దె భవనాల్లోను ఇదే పరిస్థతి నెలకొంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో 24 బ్రాంచీ లైబ్రరీలకు పక్కా భవనాలను నిర్మించాలని టెండర్లు పిలిచినా ఇంకా పూర్తి కాలేదు. మరికొన్ని చోట్ల పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు.

Courtesy Nava Telangana

Leave a Reply