బాబ్రీ పాపం పీవీదే!.. మాధవ్‌ గోడ్బెలే సంచలన పుస్తకం

0
242
  • నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌లా వ్యవహరించారు
  • హోంశాఖ ప్రణాళికను పక్కన పెట్టేశారు
  • అయోధ్యపై హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్‌ గోడ్బెలే సంచలన పుస్తకం

న్యూఢిల్లీ, నవంబరు 3: రాజీవ్‌గాంధీ, పీవీ సింగ్‌, పీవీ నరసింహారావు… అయోధ్య వివాదం పరిష్కారం కాకపోవడానికి, బాబ్రీ మసీదు విధ్వంసానికీ ఈ ముగ్గురే కారణమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్‌ గోడ్బెలే ఆరోపించారు. అయోధ్యపై తీర్పు వెలువడనున్న కీలక సమయంలో… ఆయన రాసిన కొత్త పుస్తకంలోని వివరాలు బయటికి వచ్చాయి. బాబ్రీ మసీద్‌-రామ్‌మందిర్‌ డైలమా: యాసిడ్‌ టెస్ట్‌ ఫర్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌ అనే ఈ పుస్తకంలో పీవీ నరసింహారావుపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బాబ్రీ కూల్చివేతకు ముందు కేంద్ర హోంశాఖ సిద్ధం చేసిన సమగ్ర, అత్యవసర ప్రణాళికను పీవీ ఆమోదించలేదని తెలిపారు. ప్రధానిగా ఒక దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకుని ఉంటే… రామాయణంలో ఈ మహాభారతం జరిగేదే కాదు అని వ్యాఖ్యానించారు.

కీలకమైన టెస్ట్‌మ్యాచ్‌లో పీవీ ప్రధానమైన పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తూ ఆయన నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా మిగిలిపోయారు అని విమర్శించారు. అంతకుముందు… బాబ్రీ మసీదుకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్‌ తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని మాధవ్‌ గోడ్బెలే ఆరోపించారు. రాజీవ్‌ హయాంలో అయోధ్య సమస్యకు ఆచరణీయ రాజీ పరిష్కారాలు సూచించినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఈలోపు ఇరుపక్షాలు తమ వాదనలపై మరింత పట్టుబిగించి, భీష్మించుకు కూర్చున్నాయి. బాబ్రీ మసీదు, దాని చుట్టుపక్కల ప్రాంతాలను వీపీ సింగ్‌ ప్రత్యేక ప్రాంతంగా పరిగణించి కేంద్రం పరిధిలోకి వచ్చేలా ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఈ విషయంలో ఆయన నిక్కచ్చిగానే ఉన్నారు. ఇక… పీవీ హయాంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను ప్రయోగించి వివాదాస్పద కట్టడాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునేలా కేంద్ర హోంశాఖ ఒక ప్రణాళిక రచించింది. అందుకు న్యాయమంత్రిత్వ శాఖ కూడా అంగీకరించి, కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేసింది.

దీనిని కేబినెట్‌ కార్యదర్శికి, ప్రధాని ముఖ్య కార్యదర్శికి, సీనియర్‌ సలహాదారుకు, హోంమంత్రికి 1992 నవంబరు 4వ తేదీన అందించారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించి, బాబ్రీ మసీదు కట్టడంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకుని, పూర్తి భద్రత కల్పించాలన్నది ఆ ప్రణాళిక. కరసేవకులు అక్కడికి చేరుకోకముందే ఈ ప్రణాళికను ఆకస్మికంగా, మెరుపువేగంతో అమలు చేయాలని నోట్‌లో తెలిపారు. దీని అమలుకు వీలుగా ఆర్టికల్‌ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని కూడా సూచించారు. కానీ… రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిన అధికారాలపై పీవీ మరో విధంగా ఆలోచించారు. సుప్రీంకోర్టుకు, జాతీయ సమగ్రత మండలి (ఎన్‌ఐసీ)కి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే విశ్వసించారు అని మాధవ్‌ గోడ్బెలే తెలిపారు. దీంతో అప్పటి కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చినట్లయిందన్నారు. కరసేవకులను యూపీ సర్కారు అనుమతించడం, వారు శాంతి భద్రతలను తమ అదుపులోకి తీసుకోవడం, వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం జరిగిపోయాయి. రాజ్యాంగబద్ధ విధులను నిర్వర్తించడంలో రాష్ట్ర సర్కారు వైఫల్యమే దీనికి కారణం అన్నారు. పరిస్థితి తీవ్రతను గ్రహించి కేంద్రానికి తెలపడంలో అప్పటి గవర్నర్‌ బి.సత్యనారాయణరెడ్డి విఫలమయ్యారని, పైగా రాష్ట్రపతి పాలన అవసరం లేదని చెప్పారని తెలిపారు. మాధవ్‌ గోడ్బెలే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడే 1993 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

Courtesy Andhrajyothy…

Leave a Reply