శ్మశానాల్లో క్యూ

0
46
  • రాజధానిలో శవ దహనాలకు రద్దీ
  • బన్సీలాల్‌పేటలో రోజుకు 25
  • ఈఎస్‌ఐ శ్మశానంలో 35కు పైగా..
  • విద్యుత్తు దహన వాటికకూ డిమాండ్‌
  • మహాప్రస్థానాల్లో సౌకర్యాల లేమి

హైదరాబాద్‌ సిటీ : రాజధాని హైదరాబాద్‌లో కరోనా విలయ తాండవం చేస్తుండడంతో.. శ్మశానాలకు శవ దహనాల తాకిడి పెరిగింది. మహాప్రస్థానాలన్నీ అంత్యక్రియలతో బిజీగా కనిపిస్తున్నాయి. ఒక్క ఈఎ్‌సఐ శ్మశాన వాటికలోనే శుక్రవారం 42, శనివారం 38, ఆదివారం 37 చొప్పున దహన సంస్కారాలు జరిగాయి. అదే బన్సీలాల్‌పేట మహాప్రస్థానంలో రోజుకు సగటున 25 శవ దహనాలు జరుగుతుండగా.. వాటిల్లో 15 కరోనా మృతులకు సంబంధించినవే..! ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్‌కు చికిత్స పొందుతూ మృతిచెందినవారి అంతిమ సంస్కారాలు విద్యుత్తు దహనవాటికల్లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా జీహెచ్‌ఎంసీ, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగుతోంది. విద్యుత్తు దహనాల సదుపాయం ఉన్న అంబర్‌పేట్‌, పంజాగుట్ట, ఫిలింనగర్‌, ఈఎ్‌సఐ, బన్సీలాల్‌పేట శ్మశాన వాటికల ముందు అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి. కరోనా మరణాల పెరుగుదలతో.. శవ దహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని శ్మశాన వాటికల నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా మరణాలకు సంబంధించి విద్యుత్తు దహన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. సాధారణ మరణాలకు సంబంధించి, కట్టెలపైనే దహనాలు చేస్తున్నట్లు వివరించారు. కొవిడ్‌ నెగటివ్‌ ఉన్నా.. మరణాలు పెరుగుతున్నాయని, దీంతో.. కట్టెలకు భారీగా డిమాండ్‌ పెరిగిందంటున్నారు. దీంతో.. ముందుజాగ్రత్త చర్యగా కట్టెల స్టాకును పెద్దఎత్తున తెప్పించుకుంటున్నామన్నారు.

బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో కట్టెలపై దహనసంస్కారాలు నిర్వహించేందుకు ముందుగానే నంబర్లు కేటాయిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి శవాలను విద్యుత్తు దహనవాటికలో దహనం చేస్తున్నారు. ఇతర ఆరోగ్యసమస్యలతో చనిపోయిన వారికి ఉదయం 10 గంటల వరకు ఆ రోజులో దహనసంస్కారాల కోసం బుకింగ్‌ పూర్తవుతోంది. ఆ తర్వాత ఎవరైనా వస్తే ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. బన్సీలాల్‌ పేట శ్మశానవాటికలో కట్టెలతో కాల్చేందుకు 10 ఫ్లాట్‌ఫారాలు ఉండగా.. వాటిలో శవాలను కాల్చేందుకు అధిక సమయం పడుతోందని.. అందుకే తక్కువ సంఖ్యలో కట్టెలపై దహనసంస్కారాలు నిర్వహిస్తునట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

జిల్లాల వారైనా.. ఇక్కడే
పలు జిల్లాల నుంచి నగరంలోని ప్రభుత్వాస్పత్రులకు వచ్చి కరోనా చికిత్స పొందుతూ మృతిచెందిన వారి శవాలకు సొంతూళ్లకు తీసుకెళ్లేందుకు అనుమతించడం లేదు. వారి కుటుంబసభ్యులు నగరంలో అందుబాటులో ఉన్న విద్యుత్తు దహనవాటికల్లో దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంబర్‌పేట్‌ శ్మశానవాటికలో విద్యుత్తు దహనవాటిక ప్రస్తుతం మరమ్మతులో ఉంది. దీంతో.. కరోనా మృతులకు కూడా కట్టెలపైనే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. రోజుకు రెండు నుంచి మూడు దాకా కరోనా మృతదేహాలు వస్తున్నాయని ఇక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా మృతదేహాలను ఒక గేట్‌ నుంచి.. సాధారణ మరణాలకు సంబంధించి మరో గేట్‌ నుంచి అనుమతి ఇస్తున్నామన్నారు.

అంతటా సౌకర్యాల లేమి..
కరోనాతో మృతిచెందిన వారి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న శ్మశానవాటికల్లో సౌకర్యాల లేమి నెలకొంది. ఈఎ్‌సఐ శ్మశానవాటికలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ ప్రక్రియ నిర్వహించడం లేదు. ఇక్కడ నీటి సదుపాయం కూడా అంతంతమాత్రమే. దాదాపు అన్ని శ్మశానవాటికల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల కరోనా మరణాలకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.

గ్యాస్‌ దహన వాటికలు ఎక్కడ?
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త శ్మశాన వాటికలు లేవు. ఆ దిశలో అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఉన్న శ్మశాన వాటికల్లో విద్యుత్తు దహనవాటికలను ప్రవేశపెట్టినా.. గ్యాస్‌ దహనవాటిక ప్రతిపాదన అటకెక్కింది. ఏడాది క్రితం కరోనా మృతుల దహనాలను శ్మశానాల్లో నిర్వహిస్తుండగా.. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో.. నగర శివారు ప్రాంతాల్లో గ్యాస్‌ దహన వాటికలు నిర్మించాలని నిర్ణయించారు. పటాన్‌చెరులో రూ.98 లక్షలతో గ్యాస్‌ దహనను నిర్మించారు. అయితే.. దాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ దహన యంత్రం, షెడ్డు నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. గ్యాస్‌ దహనవాటికతో ట్రయల్‌ రన్‌ కూడా సక్సెస్‌ అయ్యింది. కేవలం మరుగుదొడ్లను, స్నానాల గదులను నిర్మించి, తాగునీటి వసతి కల్పిస్తే ఈ శ్మశానవాటిక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. గ్యాస్‌ దహనవాటిక అందుబాటులోకి వస్తే.. రోజుకు 15-20 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలుంటాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply