రాధిక వేముల ఔదార్యం

0
201

హైదరాబాద్‌: రోహిత్‌ వేముల.. భారత్‌లో దళిత, విద్యార్థి ఉద్యమాలకు చిరునామా నిలిచిన పేరు. ఆధిపత్య కులాల ఏలుబడిలో నడుస్తున్న వ్యవస్థ అతడిని బలి తీసుకున్న తర్వాత రోహిత్‌ తల్లి రాధిక కులవ్యతిరేక ఉద్యమాలకు నాయకురాలిగా మారారు. 2016లో తన కుమారుడు చనిపోయిన తర్వాత నుంచి విద్యార్థుల నేతృత్వంలో ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ ముందు వరుసలో ఉంటున్నారామె. ఢిల్లీ జెన్‌ఎన్‌యూ విద్యార్థి నజీబ్ తప్పిపోయినప్పుడు, సీఏఏ వ్యతిరేక పోరాటాల్లో ఆమె పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదల ఆకలి మంటలను చల్లార్చడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు. తనను తానుగా వలస కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు వీధుల్లోకి వచ్చిన ఆమెకు నిరుపేదల వెతలు కళ్లకు కడుతున్నాయి.

రాధిక తన కుమారుడు రాజా వేములతో కలిసి కూతురు ఇంట్లో పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న తర్వాత మార్చి 21న హైదరాబాద్‌ వచ్చారు. రోహిత్‌ ఆత్మహత్య కేసులో న్యాయవాదిని కలుసుకున్నారు. సరిగ్గా అదే రోజున లాక్‌డౌన్‌ ప్రకటించారు. వేముల కుటుంబం ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా అడ్వకేట్‌ జైభీమారావు ఇంట్లోనే బస చేస్తారు. ఈసారి కూడా అక్కడే ఉన్నారు. అయితే చుట్టుపక్కల వారి వేధింపులతో తాము రోడ్డున పడాల్సి వచ్చిందని రాజా వేముల తెలిపారు. ‘మమ్మల్ని అపరిచితులుగా పేర్కొంటూ చుట్టపక్కల వారు వేధించడం మొదలుపెట్టారు. మా అన్నయ్య చనిపోయి తర్వాత నుంచి మేము హైదరాబాద్‌ ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాం. మేము బయట నుంచి వచ్చామని మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారు. దీంతో జైభీమారావు పోలీసులకు ఫోన్‌ చేశారు. పోలీసులు వచ్చి విచారణ చేసి మేము చెప్పిందే నిజమని నిర్ధారించారు. మమ్మల్ని అక్కడే ఉండేందుకు అనుమతించారు. అయినప్పటికీ పొరుగింటోళ్ల వేధింపులు ఆగలేదు. యజమానిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేసేలా చేశార’ని రాజా వేముల తెలిపారు. 2014 నుంచి అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న లాయర్‌తో పాటు వేముల కుటుంబాన్ని బయటకు వెళ్లిపోవాలని యజమాని ఆదేశించడంతో వారంతా రోడ్డుమీద పడ్డారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటువెళ్లడానికి లేక రాధిక అమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారని వారికి ఆశ్రయం ఇచ్చిన న్యాయవిద్యార్థి తెలిపారు. రోహిత్‌ వేముల మూవ్‌మెంట్‌ సమయంలో ప్రకాశ్‌ అంబేద్కర్‌, కంచ ఐలయ్య లాంటి మేధావులు ఇదే ఇంట్లో ఉన్నారని గుర్తు చేసుకుంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు రాజా స్నేహితుడి ఇంట్లో రాధిక, ఆమె కుమారుడు ఉన్నారు. గుంటూరు తిరిగి వెళ్లడానికి రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో తన మిత్రుడి ఇంట్లో అతిథులుగా ఉండాల్సి వచ్చిందని రాజా తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల్లో ‘రోహిత్‌ వేముల సేవా సంఘం’ తరఫున నిరుపేదలకు తమకు చేతనైన సాయం చేయాలని నిశ్చయించుకున్న రాధిక.. అన్నార్తులకు ఆహారం అందజేస్తున్నారు. గత నాలుగు రోజులుగా స్వయంగా విజిటేబుల్‌ బిర్యానీ వండి వలస కార్మికులకు పంచిపెడుతూ వారి ఆకలి తీర్చుకున్నారు. తమ దగ్గర డబ్బులు లేనప్పటికీ విరాళాలు సేకరించి పేదలకు అన్నం పెడుతున్నామని రాజా వేముల తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత గుంటూరు తిరిగి వెళ్లి అక్కడ కూడా వలస కార్మికులకు అన్నం పెట్టే కార్యక్రమం కొనసాగిస్తామన్నారు.

Leave a Reply