చినుకు చినుకూ ఓ జీవన గంగ

0
27
సునీతా నారాయణ్

వానలు కురిస్తేనే వసుంధర. ఈ వర్ష ఋతువులో జడివానలు బాగా పడుతున్నాయి. ప్చ్.. అపార వర్ష జలాలు యథావిధిగా వ్యర్థమవుతున్నాయి. అమూల్యమైన ఈ ప్రాకృతిక సంపద అలా వృథా కావల్సిందేనా? నీటి పంపిణీ నిర్వహణలో సంచితమైన మన జ్ఞానాన్ని సింహావలోకనం చేసుకుని, వాతావరణ–విపత్తులతో సతమతమవుతున్న ప్రపంచానికి దాని ఉపయుక్తత గురించి దృష్టి సారిద్దాం. తొలుత మనం రెండు తిరుగులేని వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి– ఆరోగ్య భద్రత, ఆర్థికాభివృద్ధిలో నీరు ఒక కీలక నిర్ణాయకం; రెండు–నీటి యుద్ధాలు అనివార్యమేమీ కావుకానీ మన జలవనరులను వివేక యుక్తంగా నిర్వహించుకోకపోతే ఆ ఉపద్రవాలు తప్పక సంభవిస్తాయి. ఇది జరగకుండా ఉండాలంటే మనం సత్వరమే నీటి నిర్వహణ విధానాన్ని, పద్ధతులను సరిదిద్దుకోవల్సిన అవసరముంది. విశాల సమాజం ఎదుర్కొంటున్న నీటి సంబంధిత సమస్యలను తమ సొంత సమస్యలుగా భావిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఒక శుభ పరిణామం.

1980 దశకం చివరి నాళ్ల వరకు నీటి యాజమాన్యం చాల వరకు సాగునీటి పారుదల ప్రాజెక్టుల విషయానికే పరిమితమై ఉండేది. నీటిని నిల్వ చేసి, సుదూర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు డ్యామ్‌ల నిర్మాణం, కాల్వల తవ్వకం మొదలైన అంశాలకే అధిక ప్రాధాన్యమిచ్చాం. అయితే ప్రస్తావిత దశాబ్దం చివరి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కరువు కాటకాలు సంభవించాయి. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాను ఇతోధికం చేస్తేనే సరిపోదనే విషయం విధాన నిర్ణేతలకు విశదమయింది. అదే కాలంలో ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ తన నివేదిక ‘డైయింగ్ విజ్‌డమ్’ (అంతరిస్తున్న వివేకం)ను ప్రచురించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న పర్యావరణ ప్రాంతాలలో వర్ష జలాల సేకరణ, నిల్వకు సంబంధించిన సంప్రదాయ సాంకేతికతల విశిష్టత, ఉపయుక్తతలను ఆ నివేదిక సమగ్రంగా వివరించింది. వర్షం ఎక్కడైతే పడుతున్నదో అక్కడే దాన్ని సేకరించి, నిల్వ చేసుకుని ఉపయోగించుకోవాలని ఆ నివేదిక స్పష్టం చేసింది.

1990 దశకం చివరి సంవత్సరాలలో విస్తృతంగా నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు భారీ కార్యక్రమాలను ప్రారంభించాయి. వాననీటిని భద్రంగా నిల్వ చేసుకునేందుకై కొలనులను నిర్మించాయి, చెరువులు తవ్వాయి, వాగులు, కాలువలు ఉన్న చోట వాటికి అడ్డంగా రాతి కట్టడాలు (చెక్ డ్యామ్) కట్టాయి. ఈ శతాబ్ది తొలి దశాబ్ది మధ్యనాళ్లకు ఈ వివిధ కార్యక్రమాలన్నీ ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’గా పర్యవసించాయి. గ్రామీణ ప్రాంతాలలో సాగు, తాగు నీటి వసతుల అభివృద్ధికి ఆ చట్టం విశేషంగా దోహదం చేసింది. సాగు, తాగు నీటి సరఫరాలో భూగర్భ జలాల ప్రాధాన్యం పట్ల కూడా విధాన నిర్ణేతల అవగాహన మెరుగుపడింది.

వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న మన దేశంలో ఇప్పటికీ సేద్యం గణనీయంగా వర్షాధారితంగా ఉందనేది ఒక కఠోర వాస్తవం. ఈ దృష్ట్యా జలవనరుల సంరక్షణ, వాన నీటి సేకరణ– నిల్వ, భూగర్భ జలాలను పూర్వస్థాయికి పునరుద్ధరించడమనేది చాలా ముఖ్యం. ఇవి వినా వ్యవసాయ దిగుబడుల పెంపుదల, ప్రజలకు శ్రేయో సాధన అసాధ్యం. ఈ శతాబ్ది రెండో దశకం ఆరంభంలోనే వర్షాభావం కారణంగా పట్టణ ప్రాంతాలలో నీటి సంక్షోభం ఏర్పడింది. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నగరాలు సుదూర ప్రాంతాల నుంచి జరిగే సరఫరాలపై ఆధారపడి ఉన్నాయి. సుదూర ప్రాంతాలలోని జల వనరుల నుంచి ఆ నీటిని తోడి, పైపుల ద్వారా నగరాలకు తీసుకురావడంలో చాలా నీటి నష్టం జరుగుతుంది. పైగా విద్యుత్ చార్జీల భారం పెరిగిపోతుండడంలో నీటి సరఫరాలో సమన్యాయం లోపించింది. నీటి సరఫరా శుష్కించి పోవడంతో భూగర్భ జలాలను ఉపయోగించుకోవడానికి ప్రజలు ఆరాటపడ్డారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాల విజృంభణతో నగరాలు, పట్టణాలలోని కుంటలు, చెరువులు చాలవరకు అంతరించిపోయాయి లేదా పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా భూగర్భ నీటి మట్టాలు పాతాళానికి కృంగి పోయాయి.

ఈ సమస్యలకు పరిష్కారమేమిటి? నగర వాసులు అందరికీ నీటి సరఫరా సక్రమంగా జరగాలంటే నీటి పంపిణీ సుదూర ప్రాంతాల నుంచి కాకుండా సమీప ప్రాంతాల నుంచి మాత్రమే జరగాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుంటలు, చెరువులు, వర్ష జలాల సేకరణ– నిల్వ సదుపాయాలు మొదలైన స్థానిక జల వ్యవస్థల నుంచి మాత్రమే నీటి పంపిణీ జరగాలి. ప్రతి గృహం నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి, దూర ప్రాంతాలకు రవాణా చేసి ప్రక్షాళించాలి. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థ జలాలను పునరుపయోగానికి వీలుగా స్వచ్ఛ పరిస్తే నీరు వృధా కాదు. నదులు కాలుష్య కాసారాలు కావు. ఇది జరగాలంటే సాగు అవసరాలకు నీటిని పొదుపుగా, సమర్థంగా ఉపయోగించుకునే వ్యవస్థలను అభివృద్ధిపరచుకోవాలి. ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆహారంగా తీసుకునే పంటలు సాధ్యమైనంత తక్కువ నీటితో సాగయ్యేవిగా ఉండాలి.

చినుకులతో చెరువు నిండునా? అని మన పూర్వీకులు నైరాశ్యానికి లోనవుతుండేవారు. అయితే మనం అలా నిరుత్సాహపడడానికి ఇది సమయం కాదు. ఎందుకంటే వాతావరణ మార్పు పర్యవసానాలు నానాటికీ తీవ్రమవుతున్న కాలమిది. ప్రకృతి ఆగ్రహాన్ని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే వర్తమాన భారతదేశ జల ఇతిహాసంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నింగి నుంచి నేలకు పడిన ప్రతి వానచుక్కను భద్రంగా నిల్వ చేసుకుని ఉపయోగించుకోవాలంటే స్థానిక జల వ్యవస్థలను మెరుగుపరచుకోవాలి. అప్పుడు మాత్రమే కరువుకాటకాల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని స్థానికంగా సమకూర్చుకోగలుగుతాము. అడవులు, హరిత స్థలాలను సంరక్షించుకోవాలి. భూగర్భ జల సంపదను సమృద్ధపరుచుకోవాడానికి ఇది ఎంతైనా అవసరం. వ్యర్థ జలాలను శుద్ధి చేసుకుని పునర్వినియోగించుకోవడం చాలా ముఖ్యం. నగరాలలోనూ, గ్రామీణ ప్రాంతాలలోనూ భూగర్భ జలాలను గణనీయంగా పునరుద్ధరించుకున్నప్పుడు మాత్రమే మనకు జల భద్రత సమకూరుతుంది.

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Leave a Reply