వణికిస్తున్న వర్షాలు

0
733

మరో రెండు రోజులు ఇదే స్థితి
బలంగా నైరుతి పవనాలు
– ‘హిక్కాప్రభావమూ కారణమే!
రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయలసీమలో కొద్దిరోజులుగా కురిసిన వర్షాలు బుధ, గురువారాల్లో తగ్గగా, కోస్తా, ఉత్తరాంధ్రలలో గురువారం ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరో ఒకటి రెండు, రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం ఒక కారణం కాగా, అరేబియా సముద్రంలో ఏర్పడి తీరాని తాకిన హిక్కా తుపాన్‌ ప్రభావంతో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ల నుండి కోస్తా అంతా బలమైన గాలులు వీస్తున్నాయని, ఫలితంగా నైరుతి రుతుపవనాలు బలంగా మారాయని చెబుతున్నారు.
గుంటూరులో పత్తి, మిర్చికి నష్టం
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంటూరు జిల్లాలో పత్తి, మిర్చి పొలాల్లోకి నీరు చేరింది. దీంతో పైర్లకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. . పత్తిపాడు,కాకుమాను, తాడికొండ తదితర ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు చేరాయి. వాగులు పొంగుతుం డటం, కాలువలు నిండా పారుతుండటంతో పోలాల్లో నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. జిల్లాలోని కాకుమాను మండలంలో అత్యధికంగా 56 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
మన్యంలో కూలిన చెట్లు
తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఒక మోస్తరు నుంచి బారీ వర్షాలు కురిశాయి. మన్యంలో భారీ వర్షాలకు కొండ వాగులు ఉధృతంగా ప్రవహి స్తున్నాయి. చెట్లు కుప్పకూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రాజవొమ్మంగి మండలంలోని వట్టిగడ్డ, మడేరు, కిండ్ర, పెద్దేరు, నెల్లిమెట్ట వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని సోకులేరు వడివడిగా ప్రవహిస్తోంది. రంపచోడవరంలో భారీ వర్షాలకు రంప కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరంలో గురువారం 15.04 మిల్లీమీటర్ల వర్షం కురింది.రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు జిల్లాలోని మున్సిపాల్టీల్లో భారీ వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి.
ఉద్దానంలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. కవిటిలో గరిష్టంగా 200.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోంపేటలో 154.4మి.మీ, కంచిలిలో 152.2 మి.మీ వర్షం పడింది. ఉద్దానం ప్రాంతంలోని మిగిలిన మండలాల్లో 100 మి.మీ పైన వర్షం పడింది. ఈ ప్రాంతంలో శుక్రవారం కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. డిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో, వంశధారలోవరద ప్రవాహం పెరుగుతోంది. గొట్టాబ్యారేజీ 21 గేట్ల ద్వారా 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి పంట నీటి మునిగింది. . వీరఘట్టం మండలం చలివేంద్రిలో ఓ ఇల్లు, మందస మండలం నారయణపురంలో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురంలో పశువుల పాక గోడ కూలింది.
ఆగిరిపల్లిలో ఆగిన రాకపోకలు
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, ఆగిరిపల్లి, ముసునూరు, కంచిక చర్ల, నందిగామలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆగిరిపల్లి మండలంలో కుంపిని వాగు పొంగడంతో మండలంలోని రాజవరం, న్యూగొండపల్లి, చినగిరిపల్లి, తోటపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కంచికచర్ల మండలంలోని నక్కలవాగుకు వరద ప్రవాహం పెరగడంతో చెవిటికల్లు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చెవిటికల్లు సమీపంలోని లక్ష్మయ్యవాగుకు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది.
ప్రకాశంలో కొట్టుకుపోయిన వలలు, బోట్లు
అర్ధరాత్రి పూట వీచిన తీవ్ర గాలుకుతోడు అలలు విరుచుకు పడటంతో ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం పాకల తీరంలోని పల్లెపాలెం, చెల్లెమ్మగారిపాలెం, క్రాంతినగర్‌లో వలలు, బోట్లు కొట్టుకుపోయాయి. గురువారం తెల్లవారుజామూను వేటకు పోదామని బయల్దేరిన మత్యకారులకు లంగరు వేసి ఉన్న బోట్లు కొట్టుకుపోయినట్టు గుర్తించారు. సముద్రం ఒడ్డున వెతుకుతా పోగా కొన్ని కిలోమీటర్ల అవతల వాటిని కనుగున్నారు. అయితే, పనికి రానిస్థితిలో ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా రూ.50 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు మత్స్యకారులుల చెబుతున్నారు. వలలు, బోట్లు సముద్రంలో ఉన్నవి ఒడ్డుకు చేర్చుకునే పనిలో వందలాది మంది మత్యకారులు ఆ పనిలో నిమగమై ఉన్నారు.

పోటెత్తిన వరహా నది
విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా ఎస్‌.రాయవరం మండలంలో వరహానదికి వరద పోటెత్తింది. దీంతో సోముదేవునిపల్లి వద్ద గట్టు భారీగా కోతకు గురైంది. గట్టుమీద వున్న గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి ఆలయం గ్రామస్తులు చూస్తుండగానే కూలి, కొట్టుకుపోయింది. . శారదానది, పెద్దేరు, తాచేరు, బొడ్డేరులో కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.

Courtesy Prajasakti…

Leave a Reply