రామానుజ విగ్రహ ప్రతిష్టాపన ఒక రియాల్టి షో

0
211
– డాక్టర్‌ దేవరాజు మహారాజు
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.

ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీ ఛానళ్ళలో రియాల్టీ షోలు చూస్తుంటారు. వాటి రూపకర్తలు, దర్శక నిర్మాతలు తెరమీద కనబడరు. అందులో పాల్గొంటున్న నటీనటులు మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంటారు. ఆ కార్యక్రమాల్ని ఎవరో స్పాన్సర్‌ చేస్తుంటారు. మరెవరో ప్రమోట్‌ చేస్తుంటారు. ప్రేక్షకుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అవి టీవీ తెరమీద కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలని తమకు తామే చెప్పుకునే స్థాయిలేని కొందరు మనుషులు వెకిలి నవ్వులు నవ్వుతూ, పిచ్చి జోకులేస్తూ, అసభ్య నృత్యాలు చేస్తుంటారు. దానికి కామెడి అని పేరు పెడతారు. ఇష్టం లేని వాళ్ళు ఛానల్‌ మార్చుకోవాల్సిందే. పోనీ, దేశంలో ఏం జరుగుతుందోనని న్యూస్‌ ఛానల్‌కి మారిపోయినా లాభం ఉండదు. అక్కడా ఈ రియాల్టీ షోకు సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. అదెంతో ఇబ్బందికరమైన పరిస్థితి. పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం తప్పించుకుందామని ప్రేక్షకులు అటూ ఇటూ ఏ ఛానల్‌కు మారినా ఆ ప్రసంగాన్ని తప్పించుకోలేరు. అలాంటప్పుడే ప్రేక్షకులకు జ్ఞానోదయమవుతుంది. ఈ దేశాన్ని మూర్ఖత్వంలో ముంచేవారు ముంచుతూ ఉంటే, వివేకవంతులంతా ఏం చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంత చిన్న ప్రయత్నమైనా చేస్తూ ఉండాలి కదా? అని అనిపిస్తుంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చినజీయర్‌ నేతృత్వంలో కొనసాగిన రామానుజ విగ్రహ ప్రతిష్టాపన కూడా ఒక రియాల్టీ షోకు ఏమాత్రం తీసుపోదు. దానికి ఢిల్లీ నుండి ఇద్దరు ముఖ్యమైన ఆర్టిస్టులు కూడా వచ్చి పెద్ద నామాలు పెట్టుకుని వేషం కట్టారు. వారి తర్వాత వారి జూనియర్‌ ఆర్టిస్టులు కూడా వచ్చి ‘తగ్గేదేలే’ అన్నారు.

ఒక మతాచార్యుడి విగ్రహస్థాపనకు ఎన్ని వందల ఎకరాలు కావల్సి వచ్చాయి? విగ్రహంలో ఉన్న బంగారమెంత? దాని ఎత్తెంత? వంటి వివరాలన్నీ జనానికి తెలిసిపొయ్యాయి. వాటి గురించి చెప్పుకోవడం అనవసరం. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మత గురువులు అందరూ కలిసి సామాన్యుణ్ణి ఒక ఉచ్చులో ఎలా పడేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారంలో చూశాం. సమతామూర్తి రామానుజుడి విగ్రహస్థాపన అని గొప్పగా చెప్పుకునే ముందు వెయ్యేండ్ల క్రితం నాటి ఓ మత ప్రచారకుడిని ఇప్పుడు మళ్ళీ జనం మీద రుద్దడం వెనక ఉన్న రాజకీయాలేమిటీ? రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలేమిటీ? ఎవరు ఎవరికి బీనామీ? అని సామాన్యులు ఆరా తీస్తున్నారు. అన్నీ పసిగడుతున్నారు. నిజాలు తెలుసుకుంటున్నారు. అది ఎవరో ప్రయివేటు వ్యక్తులు చేస్తున్న కార్యక్రమమనే అనుకుందాం. కానీ, దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సమాజంపై పడుతుంది గనుక, తప్పుడు విషయాలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు గనక, ప్రగతి శీల భావాలు గల వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. సమతామూర్తి పేరుతో అక్కడ జరగబోయేది ఫక్తు వ్యాపారమని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రామానుజుడి గురించి నిజాయితీగా వీళ్ళేమైనా జనానికి వాస్తవాలు చెపుతున్నారా? చెపితే కొంత వరకు ఇబ్బంది ఉండక పోయేది.

రామానుజాచార్యుడు ఏమైనా కుల నిర్మూలన కోసం పాటు పడ్డాడా? మనుషులంతా ఒక్కటే అని గానీ, అందరూ సమానులే అని గానీ అన్నాడా? అనలేదే.. మోక్ష సాధన కోసం తను, తన వర్గంవారు ఎలాగైతే శ్రీమన్నారాయణుడిని పూజిస్తున్నారో, ఇతర కులాల వారు కూడా ఆ జగన్నాటక సూత్రధారిని ఆరాధిస్తూ మోక్షం సాధించుకోవాలని అన్నాడు. అంటే ఇతర కులాలవారిని కూడా తన శ్రీవైష్ణవ మతం స్వీకరించమని ఒత్తిడి చేశాడు. అంతే గాని, కులాలకు అతీతంగా వ్యవహరించాడని కాదు. మొన్న మొన్నటి వరకు శ్రీవైష్ణవ గురువులు ఊళ్ళు తిరుగుతూ ఇతర కులాల వారి భుజాల మీద శంఖు చక్రాలు ముద్రించి (సవశ్రీనాలు) వారిని నారాయణమూర్తి భక్తుల జాబితాలో చేర్చుకుంటూ పోయారు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. 1960లలో నా చిన్నతనంలో నేనే గమనించాను… అంతేగాని, ఇతర కులస్థుల ఆర్థిక స్థోమత పెంచడానికి గానీ, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి గానీ ఆ గురువులు ఏమాత్రం పనిచేయలేదు. రామానుజుడిది భక్తి ఉద్యమం. సామాజిక ఉద్యమం కాదు. లేని దేవుణ్ణి నిలబెట్టడానికి చేసిన వృధా ప్రయాస. అలాంటి వాడికి విగ్రహం పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారూ?
నిజంగా రామానుజుడు దళితుల కోసం కృషి చేసి ఉంటే, ఈ దేశంలో పెరియార్‌, అంబేద్కర్‌, ఫూలే దంపతులకు పని ఉండేదే కాదు. నిమ్నకులస్థులంతా మెడకో ముంత, నడుముకో చీపురు కట్టుకుని జంతువులకన్నా హీనంగా బతకాల్సి వచ్చేదే కాదు. కేరళలో ‘నంగిలి’ అనే నిమ్నజాతి మహిళ రొమ్ముపన్ను చెల్లించలేక కొడవలితో తన రెండు రొమ్ములూ కోసి తెచ్చి – సుంకం వసూలు చేసే అధికారి చేతిలో పెట్టేదే కాదు. సరే.. పాత సంగతులు వదిలేద్దాం. సమకాలీనంలో ఏం జరుగుతూ ఉంది? ప్రముఖ సంగీత విద్యాంసుడు కె.జె. జేసుదాసును ఆలయంలోకి రానివ్వకపోతే, ఆయన ఆలయం బయట కీర్తన పాడి వెళ్ళిపోయాడు కదా? ఈ దేశపు ప్రథమ పౌరడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు ఆలయ ప్రవేశం లేదంటే గుడి బయటే పూజలు నిర్వహించుకుని తిరిగి వెళ్ళిపోయారు కదా? రామానుజుడు వెయ్యేండ్ల క్రితమే సమత సాధించిన వాడయితే, ఇప్పటికీ నిమ్న వర్గాల మీద అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఓ దళిత యువతిని పెత్తందార్లు రేప్‌ చేస్తే వారిని రక్షించడానికి పోలీసులు అర్థరాత్రి ఆ అమ్మాయికి అంత్యక్రియలెందుకు చేశారూ? అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అలా చేయడం అంటే… ఈ దేశభక్తులు శాంతి భద్రతలు కాపాడుతున్నట్టా? ఈ దేశంలో ఏ సమత ఉందని మత ప్రచారకులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్లు కొన్ని టీవీ ఛానల్‌ వాళ్ళూ మాట్లాడుతున్నారూ? అసలు వీళ్ళకు రామానుజాచార్యుడు ఎవరో తెలుసా? ఆయన ఏం బోధించాడో తెలుసా? మోడీ-షాలతో సహా టీవీ యాంకర్ల దాకా వేషాలు వేసుకుని జనాన్ని ఉదరగొట్టడం తప్ప, అసలు విషయమేమైనా మాట్లాడారా? సనాతన ధర్మం చాటి చెప్పి జనాన్ని జాగృతం చేయాలన్నారు. చాటి చెప్తారు సరే – ప్రాథమిక అవగాహన కూడాలేని ఆ సనాతన ధర్మంతో సమాజాన్ని ఎలా జాగృతం చేస్తారో చెప్పాలి కదా? దేశ దేశాల నుండి సాధు, సన్యాసుల్ని, సంత్‌లను ఆహ్వానించామన్నారు. ఏదేశంవాడైతేనేమిటి? విషయమేమీ లేనప్పుడు సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేది బూడిదే కదా?

కులాలకు అతీతంగా రామానుజుడు చేసిన పనులేమిటి? ఆయన కృషి ఫలితం సమాజం మీద ఎలా పడింది? చర్చించారా? ‘స్టాచ్యు ఆఫ్‌ ఈక్వాలిటీ’ అని పేరు పెట్టగానే సరిపోదుకదా? సమానత్వ స్థాపనకు ఆయన చేసిన పనులేమిటి? చెప్పాలి కదా? తను ఓ విశ్వాసంలో ఉండి, ఓ దేవుణ్ణి ప్రార్థించి మోక్షం సాధించాలనుకున్నాడు. అదే పని ఇతర కులాల వారినీ చేయమన్నాడు. అంతే కదా? దైవ భావనతో – మోక్షప్రాప్తితో సమాజం ఏ కాలంలోనైనా ముందుకు నడిచిందా? ఈతరం వారు విశ్లేషించుకోవాలి! వెయ్యేండ్ల క్రితం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుప్తరాజుల పాలన అంతమైంది. ఉత్తర భారతదేశం మీద గజనీ మహ్మదు దండయాత్రలు (1001-1927సి.ఈ) సాగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు పరిపాలిస్తున్నారు. ఎవరి రాజ్యం వారు కాపాడుకోవడంలోనే సతమతమయ్యేవారు. హేతుబద్ధంగా ఆలోచించడం తర్వాతి మాట – కనీసం అప్పటికి ప్రచారంలో ఉన్న చార్వాక దర్శనం- బుద్ధుడి బోధనలు వారి చెవికెక్కలేదు. మెల్ల మెల్లగా వైదిక ప్రచారకుల ప్రభావానికి లోనై, జైన మందిరాల్ని బౌద్ధారామాల్ని దౌర్జన్యంగా ఆలయాలుగా మార్చుకుని, కొత్త దేవుళ్ళను సృష్టించుకుని, తమ జన్మలు ధన్యమయ్యాయని మురిసిపోయారు. చివరకు బుద్ధుణ్ణి దశావతారాలలో చేర్చుకుని, బౌద్ధుల ఆలోచనా ధోరణిని నాశనం చేశారు.

దేవుడికీ జీవుడికీ మధ్య గురువును ప్రవేశపెట్టి ప్రమోట్‌ చేసింది – రామానుజాచార్యులే. ఆ గురుస్థానంతో తన వర్గమంతా రాగల కాలాలలో ఆధ్యాత్మిక ఆధిపత్యం కొనసాగించవచ్చని వ్యూహాత్మకంగా ఒక పన్నాగం పన్నిన మహానుభావుడు ఆయనే! ఆ శ్రీమన్నారాయణుడిని నేరుగా మీకుమీరే పార్థిస్తే లాభం ఉండదు. అది ఒక గురువు ద్వారా ‘సమ్యక్‌ జ్ఞానం’ పొందాలన్నాడు – రామానుజుడు! అందువల్లనే బ్రాహ్మణ పూజారి వర్గమంతా శతాబ్దాలుగా పౌరోహిత్యంతో సునాయసంగా బతికేస్తున్నారు. అదే బహుజనులు, ఈ దేశ మూలవాసులు విద్యలేక ఎంత కష్టపడ్డా ఆర్థికంగా నిలదొక్కుకోలేక, నానా యాతన పడ్డారు. సమాజంలో ప్రతి చిన్నా పెద్దా కార్యక్రమాలకు పూజారులు – పురోహితులు – మత గురువుల అవసరం తప్పనిసరి అన్నట్లు రామానుజుడు జనాన్ని ప్రభావితం చేశాడు. వెయ్యేండ్ల నాటి ఆయన నిర్ణయం ఇప్పటికీ సమాజంలో కనిపిస్తోంది. అదే సంప్రదాయం / సంస్కృతిగా మారింది. తమ వైదిక మతంలోని మరోశాఖకు చెందిన వీర శైవులతో హౌరాహౌరీగా కొట్లాడిన వీరు – అంటే, ఈ ‘వీర వైష్ణవులు’ సమత గురించి ఏం చేశారని ఇప్పుడీ విగ్రహాలు? ఒక శ్రీవైష్ణువుడు చందాలు పోగుచేసి, తన కులస్థుడైన మరో శ్రీవైష్ణవుడి విగ్రహం స్థాపించినట్లే ఉంది గానీ, అంతకు మించి ఏమీలేదు. అందుకే చారిత్రక సత్యాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంది!

రామానుజుడు కులాలకు అతీతంగా జ్ఞాన బోధ చేసి ఉంటే… ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయించిన చిన జీయరు.. ”కులాలు ఉండాల”ని ఎందుకు చెపుతున్నారు? ఆ మాటల వెనక మతలబు ఏమిటీ? ఇందులో మానవోద్దరణ ఏముంది? సమత ఎక్కడుందీ? సర్వమానవ సౌభ్రాతృత్వం, లోకకళ్యాణం ఎక్కడుందీ? పైగా కోడి మాంసం తింటే కోడైపోతారు. మేక మాంసం తింటే మేక బుద్దులొస్తాయి. పంది మాంసం తినేవాడు పందైపోతాడు.. అని చెపితే ఎలా? ప్రపంచంలో అధిక శాతం జనాభా మాంసాహారులే ఉన్నారు. శాఖాహారం తింటూ ఎదుటివారిని మనుషులుగా గుర్తించక వారిని కాల్చుకుతినే అమానవీయ ప్రవృత్తిని ఏమందాం? అలాంటి అమానవీయ సంస్కృతిని ఈ దేశంలో శతాబ్దాలుగా సాగిస్తున్నదెవరూ? ఇకనైనా సరిదిద్దుకోరా? ”కులాలుండాలండీ.. ఎవరి పనులు వారు చేయాలండీ” అని చెపితే – మనమంతా ఒప్పేసుకోవాలన్న మాట! పందిని తింటే పంది బుద్దులు వస్తాయనే గురువుకు విషయం తెలిసినట్టు లేదు. పందీ, మనిషీ రెండూ క్షీరదాలే.. అంటే పాలిచ్చే జంతువులే.. అవునన్నా కాదన్నా అవయవాల పనితీరులో పోలికలుంటాయి. ఇటీవల పంది గుండెను చనిపోయే దశలో ఉన్న ఒక మనిషికి అమర్చి.. అతని ప్రాణం కాపాడారు డాక్టర్లు! సైన్సు అందించిన మైకు పట్టుకుని, కరోనా భయంతో ‘ఫేస్‌ షీల్డ్‌’ పెట్టుకుని – పిచ్చి మాటలు చెప్పేవారిని జ్ఞాని అనీ, అసిస్టెంట్‌ సమతామూర్తీ అని.. అందామా? సమాజాన్ని సహస్రాబ్ది కాలం పాటు వెనక్కి నెట్టడానికి చేస్తున్న ఉత్సవాలకు హర్షిద్దామా? మతంతో జనాన్ని విభజిస్తున్నందుకు నిరసిద్దామా? తుది నిర్ణయం ప్రజలదే! ప్రజల విశ్వాసాల మీద కాదు, వారి వివేకం మీద నాకు విశ్వాసం ఉంది.

Courtesy Nava Telangana

Leave a Reply