
రామానుజుడు చేసింది ఒక సంస్కరణలాగా కనిపించినప్పటికీ అది ఒక కన్వర్షన్ ప్రాజెక్ట్. ఒకవైపు అవైదిక మతాలైన జైన బౌద్ధాల బ్రాహ్మణ వ్యతిరేకత ప్రభావం సమాజంలో అప్పటికి ప్రబలివుంది. బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందినవారు సిద్దులుగా వునికిలో వున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్ధ క్షేత్రమని పేరు. అలాగే ప్రస్తుత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో సిద్ధుల గుట్టలు, సిద్ధిపేటలు అన్నీ బౌద్దులవే! వరంగల్ పద్మాక్షి గుట్ట జైనులది. వైద్య శాస్త్రంలో పేరుపొందిన ‘అగలయ్య’ జైనుడే! జైన బౌద్ధ సంప్రదాయాలకు నుంచి శాస్త్రవేత్తల స్థాయికి చెందిన బుద్ధిజీవులను వైదిక మతస్తులైన బ్రాహ్మణవాదులు పాలకులవద్ద చేరి వారిచేత మట్టుపెట్టించిన సంఘటనలు చరిత్ర పొడుగునా వున్నాయి. బౌద్ధ సిద్ధుల రక్తంతో చెరువులు నిండిపోయిన చరిత్ర జగ్గయ్యపేట వంటి బౌద్ధ స్థావరాల వద్ద సజీవంగా వుంది. వారిమీద వైదిక మతస్తులు దాడులు చేసి చంపిన సందర్భాలు వున్నాయి. భౌతికంగా అవి కొంతమేరకు కనుమరుగైనప్పటికీ బ్రాహ్మణేతర కులాల ప్రజలంతా స్థానికంగా వారివారి కుల దేవతలను, గ్రామ దేవతలను పూజిస్తూ మతపరంగా తమదైన స్వతంత్రతతో వున్నారు. వీరెవరూ వైదిక మతంలో భాగం కాదు. అయినప్పటికీ వారిని ‘హిందువులు’ అని నమ్మబలికే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. అణగారిన అమాయక ప్రజలు నమ్ముతూ మేముకూడా హిందువులమే అని జబ్బ చరుచుకుంటూ ‘అఖండ’ ప్రాజెక్ట్ లో యిమిడిపోయారు.
బౌద్ధాన్ని చంపేసి గ్రామ దేవతల స్వతంత్ర అస్తిత్వాన్ని రూపుమాపి మెజారిటీ ప్రజల్ని, వారి దేవతలను తమ ‘అఖండ’ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి బ్రాహ్మణ మతాన్ని (దీన్ని ‘మార్గ సంప్రదాయం’ అంటారు) బలోపేతం చేయడానికే వీర శైవం, వైష్ణవం వచ్చాయి. వీటిలో వీరవైవానికి కొంత బ్రాహ్మణేతర ద్రుక్పధం వున్నట్టు అనిపించినప్పటికీ వీరిద్దరూ బ్రాహ్మణేతర ప్రజల మత సంస్కృతుల్ని వాతాపి జీర్ణం చేసుకోవడమే వాటి ఉద్దేశ్యం. అందుకే గ్రామ దేవతలను శివుడికో, విష్ణువుకో భార్యల్ని చేస్తూ కధలల్లి వారిని తమలో కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. వీరశైవం మాల మాదిగ జంగాలు అనే పూజారి వర్గాన్ని తయారు చేసి వారి స్వతంత్ర మత సంస్కృతిని నాశనం చేసింది. అదేదారిలో వైష్ణవం బైలుదేరింది, సారంలో దొందూ దొందే! రామానుజుడి వైష్ణవం అంటరానివారిగా చెప్పబడే మాల, మాదిగలకు కూడా మోక్షం పొందే హక్కు వుందని వారికోసం ప్రత్యేకంగా చిన్న చిన్న గుడులు నిర్మించి వాటిలో వారినే పూజారులుగా నియమించి మాల దాసరి, మాదిగ దాసరి వంటి కొత్త పూజారి వర్గాన్ని ఆకులాల నుంచి తయారు చేసి వారికీ జంధ్యం వేసింది. అంతేగాని పెద్ద పెద్ద దేవాలయాలలో మాల మాదిగ దాసరులను గానీ మాల మాదిగ జంగాలను గానీ పూజారులుగా పెట్టలేదు సరికదా కనీసం వారిని రానివ్వలేదు.
రామానుజిడి సామాజిక సంస్కరణకు అనేక పరిమితులున్నాయి. ఆయన కాలానికి దళితులు మోక్షం పొందడానికి అర్హులే అని చెప్పడం పైకి కొంత అభ్యుదయకరంగా అనిపించినప్పటికీ ఆనినాదంలో బ్రాహ్మణ వైదిక మత ప్రయోజనాలే దాగున్నాయని తెలుస్తుంది. అది చరిత్ర అయితే, వర్తమానంలో జరిగేది రాజకీయ, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టి జనాన్ని గంపగుత్తగా ఆధ్యాత్మిక మగతలోకి తీసుకెళ్ళి నిద్రపుచ్చే పెద్ద కుట్ర. ఒకవైపు కుల వ్యవస్థ అలానే వుంటే ‘ధర్మం’ నాలుగు పాదాలమీద నడుస్తుంది అని కులాన్ని కాపాడే ప్రవచనాలు వల్లిస్తూ, అణగారిన ప్రజల, మైనారిటీల ఆహార అలవాట్లను అవమానిస్తూ ‘సమత’ మనతోనే మొదలవ్వాలి అని పరస్పరం పొంతనలేని మాటలు మాట్లాడే చినజీయరు కులమత తత్వాలు ‘అసుర’ ప్రవృత్తి అని పేర్కొనడంలో వుండే ద్వంద ప్రవృత్తి టీవీల వారికి అర్ధం కావడం లేదా?
‘అసుర ప్రవృత్తి’ యజ్న యాగాలను ధ్వంసం చెయ్యడం అని పురాణాలు ఎప్పుడో కోడై కూశాయి. అసురులారా! మేల్కోండి! మన కళ్ళకు గంతలు కట్టే కుట్రల్ని చేదించండి!