– ర్యాంకర్లను కొంటున్న శ్రీచైతన్య, నారాయణ
– జాతీయస్థాయిలో అభాసుపాలవుతున్న తెలుగు రాష్ట్రాలు
– ఆ విద్యాసంస్థల్లో చదవని విద్యార్థుల పేర్లతో ప్రచారం
– జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో బాగోతం బట్టబయలు
– టాపర్ మృదుల్ అగర్వాల్ పేరును వాడుకున్న ఐదు కాలేజీలు
– తప్పుడు ర్యాంకులతో విచ్చలవిడిగా విద్యావ్యాపారం
– తల్లిదండ్రులను మోసం చేస్తున్న వైనం
– చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారుల అలసత్వం
హైదరాబాద్ : ‘1,1,1,2,2,2,3,3,3. టాప్ పది ర్యాంకుల్లో పదికి పది, టాప్ హండ్రెడ్‌లో 90.’అంటూ జేఈఈ, నీట్, ఎంసెట్ ఫలితాల సమయంలో కార్పొరేట్ కాలేజీల ఊదరగొట్టే ప్రచారం వింటాం, చూస్తాం. చెవులు పగిలిపోయేలా శ్రీచైతన్య జైత్రయాత్ర, నారాయణ విజయకేతనం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేస్తాయి. ఇప్పుడు సరికొత్తగా బ్రేకింగ్ న్యూస్ అంటూ ర్యాంకులను ప్రసారం చేస్తున్నాయి. ఆయా కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులే ర్యాంకులు సాధిస్తే వాటిని ప్రచారం చేసుకుంటే తప్పేమీ లేదు. కానీ ఆ విద్యాసంస్థల్లో చదవకపోయినా, ర్యాంకర్లను కొని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రచారం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టాప్ ర్యాంకర్లకు కార్పొరేట్ స్థాయిలో రేటు ఆఫర్ చేసి వారి పేరును వాడుకునే పరిస్థితి దాపురించింది. గతంలో జేఈఈ, నీట్‌లో తెలుగు విద్యార్థులే జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్లుగా నిలిచే వారు. దీంతో ర్యాంకర్లను కొనే పరిస్థితి శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు రాలేదు. రెండేండ్లుగా పరిస్థితి మారింది. కరోనా నేపథ్యంలో ర్యాంకుల గురించి ప్రచారం చేయలేదు. ఇంకోవైపు తెలుగు విద్యార్థులు జాతీయ ప్రవేశపరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలవడం లేదు. దీంతో వేరే విద్యాసంస్థల్లో చదివిన టాప్ ర్యాంకర్లను కొని వారి పేర్లను, ఫొటోలను వాడుకునే స్థాయికి శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు దిగజారాయి. ఒకవైపు ఫీజుల దోపిడీ, ఇంకోవైపు ర్యాంకర్లను కొని తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. ఈ పరిణామంతో జాతీయస్థాయిలో తెలుగు రాష్ట్రాలు అభాసుపాలవుతున్నాయి. ఆ కార్పొరేట్ విద్యాసంస్థలకు ర్యాంకుల కక్కుర్తి ఎందుకని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇదే తొలిసారి కాదు…
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈనెల 15న విడుదలయ్యాయి. అందులో రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న అల్లెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన మృదుల్ అగర్వాల్ (హాల్‌టికెట్ నెంబర్ 2050447) టాపర్‌గా నిలిచారు. టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఒక్కరూ లేరు. దీంతో శ్రీచైతన్య, నారాయణ, ఆకాశ్, ఫిట్జీ, అల్లెన్ ఈ ఐదు కాలేజీలు టాపర్‌గా నిలిచిన ఆ విద్యార్థి తమ వాడంటే తమ వాడని పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నాయి. మీడియాలో ప్రకటనలు ఇచ్చాయి. ఒకే విద్యార్థి ఐదు కాలేజీల్లో ఎలా చదువుతాడనీ, ఇందులో ఏదో బోగస్ ఉందని ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది. అయితే ఆన్‌లైన్ స్టూడెంట్ అనీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ గ్రాండ్ టెస్టులు రాశారనీ, అందుకే తమ విద్యార్థి అంటే తమ విద్యార్థి అని ఆ కార్పొరేట్ కాలేజీలు సమాధానం చెప్తున్నాయి. జేఈఈ మెయిన్ ఫలితాల సమయంలోనే టాపర్లందరినీ శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు కొనడం ఆనవాయితీ అని సమాచారం. ఆ విద్యాసంస్థల్లో చదవని వారిని టార్గెట్ చేసుకుని పెద్దమొత్తంలో (రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు) ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశచూపి రిజిస్టర్ చేసుకుంటాయి.
శ్రీచైతన్య, నారాయణలో ఆన్‌లైన్ క్లాసులకు హాజరైనట్టు, గ్రాండ్ టెస్టులు రాసినట్టు, అందుకే ర్యాంకు వచ్చినట్టు ఓ వీడియో తీసుకుంటారు. ఎవరు టాపర్‌గా నిలిస్తే వారి వీడియోను వాడుకునే పరిస్థితి ఉన్నది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ఇవన్నీ చేస్తాయని తెలుస్తున్నది. ‘అమ్మానాన్నల ప్రోత్సాహం, శ్రీచైతన్య లెక్చరర్ల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రత్యేకంగా శ్రీచైతన్య టెస్టు సిరీస్, గ్రాండ్ టెస్టులు, ప్రాక్టీస్ చేయడమే నా విజయానికి ముఖ్యకారణం’అని మృదుల్ అగర్వాల్ అన్నారని ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. గతేడాది నీట్ ఫలితాల్లోనూ టాపర్‌గా నిలిచిన ఒడిషాకు చెందిన షోయబ్ అఫ్తాబ్‌ను సైతం శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ విద్యార్థి అని ప్రచారం చేసుకోవడం గమనార్హం. అవి విచ్చలవిడిగా విద్యావ్యాపారం చేస్తున్నాయి. తప్పుడు ర్యాంకులతో విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నాయి. అయినా విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు ఆ విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే మామూళ్లకు ఆశపడి అధికారులు విచారణ చేపట్టకుండా చేష్టలుడిగి చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కార్పొరేట్ కాలేజీల దందా..
రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల దందాకు పాల్పడుతున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన మృదుల్ అగర్వాల్‌ది ఏ కాలేజీ?. ఒకే విద్యార్థి పేరును శ్రీచైతన్య, నారాయణ, ఆకాష్, ఫిట్జీ వంటి విద్యాసంస్థలు ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సమంజసం. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాని ర్యాంకులను వచ్చినట్టు చూపించి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై విచారణ చేసి తగు చర్యలు చేపట్టాలి.
– సంతోష్‌కుమార్, టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు
టాప్ ర్యాంక్‌పైనే ఎందుకంత మోజు
తెలుగు రాష్ట్రాల్లోని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అధ్యాపకులు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు బాగున్నాయి. అయినా ఒకటో ర్యాంకు రాకపోతే వెనుకబడి పోతామని భావిస్తున్నాయి. టాప్ 4,5 ర్యాంకులొచ్చినా సంతోషంగా ఉండడం లేదు. అందుకే తప్పుడు పద్ధతిలో ర్యాంకులను కొనాలని చూస్తున్నాయి. టాప్ ర్యాంక్‌పైనే ఎందుకంత మోజు ఉంది. టాప్ ర్యాంక్ రాకపోయినా, వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి చేరే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులే చేరుతారు. తప్పుడు పద్ధతులకు పాల్పడి ర్యాంకులు పొంది ప్రచారం చేసుకోవడం వల్ల విశ్వసనీయత కోల్పోయే ప్రమాదముంది.
– కె లలిల్‌కుమార్, ఎడుగ్రామ్ డిజిటల్ 360 డైరెక్టర్
ఆ విద్యాసంస్థలపై క్రిమినల్ కేసు పెట్టాలి
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రథమ ర్యాంకు తమదంటే, తమదే అని ప్రచారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై క్రిమినల్, చీటింగ్ కేసు పెట్టాలి. తప్పుడు ర్యాంకులతో శ్రీచైతన్య, నారాయణ, ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. మృదుల్ అగర్వాల్ తమ కాలేజీలో చదివారంటే, తమ కాలేజీలో చదివారని శ్రీచైతన్య, నారాయణ, ఆకాష్, ఫిట్జీ, ఆల్లెన్, జీ వంటి విద్యాసంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఈ తప్పుడు ర్యాంకులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జోక్యం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో తప్పుడు పద్ధతిలో సంస్థలను ఏర్పాటు చేసి లక్షల రూపాయల ఫీజును దండుకుంటున్న శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జీ, ఆకాష్, జీ వంటి విద్యాసంస్థలను నిషేధించాలి.
– టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
Courtesy Nava Telangana