యోగి ‘రక్షణ’లో కీచక స్వామి

0
222

ఎస్‌ పుణ్యవతి

చెప్పుకుంటే సిగ్గుచేటు. షాజహాన్‌పూర్‌ అత్యాచార బాధితురాలి అరెస్టు వార్త విన్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికీ దేశవిదేశాల్లో భారత స్త్రీ కి రక్షణ కరువు అన్న ముద్ర పడింది. ‘నిర్భయ’ ఘటనతో మానవ సమాజం ఉలిక్కిపడింది. డేరా బాబా, ఆశారాం బాపు ఉదంతాలు, బాబాల ముసుగులో ఆడపిల్లల పైన, స్త్రీల పైన సాగే కీచక పర్వాలు, కతువా, ఉన్నావ్‌ నేరస్తులను అధికార పార్టీ నేతలు కాపాడే యత్నాలు జనం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు తాజాగా ‘స్వామి’ చిన్మయానంద ఉదంతం. షాజహాన్‌ పూర్‌ అత్యాచార బాధితురాలి అరెస్టు వార్త! అనుంగు మిత్రుణ్ణి కాపాడ్డానికి అధికార నేతల అడ్డగోలు యత్నాలు రోత పుట్టస్తున్నాయి. నోరు విప్పితే మతం, దేముడు, రాముడు! కాని జరుగుతున్నదేంటి? 72 ఏళ్ల స్వామీజీ, ‘ఇహ లోక సౌఖ్యాలు వద్దు; పరలోక ప్రాప్తియే హద్దు’ అని ప్రవచించే స్వామీజీ, తాను నడుపుతున్న కాలేజీ విద్యార్థినిని లొంగదీసుకొని తుచ్ఛమైన కామ వాంఛలు తీర్చుకున్నాడని ఆ అమ్మాయి ఆరోపణ. తాను ఆపదలో ఉన్నానని, రక్షణ కావాలని మోడీని అర్థించింది. ఒరిగిందేంటి? తప్పుడు కేసు బనాయించి బాధితురాలినే జైల్లో వేశారు. ఏమీ ఎరగనట్లు ఎంచక్కా మోడీజీ విదేశీ పర్యటనల్లో మునిగి తేలుతున్నారు.
ఆగస్టు 23న ఉత్తర ప్రదేశ్‌ లోని షాజహాన్‌పూర్‌లో స్వామీ చిన్మయానంద నడుపుతున్న లా కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పెట్టింది. ‘నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. సంత్‌ సమాజానికి చెందిన ఒక పెద్ద మనిషి ఆడపిల్లల జీవితాలను నాశనం చేశాడు. అతను నన్ను, నా కుటుంబాన్ని కూడా చంపుతానని బెదిరిస్తున్నాడు. మోడీజీ, యోగీజీ నన్ను కాపాడండి!’ ఇదీ వీడియో సారాంశం. అంతేకాదు, జిల్లా కలెక్టరు, పోలీసు ఉన్నతాధికారులు కూడా అతని గుప్పిట్లో ఉన్నారని పేర్కొంది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.
స్వామి చిన్మయానంద మామూలు వ్యక్తి కాదు. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పెద్ద మనిషి. ముఖ్యమంత్రికి ప్రియ మిత్రుడు. షాజహాన్‌పూర్‌లో, హరిద్వార్‌, రిషికేశ్‌లలో ఆశ్రమాలు, షాజహాన్‌పూర్‌లో కాలేజీలు నడుపుతున్నాడు. వాటిలోని ‘స్వామి సుఖదేవానంద్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ కాలేజీ’లో ఈ బాధిత మహిళ చదువుకుంటోంది. 2011లో కూడా ఆశ్రమంలో ఉంటున్న ఒక సాధ్విపై అత్యాచారం చేశాడని ఆరోపణ. అధికారాన్ని ఉపయోగించారు. కొన్నాళ్ల తరువాత కేసు ఎత్తివేశారు. ఈ రాజ్యం మాది! ఈ ప్రభుత్వం మాది! నోరు విప్పారో! జాగ్రత్త! ఇలా వుంది నేతల తత్వం.
అమ్మాయి కనిపించకుండా పోయిందని ముందే చెప్పుకున్నాం కదా! ఆ పిల్ల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిని అపహరించారేమోనన్న భయంతో పాటు, తన కూతురును చిన్మయానంద లైంగికంగా చెరపట్టాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. చిన్మయానంద మిన్నకుంటాడా? తనని బదనాం చేసి డబ్బు గుంజే ప్రయత్నం ఈ అమ్మాయి చేస్తోందని ‘గతంలో కుల్‌దీప్‌ సింగ్‌ సెనగర్‌ని (ఉన్నావ్‌ కేసులో ముద్దాయి, ఎమ్మెల్యే) ఇరికించారు, ఇప్పుడు నా వంతు’ అని వాపోయాడు. ఆవిధంగా చిన్మయానంద పోలీసు కంప్లయింటు ఇచ్చాడు. తనకి ఒక ‘వాట్సప్‌’ మెసేజ్‌ వచ్చిందనీ, రూ.5 కోట్లు డిమాండు చేశారని, ఇవ్వకపోతే తనను, తన ఆశ్రమాన్ని అభాసుపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలి మీద ఆగస్టు 25న కేసు నమోదు చేశారు.
సమస్య లోతులు గమనించిన కొందరు లాయర్లు చొరవ చేసి సుప్రీంకోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం స్పందించడం చాలా అవసరమని, కేసు ‘ఉన్నావ్‌’ రేప్‌ను

తలపింపజేసేదిగా ఉందనీ, ఆ కేసులో అనేక అనుమానాస్పద మరణాలు సంభవించాయని, ఆ పరిస్థితులు మళ్లీ తలెత్తరాదనీ వారు కోర్టును కోరారు. రాజస్థాన్‌లో తల దాచుకున్న బాధితురాలు కూడా సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమె భద్రతకు తగిన ఏర్పాట్లు చెయ్యాలని కూడా కోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 2న మొత్తం కేసు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌’ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 8న బాధితురాలు అత్యాచారం కేసు పెట్టింది. చిన్మయానంద ఆమెను బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి సంవత్సరం పాటు ఆమెపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పత్రికలకు కూడా అనేక వివరాలిచ్చింది. బాధితురాలు లా కాలేజీలో చదువుతుండగానే ఆమెకు ల్రైబ్రరీలో ఉద్యోగం ఇచ్చాడు. హాస్టలులో చేరమని చెప్పి సీటు ఇప్పించాడు. బాత్‌రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి, దాన్ని అడ్డం పెట్టుకొని ఆమెని బ్లాక్‌ మెయిల్‌ చేసి లొంగదీసుకున్నాడు. ఆమె ‘ది ప్రింట్‌’కి ఇచ్చిన వివరాలు వింటే మతి పోయింది. ఉదయం 6 గంటలకు నగంగా తయారైన స్వాముల వారికి ‘మసాజ్‌’ చెయ్యాలి. మధ్యాహ్నం 2:30కి బలవంతపు శృంగారం. రోజూ ఇదే తంతు. ఈ తంతులను కళ్లజోడులో అమర్చిన కెమెరా ద్వారా రహస్యంగా రికార్డు చేశానని, తన దగ్గర వున్న వీడియోలు ’43’ పెన్‌ డ్రైవ్‌లో పెట్టి ‘సిట్‌’ బృందానికి ఇచ్చానని కూడా చెప్పింది.
ఆగస్టులో ఆమె ఫిర్యాదు చేస్తే, అది కూడా మెజిస్ట్రేటు ముందు ఆమె ప్రకటన చేసిన తరువాత కూడా అతనిని అరెస్టు చెయ్యలేదు. సెప్టెంబరు 20న అంటే దాదాపు కేసు వెలుగు లోకి వచ్చిన నెల రోజుల తరువాత చిన్మయానందను అరెస్టు చేశారు. అది కూడా అత్యాచారం కేసు కాదు. ‘అధికార దుర్వినియోగంతో లైంగిక చర్యకు పాల్పడ్డా’డని. అదేమిటో? ఒక స్వామీజీ అందునా తన కాలేజీలో చదువుకుంటూ తన దగ్గర పని చేస్తున్న యువతిని లొంగదీసుకొని లైంగిక చర్యకు పాల్పడటాన్ని ‘రేప్‌’ అనక మరేమంటారో. ఎవరి సలహా పాటించాడో ఏమో! నగంగా మసాజ్‌లు, ఒళ్లు పట్టించుకోడాలు నిజమేనని, అందుకే విచారిస్తున్నానని ‘సిట్‌’ బృందం ముందు ఒప్పుకున్నాడు. పరమ రోతగా లేదూ? మన ఖర్మగాలి స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులే భగవత్‌ స్వరూపులుగా చలామణి అవుతున్నారు. ‘లా’ చదివిన అమ్మాయికే ఈ గతి పడితే వీళ్లని దేవుళ్లుగా చూసే అమాయక భక్తుల సంగతేంటి? ఈ రోజుల్లో తీర్థయాత్రలు, ఆశ్రమాలు, మఠాలు, స్వామీజీల బోధలు పెరిగిపోయాయి. జనం అమాయకత్వాన్ని, మూఢభక్తిని ఉపయోగించుకొని ప్రజలను పిచ్చివాళ్లను చేసే స్వామీజీలు పెరిగిపోయారు.
ఇదిలా వుంటే తాజాగా బాధితురాలినే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆమెపై మోపిన నేరం ఏమంటే స్వామీజీని బెదిరించి డబ్బు గుంజే ప్రయత్నం చేసిందని. పరిస్థితిని గమనించిన బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఆమె బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆమెను ‘సిట్‌’ బృందం అరెస్టు చేసి జైలుకు పంపింది. అయోధ్య రాముడు, కాశీ విశ్వనాథుడు, బదరీనాథుడు ఇత్యాది దేవతల సాక్షిగా బాధిత మహిళ జైలు ఊచలు లెక్క పెడుతుంటే, ‘స్వామి వారు’ లక్నో ఆస్పత్రిలో సేద తీరుతున్నారు.
వ్యాస సమాచారం కోసం ఇంటర్నెట్‌ చూసినప్పుడు ‘సాములోరి సిత్రాలు’ చాలానే దొరికాయి. ఈ స్వామికి లౌకిక ప్రపంచంలో బంధాలు బాగానే వున్నాయి. భక్తులకు చెప్పడానికే ఆత్మ, పరమాత్మ, ఇహలోకం, పరలోకం వగైరా. విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి), రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్‌) లో ఈయన ప్రముఖుడు. అయోధ్య రామ జన్మ భూమి ఆందోళనల్లో, బాబ్రీ మసీదు పడగొట్టే ప్రణాళిక సూత్రధారుల్లో ఒకడు. ఈ విషయాన్ని ‘జస్టిస్‌ లిబర్హన్‌ కమిషను’ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పార్లమెంటులో అయోధ్య సమస్యపై చాలానే ఉపన్యాసాలు చేశాడు. హిందూ సమాజ స్థాపనే ధ్యేయమనే పెద్దమనుషులకు స్త్రీలను చెరపట్టడం తప్పు అనిపించకపోవడమే బాధాకరం.
ఇక కాలేజీలు, విద్యా సంస్థలు చాలానే స్థాపించడంతో అధికారం ఉంది కనుక ప్రభుత్వ నిధులు కూడా విద్యాసంస్థల్లో బాగానే చేరాయి. రాజకీయాల్లోను, విద్య పేరుతో వ్యాపారం చేయడంలోను ఈయన ఆరితేరినవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ స్వామీజీ షాజ్‌హాన్‌పూర్‌ ప్రాంతంలో మకుటం లేని మహారాజు. అధికారులతో సహా ఏ ఒక్కరూ ఎదురు చెప్పరు, చెప్పలేరు. ముఖ్యమంత్రి దోస్తీ వుండనే వుంది. ఇంక బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశించగలమా?

( వ్యాసకర్త ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు )

Leave a Reply