నలుగురు యువకుల చేతుల్లో నరకం చూసిన బాలిక

0
212
  • బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు..
  • కారులో వచ్చిన మరో ముగ్గురు..
  • సామూహిక అత్యాచారయత్నం

పటాన్‌చెరు, జనవరి : తల్లిదండ్రులను చూసేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ 16ఏళ్ల బాలికకు భయానక అనుభవం ఎదురైంది. నలుగురు ఉన్మాదుల చేతిలో నరకం చూసింది. ఒంటి మీద బట్టలు లేకుండా పొదల మాటున అరగంటపాటు బిక్కుబిక్కుమంటూ గడిపిందా బాలిక! సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని వాణీనగర్‌ శివారులో గురువారం ఈ దారుణం బాధితురాలి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు రెండేళ్ల క్రితం వాణీనగర్‌కు వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పనికి కుదిరారు.

శ్రీకాకుళం జిల్లాలో అమ్మమ్మ వద్ద ఉంటున్న ఈ దంపతులు కుమార్తె పది రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చింది. గురువారం ఉదయం 10గంటల సమయంలో బాలిక, ఇంటి సమీపంలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఓ యువకుడు బైక్‌ మీద ఎక్కించుకొని నిర్మానుష్యంగా ఉండే చక్రపురి అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి కారులో మరో ముగ్గురు యువకులు చేరుకున్నారు. ఆమె నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని దూరంగా విసిరేసి నిర్బంధించారు. నలుగురూ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. అంతలో ఆ వైపు మరో కారు రావడాన్ని చూసి యువకులు పారిపోయారు. తన సెల్‌ఫోన్‌ను వెతుక్కొన్న బాలిక, తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి దారుణం గురించి చెప్పింది. కాలనీకి చెందిన 20మంది యువకులు బాలికను గాలిస్తూ చక్రపురికి చేరుకున్నారు. పొదల మాటున బాలిక వివస్త్రగా ఉందని తెలుసుకొని బట్టలు తెప్పించి ధరింపజేశారు. అనంతరం డయల్‌ 100కు ఫోన్‌ చేయగా అమీన్‌పూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అత్యాచారమని చెప్పి అంతలోనే.. : తొలుత తనపై నలుగురు యువకులు అత్యాచారం చేశారంటూ పోలీసులకు బాలిక తెలిపింది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని వైద్యులు తేల్చారు. అనంతరం బాలికను మహిళా ఎస్సై మరోమారు ప్రశ్నించగా మాటమార్చింది. తనపై గుర్తు తెలియని నలుగురు యువకులు అత్యాచారయత్నమే చేశారని.. ఆ వైపు కారు రావడంతో వదిలేసి పారిపోయారని చెప్పింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాలనీలో గురువారం విద్యుత్తు సరఫరా లేకపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయలేదన్నారు. ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలను విశ్లేషిస్తున్నామన్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply