కొత్త పాలకుడి సరి కొత్త చేష్టలు!

0
47

-రంగనాయకమ్మ

అసెంబ్లీల సమావేశాలు అతి తక్కువగా మాత్రమే జరుగుతూ, శాసనాలు చేసేస్తాయి. వాటి కోసం, రెండో రాజధానిలో మంత్రులూ, అధికారులూ, కార్యక్రమాలు చేస్తారు. మూడో రాజధానిలో న్యాయాల-అన్యాయాల విచారణలూ, తీర్పులూ జరుగుతాయి. నాలుగో రాజధాని కూడా ఉంటే, అక్కడ పాలకుల పుట్టిన రోజుల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవచ్చు.

‘కేంద్రీకరణా, వికేంద్రీకరణా’! ఈమాటల్ని రోజూవారీగా ఎప్పుడైనా అంటామా, వింటామా? ఈ నాడైతే, ఈ మాటలు వినపడని గంట వుండడం లేదు! పరిపాలనా వికేంద్రీకరణ -అట! అభివృద్ధిలో వికేంద్రీకరణ- అట! ఈ ‘కరణలు’ ఇంకా ఉండొచ్చు ఏవేవో! రోజూ వారీ మాటలన్నీ, కేంద్రీ–వికేంద్రీకరణలైపోతున్నాయి!

అన్నిటికన్నా ప్రధానమూ, అన్నిటికీ అసలైన అర్ధమూ, ‘రాజధాని వికేంద్రీకరణ’ గా తేలుతోంది. ‘వికేంద్రీకరణ’ అంటే, ఒక రాజధానిని మూడు రాజధానులుగా విడదీయడమే అన్నమాట!

అసమానతలతో నిండివున్న ఈ నాటి సమాజంలో, ఏ పాలకుడి పాలన అయినా దాదాపు ఒకటే గానీ, కొత్త పాలకుడిలో అయితే, కేంద్రీకరణాలన్నీ వికేంద్రీకరణలై పోతున్నాయి.

కొత్త ఆంధ్ర రాష్ట్రంలో, ఇప్పటి సమస్య, ‘రాజధాని ఎక్కడ’ అనేదే! అది ఒక్క చోటే ఉండాలా, వేరు వేరు చోట్ల ఉండాలా అనేదే! కానీ, రాజధాని, ‘ఒక్క చోటే’ అని పాత పాలనలోనే నిర్ణయమైంది. దాన్ని, ఆ నాటి ప్రతి పక్షం కూడా ‘‘మన స్ఫూర్తిగా’’ అంగీకరించింది. ఆ నాడు, వేలాది చిన్నా, పెద్దా రైతులు, ఆ నాటి ప్రభుత్వంతో, ఒక ఫలానా ఒప్పందం ప్రకారం, ‘రాజధాని’ కోసం, అమరావతి ప్రాంతం లో తమ భూముల్ని అప్పజెప్పారు. ఆ ఒప్పందం, ‘చట్ట ప్రకారమే’ జరిగింది కూడా! కానీ, ఆ ఒకే రాజధాని, ఇప్పుడు పెద్ద సమస్య అయింది. కారణం, ఆ నాటి ప్రతి పక్ష నాయకుడు, ఇప్పుడు, ‘కొత్త పరిపాలకుడై’ పోవడమే! నిన్న ఒక్క రాజధానినే ‘‘మన స్ఫూర్తిగా’’ అంగీకరించిన నాయకుడు, ఇప్పుడు మూడు రాజధానుల్ని కూడా నిన్న ఉన్నంత ‘‘మన స్ఫూర్తిగానే’’ అంగీకరిస్తున్నాడు! అతడి మనసు, ఎటైనా వొంగగలదేమో!

‘అమరావతి’ని, శాసనాలు చేసే అసెంబ్లీ రాజధానిగా మాత్రమే ఉంచి, విశాఖ పట్నాన్ని కార్య నిర్వహణ కోసం రెండో రాజధాని గానూ, న్యాయ వ్యవహారాల కోసం కర్నూలుని మూడో రాజధానిగానూ నిర్ణయించడం అయింది. నాలుగో రాజధాని ఇప్పటికి లేదనుకోండీ!

అసెంబ్లీల సమావేశాలు అతి తక్కువగా మాత్రమే జరుగుతూ, శాసనాలు చేసేస్తాయి. వాటి కోసం, రెండో రాజధానిలో మంత్రులూ, అధికారులూ, కార్యక్రమాలు చేస్తారు. మూడో రాజధానిలో న్యాయాల-అన్యాయాల విచారణలూ, తీర్పులూ జరుగుతాయి. నాలుగో రాజధాని కూడా ఉంటే, అక్కడ పాలకుల పుట్టిన రోజుల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవచ్చు. ఇది భవిష్యత్తులో జరగదని అనుకోనక్కరలేదు.

రాజధాని అనేది ఒక చోట కాక, మూడు చోట్లఏర్పడితే, అది ‘అమరావతి’కి సమస్య కాదు; ఆ భూముల్ని వదులుకున్న రైతు కుటుంబాలకే అది సమస్య. పోనీ వాళ్ళ భూముల్ని వాళ్ళు వెనక్కి తీసివేసుకోదలిస్తే, అది సాధ్యం అయ్యేది కాదు. ఆ పంట భూములు, విశాలమైన రోడ్ల కిందా, అపార్టుమెంట్ల భవనాల కిందా, చదు నైన భాగాల కిందా, నిద్రలు పోతున్నాయి. ఆ నిర్మాణాలన్నిటినీ తవ్వి, పాత పంట చేలని నిద్రలు లేపడం సాధ్యం అయ్యేటటువంటి కాదు. అందుకే రైతుల ఉత్సాహాలు నీరై పోతున్నాయి. వారు, కొత్త పాలకుడి మీదా, కొత్త ప్రభుత్వం మీదా, నెలల తరబడీ, నిరసనలతో, వ్యతిరేకతలు ప్రదర్శిస్తున్నారు, శాంతంగానే! ఎటొచ్చీ, అమరావతి కోసం ‘జై, జై’ అంటున్నారు, అంతే! అంతకంటే, వాళ్ళే ఘోరాలూ చెయ్యడం లేదు. కానీ, కొత్త పాలకుడికి ఇతరుల ‘జై, జై’లు నచ్చవనుకుంటా! అందుకే వాళ్ళ మీదకి పోలీసుల్ని పంపాడు.

ఇంతకీ, ‘వికేంద్రీకరణ’అనేది, పరిపాలనలో ఎలా ఉంటుందో, అభివృద్ధిలో ఎలా ఉంటుందో – అనే వాటిని, శ్రామిక ప్రజల ప్రయోజనాల దృష్టితో చూడడమే ముఖ్యం. పరిపాలనలో ‘వికేంద్రీకరణ’ అనేది, 1871 లో స్వల్ప కాలమే వుండిన ‘పారిస్ కమ్యూన్’ లానో; సాంస్కృతిక విప్లవ కాలంలో, చైనాలో కొన్నేళ్ళు వుండిన ‘కమ్యూన్ వ్యవస్త’ లానో, వుండవచ్చు. లేదా, ఆ అనుభవాల ఆధారంగా, మరింత మెరుగ్గానో! కానీ, ప్రస్తుతం, శ్రామిక వర్గ ప్రభుత్వాలు గానీ, అసమానత్వాలు లేని సమాజాలు గానీ, లేవు కదా? అయినప్పటికీ, ‘వికేంద్రీకరణ’అనే దాన్ని కొన్ని పరిమితుల్లో అయినా, ఒక ‘సంస్కరణ’ గా అయినా, ఈ నాటి సమాజాల్లో కూడా ఎలా అమలు చేయాలో చూడవచ్చు.

గ్రామ పంచాయితీలూ, మండలపరిషత్తులూ, మునిసిపాలిటీలూ, జిల్లా పరిషత్తులూ- అంటూ, ‘స్థానిక పరిపాలనా వ్యవస్థలు’ వున్నాయి గదా, ఈ రాష్ట్రంలో? రాష్ట్ర స్థాయిలో వున్న ప్రభు త్వం పరిపాలనా విధుల్నీ, అధికారాల్నీ, చాలా వాటిని స్థానిక సంస్తలకు బదిలీ చెయ్య కూడదా?- చెయ్యవచ్చు. ముఖ్యంగా, గ్రామ పంచాయితీలకు!

ఒక గ్రామంలో, భూమి లోపల ఇనుమో, బొగ్గో, ఆయిలో, వెండో, బంగారమో, అలా ఏవో పదార్ధాలు ఉన్నాయని తేలిందనుకుందాం. ఆ భూమి నంతా, ఒకరిద్దరు పెట్టుబడిదారులకు అప్పజెప్పేస్తే, వాళ్ళు కార్మికులతో ఆ గనుల్ని తవ్వించి, చివరికి కోట్ల, కోట్ల లాభాల్ని స్వంత ఆస్తులుగా సంపాదిస్తారు. ఆ గ్రామస్తులందరూ ఆ భూమి మీద నివాసాల్ని వదిలేసి, చెట్టుకొకరూ, పుట్టకొకరూ పోవాలి. ఆ మార్పుల్లో అనేక లక్షల మంది గుండెలాగి చావాలి. ఇలా గాక, ఆ భూమి మీద అధికారం, ఆ గ్రామస్తులకే ఉంటే? ఉండదు! ఆలా ఉండనప్పుడు, అది ‘పాలనాధికార వికేంద్రీకరణ’ ఎలా అవుతుంది? మరి, ‘గ్రామాలు దేశానికి గుండెకాయల వంటివి’ అనీ, ‘స్థానిక స్వపరిపాలన కావాలి’ అనీ పాలకులు చిలక పలుకు వల్లిస్తారే? స్థానిక సంస్థలకి పాలనా పరమైన అధికారాలు ఇస్తేనే, అది పరిపాలనా వికేంద్రీకరణ అవుతుంది. అంతే గదా? కానీ, ‘శాసనాల కోసం’ ఒక రాజధానికీ, కార్య నిర్వహణ కోసం ఇంకో రాజధానికీ, న్యాయ వ్యవహారాల కోసం మరో రాజధానికీ …ఇలా వూళ్ళు పట్టుకు తిరగడం అంటే, అది ‘తిరుగుళ్ళ-వికేంద్రీకరణ’ అవదూ? అంతే గానీ, అది పరిపాలనా-వికేంద్రీకరణ అవుతుందా? (దేశంలో, రాష్ట్రంలో, అనేక అసమానతలు— కులభేదాలుగా, మత భేదాలుగా, స్త్రీ-పురుష అసమానత్వాలుగా, ధనిక-పేద తేడాలుగా, గ్రామాలకూ-పట్టణాలకూ వైరుధ్యాలుగా— ఇన్ని సమస్యలు వున్న విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు, పరిపాలనలో ప్రజలు భాగస్వాములుగా అవుతున్నారా? కేవలం ‘ఓటర్లు గానే’ ఉండిపోతున్నారు. కానీ, ప్రజలు ఎల్లకాలమూ ఓటర్లుగా మాత్రమే ఆగి పోతారనుకుంటామా? ఈ నాటి అమాయక ప్రజలు, క్రమంగా, కళ్ళు తెరిచి, స్వపరిపాలకులుగా తయారవుతారు. అది ఎప్పుడూ, ఎలా అనేది వేరే చర్చ.)

ఇక పోతే, అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు కావాలనే వాదన గురించి ఈ నాటి చర్చ. అభివృద్ధి అంటే, అందరికీ తిండీ, బట్టా, నివాసం, చెయ్యడానికి పనీ—ఇవి ఆర్ధికాభివృద్ధికి కనీసంగా కావలిసినవి. ‘పరిపాలన’లో పాత్రా; ప్రతినిధులు చెత్తగా మారితే, వారిని తక్షణం, ఎప్పుడంటే అప్పుడు వెనక్కి పిలిచే హక్కూ-వంటివి, రాజకీయ అభివృద్ధికి గుర్తులు. కుల తత్వం, మత తత్వం, స్త్రీలపై అణచివేతా, నిరక్షరస్యతా – వంటివి లేకపోవడం, సాంఘిక జీవనంలో అభివృద్ధికి గుర్తు లు. ‘శ్రమ దోపిడీ’నే, సహజమైన విషయంగా భావించే ప్రభుత్వాలు వున్న ఈ ప్రపంచంలో ఈనాడే ఆ మార్పుల్ని ఆశించడం అత్యాశే అయినా, కొన్ని విషయాల్లో అత్యాశ కూడా అవసరమే!

ఈనాడైనా, కనీసంగా నైనా చెయ్యగలిగే మార్పులు కొన్ని వుంటాయి. కొన్ని ప్రాంతాలు సముద్ర తీరాన వుంటాయి, కొన్ని చోట్ల వాటి జాడలే వుండవు. కొన్ని ప్రాంతాల్లో నదులు రయ్యిన ప్రవహిస్తోంటే, కొన్ని చోట్ల నీళ్ళ చుక్కలే రాలవు. కొన్ని ప్రాంతాల్లో సారవంతమైన భూములుంటే, కొన్ని ప్రాంతాలు రాళ్ళ మయాలే. పాలకులనేవాళ్ళు, గత చరిత్రలోనైనా, ఆధునిక కాలంలో అయినా చెయ్యవలిసింది, ప్రాంతాలలోని ప్రకృతి వనరులను ఆధారం చేసుకుని, తగిన ప్రణాళికలు నిర్ణయించు కోవాలనేదే కదా? ఎక్కడ ఏ రకమైన వ్యవసాయం అవసరమో; ఎక్కడ ఏ రకం పరిశ్రమలు సాధ్యమో; వేరు వేరు ప్రాంతాల మధ్య ఏ రకం మారకాలు జరగాలో-ఇటువంటి ఆలోచనలు చెయ్యడం ద్వారా, ప్రాంతాల మధ్య అసమానతల్ని తగ్గించే ప్రయత్నాలు సాధ్యం కాదా? ఈ కార్యక్రమాలు మానేసి, ప్రభుత్వ యంత్రాంగం లో ఒక చక్రాన్ని ఒక చోటా, ఇంకో చక్రాన్ని ఇంకో చోటా; ఒక మరని ఒక చోటా, ఇంకో మరని ఇంకో చోటా పెట్టి; రాజకీయ ప్రత్యర్ధిని దెబ్బకొట్టగలిగానని ఏ పాలకుడైనా భావిస్తే, అది తాత్కాలిక ఆనందమే. ఇటువంటి చేష్టల మధ్య నలిగి పోయేది అన్ని ప్రాంతాల ప్రజలే!

అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో ధనిక రైతులూ, పేద రైతులూ, అన్ని రకాల వారూ ఉన్నారని వింటు న్నాం. వారిలో ఎవ్వరైనా, ఏ ఒక్కరైనా, ‘జగన్ మనసు మారాలి. మా అభ్యర్ధనను ఆలకించాలి’ అనే మాటలు అన్నారంటే, ఆ మాటలు, వారి నిస్సహాయత నించి వచ్చినవే కావొచ్చు. అయినా, అటువంటి యాచనలు, వారికి అవమానకరమైనవే అవుతాయి. నిరసనల పోరాటాల్లో, ఎంతెంత నిరుత్సాహాలు చుట్టుముట్టినా, వారి ఆత్మ గౌరవాన్ని వారు మరిచి పోకూడదు. ఒక్క పొరపాటు మాట పలికినా, అది వారిని తీవ్రంగా చులకన చేసేస్తుంది సుమా!

Courtesy Andhrajyothi

Leave a Reply