రియల్ హీరో సోనూసూదే

0
27

– అతన్ని కదిలించింది పిల్లల కోసం ఓ తల్లిపడ్డ తపనే
– గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో వలసకార్మికులకు బాసట
– నేడు కోవిడ్‌ రోగులకు అన్ని విధాలుగా అండ
– అందరూ కదిలేలా సేవా కార్యక్రమాలు

హైదరాబాద్‌ : పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ తల్లి పడ్డ తపన సోనూసూద్‌ ఆలోచనా సరళినే మార్చేసింది. ఎవరికి ఏ అవసరమొచ్చినా..ఆపదొచ్చినా..నేడు దేశ ప్రజలకు గుర్తుకొస్తున్నది మన పాలకులు కాదు..ది గ్రేట్‌ పర్సన్‌ అతనే. నట జీవితంలో ప్రతి సినిమాలోనూ విలన్‌ కావొచ్చుగానీ..నిజం జీవితంలో తానే రియల్‌ హీరో. రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ కోనిచ్చి వెన్నుదన్నుగా నిలబడ్డా..దయలేని రాజ్యం రాత్రికిరాత్రే లాక్‌డౌన్‌పెడితే వలసకార్మికులకు బాసటగా నిలిచినా..పేదల ఆకలి తీర్చేందుకు చేస్తున్న యత్నం..ఇలా దేనికదే ఓ ప్రత్యేకత. ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ అందక అల్లాడుతుంటే అయ్యో నా దేశ ప్రజలకు ఎంతటి కష్టం? అంటూ ముందుకొచ్చి ఏకంగా ప్రాణవాయువు ప్లాంట్లనే ఏర్పాటుచేయిస్తున్న అపర సంజీవుడు. ఇలా చెప్పుకుంటే పోతే సోనూసూద్‌ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల కంటే వేగంగా స్పందిస్తూ పెద్ద మనుస్సుతో దేశ ప్రజలకు అండగా నిలుస్తున్న సోనూసూద్‌ సేవా కార్యక్రమాలు కోకొల్లలు.

సోనూను కదిలించిన తల్లి వేదన..
అది ముంబయి నగరానికి శివారులోని బాంద్రా ప్రాంతం. గతేడాది లాక్‌డౌన్‌ పెట్టిన మూడోరోజు అంటే మార్చి 27న సోనూసూద్‌ వెళ్తుండగా కారుకు అడ్డంగా ఓ దినసరి కూలి వచ్చి ఏడ్చుకుంటూ నిలబడింది. తమ పిల్లల ఆకలి తీర్చాలంటూ ఆ తల్లి వేడుకున్నది. పిల్లలు ఏడుస్తుంటే దగ్గరకు పోయి ‘అన్నం ఉడుకుతున్నది’ అంటూ గిన్నెలో కలబెట్టింది. సోనూసూద్‌ అక్కడకెళ్లి చూడగా ఆ గిన్నెలో రాళ్లుకనిపించాయి. తన పిల్లల ఆకలి మంటను చల్లార్చేందుకు ఆ తల్లి చేస్తున్న విఫలయత్నం సోనూసూద్‌ హృదయాన్ని ద్రవింపజేసింది. ఆలోచింపజేసింది. కోవిడ్‌ కష్టకాలంలో పేదలకు అండగా నిలబడాలనే బీజం అతనిలో నాటుకుపోయింది.

వలసకార్మికులను సొంతూర్లకు పంపడం..
గతేడాది మార్చి 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపటి ఉదయం నుంచే లాక్‌డౌన్‌ అంటూ ప్రకటించేశాడు. దీంతో నిలువనీడ చోటు లేక, తినేందుకు తిండిదొరక్క వలస కార్మికులు, దినసరి కూలీలు అలమటించారు. రైళ్లు, బస్సు సేవలు నిలిచిపోవడంతో సొంతూర్లకు కాలిబాటన బయలుదేరిన విషయం తెలిసిందే. వందల కిలోమీటర్లు నడిచే క్రమంలో కాళ్లకు బొబ్బలు రావటం, చనిపోవడం సోనూసూద్‌ను కదిలించాయి. తన సొంత ఖర్చుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయించి సొంతూర్లకు చేర్చి వారి కన్నీళ్లు తూడ్చాడు. అదే సమయంలో వారి ఆకలి కూడా తీర్చాడు. అంతటితో ఆగిపోలేదు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారినీ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చాడు. ఇలా 17.5 లక్షల మంది వలస కార్మికులను తమ సొంత ప్రదేశాలకు చేర్చి కేంద్ర ప్రభుత్వ డొల్లతనాన్ని పరోక్షంగా ఎత్తిచూపాడు. లైఫ్‌సేవర్‌గా మారిపోయాడు.

వేడుకుంటే చాలూ.. నేనున్నానంటున్న సోనూ
ఆక్సిజన్‌ ప్రాణవాయువు. సెకండ్‌ వేవ్‌లో కరోనా రక్కసి ఆ వాయువును అందకుండా చేసి రోగులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నది. ప్రాణాలనూ హరిం చివేస్తున్నది. ఈ విపత్తును అంచనా వేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఇలాంటి సమయంలో సోనూసూద్‌ నేనున్నానంటూ ప్రాణదాతగా ముందుకొచ్చాడు. బెంగుళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు అయిపోయి రోగులు అల్లాడుతున్నారన్న ఓ పోలీసు అధికారి చేసిన ట్వీట్‌కు అంతే వేగంగా స్పందించి ప్రాణవాయువు సిలిండర్లను ఏర్పాటు చేయించి 22 మంది ప్రాణాలను నిలబెట్టారు. వెంకట రమణ అనే కోవిడ్‌ రోగికి అత్యవసర మందులు అవరమంటూ వచ్చిన సందేశానికి స్పందించి సమకూర్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కైలాశ్‌ అగర్వాల్‌ను ఎయిర్‌ ఆంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు. కరోనా సోకినవారి ప్రాణాలను కాపాడగలిగితే అది 100 కోట్ల సినిమా చేయడం కంటే కొన్ని లక్షలరెట్లు ఎక్కువ సంతృప్తినిస్తుందని సోనూసూద్‌ ఆ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సామాన్యులకే కాదు…సినీ ఇండ్రస్టీ, రాజకీయ, క్రికెటర్లకూ సోనూ సాయం చేస్తున్నాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా తన ఆంటీకి ఆక్సీజన్‌ సిలిండర్‌ అవసరమంటూ పోస్ట్‌ పెట్టగానే.. 10 నిమిషాల్లో ఆక్సిజన్‌ సిలిండర్‌ అందించాడు. మరో క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌కూ ఇదే రకమైన సహాయాన్ని చేశాడు. ఇవి మచ్చుకు కొన్నే. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు నెలకొల్పేందుకు సోనూసూద్‌ సిద్ధమయ్యారు. చైనా, తైవాన్‌, ఫ్రాన్స్‌ సహా ఇతర దేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

24/7 అలర్ట్‌గా సోనూ టీమ్‌
సోనూసూద్‌ టీమ్‌ నిద్రలు లేని రాత్రులు గడుపుతూ సోషల్‌మీడియా వేదికగా కోవిడ్‌ బాధితులు, వారి సన్నిహితులు చేస్తున్న పోస్టులకు అంతేగా వేగంగా స్పందిస్తూ సహాయాన్ని అంద జేస్తున్నది. గతేడాది నలుగురు సభ్యులతో ప్రారంభమైన ఈ టీమ్‌ నేడు 400 మందికి చేరింది. ఆ బృందంలో సోనూసూద్‌ భార్య సోనాలి, స్నేహి తురాలు నీతూగోయల్‌ కీలకంగా వ్యవహరిస్తు న్నారు. సహాయం పొందిన వారు తమకు తోచిన సహాయాన్ని తిరిగి చేస్తున్నారు.

ప్రతి రోజూ ఆ టీమ్‌కు సోషల్‌మీడియా, ఫోన్ల ద్వారా 40 నుంచి 50 వేల విన్నతులు వస్తున్నాయి. వాటిలో సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తున్నామని సోనూసూద్‌ టీం చెప్పింది. సోనూ సేవలను గుర్తించిన స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ తమ విమానంపై సోనూసూద్‌ ఫొటోను ముద్రించి అభినందించింది. దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ సంస్థల ప్రశంసలనూ పొందుతున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply