కొవిడ్‌ విస్తరణకు పచ్చజెండా?

0
545

సాధారణ పరిస్థితుల్లో 12వేలకుపైగా రైళ్లలో రోజూ సగటున 2.3కోట్లమంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చే బృహత్‌ వ్యవస్థ భారతీయ రైల్వేది. కరోనా మహమ్మారి విస్తృతిని కట్టడి చేసే లక్ష్యంతో లాక్‌డౌన్లు అమలులోకి వచ్చాక, రైళ్ల చక్రాలూ స్తంభించిపోయాయి. ఉన్నట్టుండి ఎక్కడికక్కడ నిలిచిపోయిన కోట్లాది వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు… సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు రైళ్లకోసం వారాల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మే నెల ఒకటో తేదీనుంచి శ్రామిక్‌ స్పెషల్‌ శకటాలు, వాటిని వెన్నంటి ప్రత్యేక ఏసీ ట్రెయిన్లు నడుపుతుండగా- జూన్‌ ఒకటో తేదీన రెండువందల ప్యాసింజర్‌ రైళ్ల సందడి మొదలు కానుంది. వాటికి వారంక్రితం ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రారంభమయ్యాక రెండున్నర గంటల్లోనే నాలుగు లక్షల టికెట్ల విక్రయం- విరామానంతర విపరీత గిరాకీని కళ్లకు కట్టింది. దేశీయంగా లక్షన్నరకు పైబడిన కొవిడ్‌ కేసులు జూన్‌ 17నాటికి అయిదు లక్షలకు మించిపోతాయన్న అంచనాల వెలుగులో, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకంటూ భారతీయ రైల్వే నిర్దిష్ట నిబంధనావళిని జారీ చేసింది.

రైలు బయలుదేరే సమయానికి గంటన్నర ముందే ప్రయాణికులు స్టేషన్లకు చేరుకోవాలని, తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విధినిషేధాలను స్పష్టీకరించింది. జ్వరం, దగ్గులాంటి లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తామన్న రైల్వే- ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పరుస్తామనీ చెబుతోంది. శ్రామిక్‌ రైళ్లకు పచ్చజెండా ఊపినప్పుడూ ఇంచుమించు ఇటువంటి మార్గదర్శకాలనే క్రోడీకరించారు. వాస్తవంలో ‘సామాజిక దూరం’ నిబంధన కొల్లబోయింది. చాలాచోట్ల శ్రామిక్‌ రైళ్ల ప్రయాణికులు భారీ సంఖ్యలో గుమిగూడిన ఉదంతాలు నమోదయ్యాయి. ఆ అనుభవాల దృష్ట్యా, తాజా నిర్దేశాలకు ఏపాటి మన్నన దక్కుతుందన్న సందేహాలు, ఎక్కడ ఏం పుట్టి మునుగుతుందోనన్న భయాందోళనలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.

ఉత్కంఠభరిత సుదీర్ఘ నిరీక్షణానంతరం శ్రామిక్‌ రైళ్లకు అనుమతులు జారీ కావడంతోనే అసంఖ్యాక వలస కూలీలు తమ పేర్ల నమోదుకు కార్యాలయాల ఎదుట బారులు తీరారు. తద్వారా లాక్‌డౌన్‌ మౌలిక స్ఫూర్తికి విఘాతం వాటిల్లుతున్నా పట్టించుకున్నదెవరు? సుమారు నాలుగు వారాల వ్యవధిలో మూడున్నర వేలకుపైగా శ్రామిక్‌ రైళ్లద్వారా దాదాపు 48 లక్షలమందిని స్వస్థలాలకు చేర్చామని భారతీయ రైల్వే లెక్క చెప్పింది. అందులో రెండున్నరవేల దాకా రైళ్లు యూపీ, బిహార్‌ ప్రయాణికులకు ఉద్దేశించినవే. తొలుత ఒక్కో రైలులో 12 వందలమందినే అనుమతిస్తామన్న అధికార యంత్రాంగం, వలస కూలీల రద్దీని తట్టుకోవడానికంటూ ఆ సంఖ్యను 17 వందలకు విస్తరించింది. అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతి పొంది రైలెక్కినవారు రోగలక్షణాలు లేనివారే కాబట్టి భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏముందన్న వాదనలూ వినిపించాయి.

మొదట ఖరారైన నిబంధనల్ని సడలించి నీరుకార్చిన దుష్ఫలితాలు ఇప్పుడు ప్రస్ఫుటమవుతున్నాయి. ముంబయి-హరిద్వార్‌ శ్రామిక్‌ స్పెషల్‌లో ప్రయాణించిన 87మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్రామిక్‌ రైళ్ల రాకపోకలు ఆరంభమయ్యాక కేసుల ప్రాతిపదికన భారీ పెరుగుదల నమోదైనట్లు కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభృత రాష్ట్రాలు గణాంకాలు ఉటంకిస్తున్నాయి. పదిరోజుల్లో ఇంకో రెండున్నర వేలదాకా రైళ్లు నడిపి మరో 36 లక్షలమందిని వారి స్వస్థలాలకు చేరుస్తామని, ప్యాసింజర్‌ రైళ్లద్వారా జనజీవనంలో చురుకు పుట్టిస్తామని ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన కేంద్రం- వైరస్‌ ఉద్ధృతికి దోహదపడే కంతలన్నింటినీ పూడ్చేయాలి. అసాధారణ విపత్కర పరిస్థితిలో కరోనా వ్యాప్తికి మార్గాలన్నీ మూసేయడంలో అలసత్వం ఆత్మహత్యా సదృశ్యమవుతుంది!

Courtesy Eenadu

Leave a Reply