ఫేస్‌బుక్‌లో దొంగ ప్రచారం!

0
111

బీజేపీకి అనుకూలంగా భారీ ఎత్తున రాజకీయ ప్రకటనలు
ప్రతిపక్షాలపై తప్పుడు కథనాలు, వక్రీకరణలు
ప్రకటనలు ఇస్తున్నది..గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలు
రాజకీయ ప్రకటనలపై కోట్లాది రూపాయలు ఖర్చు
రిలయన్స్‌ జియో నుంచి అడ్వర్టైజ్‌మేంట్స్‌: స్వతంత్ర పరిశోధనలో వెల్లడి

శివాజీ పాలన మళ్లీ వచ్చింది. మీకు ఆ తేడా స్పష్టంగా కనపడుతోందిఅనేది బీజేపీ ఎన్నికల అభ్యర్థుల కోసం రూపొందించిన ప్రకటన. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఫేస్‌బుక్‌లో ఆ రాజకీయ ప్రకటన చాలా వైరల్‌ అయ్యింది. ఈ ప్రకటన ఫేస్‌బుక్‌కు ఎవరు ఇచ్చారు? సంస్థ చిరునామా తెలియదు. ఈ తరహా వాటిని ఘోస్ట్‌, సరోగేట్‌ అడ్వర్టయిజర్స్‌గా పిలుస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఘోస్ట్‌, సరోగేట్‌ అడ్వర్టయిజర్స్‌ నుంచి బీజేపీకి 34,884 అనుకూలమైన రాజకీయ ప్రకటనలు వెలువడ్డాయని ఎన్జీవో సంస్థ ద రిపోర్టర్స్‌ కలెక్టీవ్‌ (టీఆర్‌సీ) ఎడి.వాచ్‌బయటపెట్టింది.

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌లో బీజేపీ, మోడీ సర్కార్‌కు అనుకూలంగా పబ్లిష్‌ అయిన పలు రాజకీయ ప్రకటనలు 23 అడ్వర్టైజర్స్‌ నుంచి వచ్చాయని, ఇవి ప్రకటనల నిమిత్తం ఫేస్‌బుక్‌కు రూ.5కోట్ల రూపాయలు చెల్లించాయని ‘టీఆర్‌సీ’ వెల్లడించింది. పై విషయాలన్నీ తమ స్వతంత్ర పరిశోధన ద్వారా తెలుసుకున్నామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. 23 అడ్వర్టైజర్స్‌లో.. కేవలం ఆరింటి వివరాలు పట్టుకోగలిగామని నివేదిక తెలిపింది. మై ఫస్ట్‌వోట్‌ఫర్‌మోడీ, నేషన్‌ విత్‌ నమో, నేషన్‌ విత్‌ నమో డాట్‌ కాం, భారత్‌ కే మన్‌ మన్‌ కి బాత్‌.. బీజేపీతో సంబంధమున్న అడ్వర్టైజర్స్‌ అని తేలింది. వీటి నుంచి ఫేస్‌బుక్‌లో రూ.3కోట్ల విలువైన రాజకీయ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనల్ని ఫేస్‌బుక్‌లో కోట్లాది మంది వీక్షించారు.

ఫిబ్రవరి 2019-నవంబర్‌ 2020 మధ్యకాలంలో 5.36లక్షల రాజకీయ ప్రకటనలు ఫేస్‌బుక్‌, ఇన్‌సా ్టగ్రామ్‌లలో పబ్లిష్‌ అయ్యాయి. ఇందులో 34,884 ప్రకటనలు బీజేపీ, మోడీ సర్కార్‌కు అనుకూలమైనవి ఉన్నాయి. వీటికిగాను రూ.5.8కోట్లు ఘోస్ట్‌, సరోగేట్‌ అడ్వర్టైజర్స్‌ ఫేస్‌బుక్‌కు చెల్లించాయి. ఊరు..పేరు లేని 23 సంస్థల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనల్ని ఫేస్‌బుక్‌లోని 131కోట్ల మంది వీక్షించారని, దేశంలో 10 రాష్ట్రాల ఎన్నికల సమయంలో 22నెలలపాటు ఈ ప్రకటనలు వెలువడ్డాయని ‘టీఆర్‌సీ’ పేర్కొన్నది. మరొక విషయం ఏమంటే, బీజేపీ, ఆ పార్టీ ఎన్నికల అభ్యర్థులు ఫేస్‌బుక్‌లో ప్రచారానికిగానూ రూ.10కోట్లకు పైగానే ఖర్చు చేశారని తెలిసింది. దాదాపు 26వేలకుపైగా ప్రకటనలు ఫేస్‌బుక్‌లో ఇచ్చారు.

నిబంధనలకు విరుద్ధం
మనదేశంలో ఫేస్‌బుక్‌ వినియోగదారులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు ఒక రాజకీయ పార్టీకి అనుకూలగా మార్చటం లేదా..ఒక పార్టీకి వ్యతిరేకంగా చేయటం ఫేస్‌బుక్‌ నిబంధనలకు విరుద్ధం. అయితే ఈ నిబంధనలు చెప్పుకోవటానికి తప్ప..వాస్తవంగా అమలు కావటం లేదన్న సంగతి బయటపడింది. ఫేస్‌బుక్‌ వేదికపై బీజేపీ, మోడీ సర్కార్‌ అనుకూల ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోందని, తప్పుడు ఆరోపణలు, వాస్తవాల వక్రీవరణతో ప్రతిపక్షాల్ని దెబ్బకొట్టేలా వ్యవహారం నడుస్తోందని ‘ద రిపోర్టర్స్‌ కలెక్టీవ్‌ (టీఆర్‌సీ) ఎడి.వాచ్‌’ వెల్లడించింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలపై చెడు అభిప్రాయం కలిగేట్టు, తప్పుడు కథనాల్ని రూపొందించి పెద్ద సంఖ్యలో ఫేస్‌బుక్‌లో కథనాలు వెలువడ్డాయి. ప్రధాని మోడీకి అనుకూలంగా వీటిని రూపొందించారు. ‘న్యూ ఎమర్జింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ జర్నలిజం’ (న్యూజే) అనేది రిలయన్స్‌ జియోకు చెందిన సంస్థ. ఫేస్‌బుక్‌లో తప్పుడు, దొంగ ప్రచార కథనాలకు ‘న్యూజే’ నుంచి భారీ ఎత్తున అడ్వర్టయిజ్‌మేంట్స్‌ వెళ్లాయి. ఇందుకోసంగానూ 718 రాజకీయ ప్రకటనలపై రూ.52లక్షలు ఖర్చుచేసింది.

ఈసీ..చేతికి చిక్కకుండా..
ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలు ఇవ్వొచ్చు. అయితే ఆ ప్రకటన ఎవరు ఇచ్చారు? దానికోసం చేసిన నగదు చెల్లింపు వివరాలు నమోదుకావాలి. గుర్తు తెలియని, చిరునామా లేని (ఘోస్ట్‌, సరోగేట్‌) వ్యక్తులు, ప్రకటనల ఏజెన్సీలు రాజకీయ ప్రచార ప్రకటనలు ఇవ్వటం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల అభ్యర్థికి సంబంధం లేని థర్డ్‌ పార్టీ సైతం ప్రచార ప్రకటనలు ఇవ్వరాదు. అయితే డిజిటల్‌ మాధ్యమం (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూ ట్యూబ్‌..మొదలైనవి)కు ఈసీ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. దీనిని అధికార బీజేపీ, ప్రధాని మోడీ మద్దతుదారులు అవకాశంగా మలుచుకున్నారని ‘ఫేస్‌బుక్‌ రాజకీయ ప్రకటనల’ ఉదంతం తెలియజేస్తోంది.

Courtesy Nava Telangana

Leave a Reply